హోదా అంటేనే వైసీపీ భయపడి పారిపోతోంది.. కేసుల మాఫీ కోసమే జగన్ ఢిల్లీ టూర్!
posted on Oct 7, 2020 @ 4:24PM
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఎన్డీయేలో చేరే అంశంపై ప్రధాని మోడీతో జగన్ చర్చించారని ప్రచారం జరిగింది. అయితే బీజేపీ నేతలు ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నారు. వైసీపీ నేతలు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమే జగన్ ఢిల్లీ వెళ్ళారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే, విపక్ష నేతలు మాత్రం కేసుల మాఫీ కోసమే జగన్ ఢిల్లీ వెళ్ళారని ఆరోపిస్తున్నారు.
జగన్ ఢిల్లీ పర్యటనపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఘాటుగా స్పందించారు. మీరు ప్రధానితో మాట్లాడింది రాష్ట్ర ప్రయోజనాల కోసమే అయితే ఎందుకు ఆ విషయాన్ని రాష్ట్ర ప్రజలకు వివరించలేకపోతున్నారు? అని ప్రశ్నించారు. ప్రధానితో 40 నిమిషాల పాటు ఈ విషయం మాట్లాడాను, హోదా ఇవ్వాల్సిందే అని నిలదీశామన్న మాట మీరు ప్రజలకు ఎందుకు చెప్పలేకపోతున్నారు? అని నిలదీశారు. పార్లమెంట్‌లో నాలుగో అతిపెద్ద పార్టీగా ఉండి.. ప్రత్యేక హోదాను సాధించలేకపోతున్నారని విమర్శించారు. హోదా అంటేనే వైసీపీ భయపడి పారిపోయే పరిస్థితి కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. హోదా కోసం పార్లమెంట్ ఆవరణలో వైసీపీ ఎంపీలు ఎందుకు పోరాడలేదు? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు పార్లమెంట్‌లో పోరాడితే మేం మద్దతిస్తాం అని రామ్మోహన్ నాయుడు అన్నారు.
ఢిల్లీలో జగన్ రాష్ట్ర ప్రయోజనాల గురించి చర్చించలేదని అన్నారు. జగన్ ను రాష్ట్ర ప్రజల తరఫున సూటిగా ప్రశ్నిస్తున్నామని.. ముఖ్యమంత్రిగా మీరు గెలిచింది మీ కేసులు మాఫీ చేయించుకోవడానికా? లేక రాష్ట్ర ప్రయోజనాలపై పోరాటం చేయడానికా? అని నిలదీశారు. "మీపై 11 సీబీఐ కేసులు సహా 31 కేసులు ఉన్నట్టు మీరే అఫిడవిట్ లో రాసుకున్నారు. మరి మీరు ఢిల్లీ వెళ్లి వివరణ ఇవ్వకుండా ఉంటే అనుమానం రాదా? మీరు వివరణ ఇవ్వకపోతే కేసుల మాఫీ కోసమే వెళ్లారని భావించాల్సి ఉంటుంది. ప్రజలు మిమ్మల్ని నమ్మి గెలిపిస్తే మీరు కేసుల మాఫీ కోసం ప్రయత్నాలు చేయడం సరికాదు" అంటూ రామ్మోహన్ నాయుడు ఘాటుగా వ్యాఖ్యానించారు.