ఎన్డీయేలోకి వైసీపీ.. క్లారిటీ ఇచ్చిన బీజేపీ..
posted on Oct 7, 2020 @ 11:50AM
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేలో చేరాలని వైసీపీని బీజేపీ ఆహ్వానించినట్లు.. దీంతో ఆ పార్టీ కేంద్ర కేబినెట్ లో చేరుతున్నట్లుగా రెండు మూడు రోజుల నుండి తెలుగు మీడియాలో విస్తృతంగా చర్చ జరిగిన సంగతి తెల్సిందే. ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన సందర్భంగా దీని పై ఒక నిర్ణయానికి వస్తారని కూడా చర్చ జరిగింది. ఎన్డీయే నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో చేరితే రెండు క్యాబినెట్ మంత్రి పదవులు, ఓ సహాయ మంత్రి పదవి ఇవ్వడానికి ప్రధాని మోడీ సిద్ధపడినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే సీఎం జగన్ ఢిల్లీ వెళ్లడం.. ప్రధాని మోడీతో దాదాపు 40 నిమిషాల పాటు భేటీ వేసి తిరిగి అమరావతికి రావడం జరిగింది. అయితే వైసీపీ కేంద్రంలో చేరుతుందా అనే విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు.
ఇది ఇలా ఉండగా సీఎం జగన్ ను ఎన్డీయేలోకి ఆహ్వానిచినట్లు వచ్చిన వార్తలపై బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ పార్టీ అధికార వైసీపీతో గానీ ప్రతిపక్ష టీడీపీతో గానీ కలిసే పరిస్థితి లేదని మాధవ్ అన్నారు. ఈ విషయంపై తమ పార్టీ అధిష్టానం ఆలోచన చాలా స్పష్టంగా ఉందని చెప్పారు. అయినా జగన్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ ఎన్డీయేలోకి వైసీపీ అనే ప్రచారం జరుగుతోందని, ప్రభుత్వంలో చేరాలని బీజేపీ అడుగుతోందనే ప్రచారాన్ని వైసీపీనే చేస్తుందనే అనుమానం కలుగుతోందని ఆయన ఈ సందర్భంగా అన్నారు.