ఏపీ హైకోర్టులో అమరావతిపై విచారణ.. ప్రభుత్వానికి కీలక ఉత్తర్వులు జారీ
posted on Oct 6, 2020 @ 2:00PM
రాజధాని అమరావతి తరలింపు, మూడు రాజధానుల అంశంపై ఈరోజు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై స్టేటస్ కో ఉత్తర్వులు కొనసాగనున్నాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇది తదుపరి విచారణ వరకు అమల్లో వుంటుందని హైకోర్టు ప్రకటించింది. ఈరోజు జరిగిన విచారణలో భాగంగా అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించారు. అయన తన వాదనలలో సీఎం క్యాంప్ ఆఫీసు, కార్పోరేషన్లపై కోర్టు దృష్టికి కొన్ని కీలక అంశాలను తీసుకొచ్చారు. పరిపాలన వికేంద్రీకరణ చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం సీఎం ఎక్కడినుండి పనిచేస్తారో అదే క్యాంప్ కార్యాలయమని ఏజీ హైకోర్టుకు తెలిపారు. రాష్ట్రానికి సంబంధించిన కార్పొరేషన్లు అమరావతితో పాటు ఇప్పటికే ఇతర ప్రాంతాల్లో కూడా ఉన్నాయన్నారు. గతంలో పనిచేసిన సీఎం చంద్రబాబుకు నారావారిపల్లిలో, హైదరాబాద్‌లో కూడా క్యాంప్ ఆఫీసులున్నాయన్నారు. క్యాంప్ కార్యాలయాల ఏర్పాటుపై ప్రభుత్వం తరుఫున పూర్తిస్థాయి అఫిడవిట్‌ను శుక్రవారం అందజేస్తామని అయన తెలిపారు. దీంతో అడ్వొకేట్ జనరల్ అభ్యర్థన మేరకు విశాఖ గెస్ట్‌హౌస్‌పై విచారణను కోర్టు ఈనెల తొమ్మిదో తేదికి అంటే శుక్రవారానికి వాయిదా వేసింది. అయితే రాజధాని బిల్లులపై జనవరిలో శాసన మండలిలో జరిగిన చర్చలకు సంబంధించిన పూర్తి వివరాలను సీడీలు, సీల్డ్ కవర్‌లో ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.