మొన్న బెంజ్ కారు, నేడు భూకబ్జా.. మరో వివాదంలో మంత్రి జయరాం
posted on Oct 6, 2020 @ 6:17PM
ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం ఈఎస్ఐ కుంభకోణంలో బెంజ్ కారు లంచంగా తీసుకున్నారని ఇటీవల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఆయనపై భూకబ్జా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మంత్రి జయరాం బెదిరించి భూములు లాక్కున్నారని, బాధితులను భయపెట్టి రిజిస్ట్రేషన్లు కూడా చేయించుకున్నారని టీడీపీ నేత, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. మంత్రి కుటుంబ సభ్యులు, బినామిలపై రిజిస్ట్రేషన్లు చేయించారన్నారు. ఒకేసారి 400 ఎకరాలు తీసుకునేందుకు ప్లాన్ చేశారని, అయితే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఉండడంతో 204 ఎకరాలను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిపారు. అంతేకాదు, ఆక్రమించుకున్న భూములపై కర్నూలులోని కోపరేటివ్ బ్యాంక్ లో రుణాలకు కూడా అప్లై చేశారని ఆరోపించారు. అయితే ఈ విషయం కంపెనీ యాజమాన్యానికి తెలిసిందని, వాళ్లు బెంగళూరులో ఉన్నందున అక్కడ పోలీస్ స్టేషన్ లో మంత్రిపై ఫిర్యాదు చేశారని అయ్యన్న తెలిపారు.
మంత్రి జయరాం భూకబ్జాకి పాల్పడి అడ్డంగా దొరికిపోయారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. మంత్రి ల్యాండ్ స్కాంపై వెంటనే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈఎస్ఐ కుంభకోణంలో బెంజ్ కారు కొట్టేసిన జయరాం కన్ను.. ఆలూరులోని 400 ఎకరాల భూమిపై పడిందని, ఇట్టినా కంపెనీకి చెందిన ఈ భూమిని మంత్రి గ్యాంగ్ తప్పుడు పత్రాలు సృష్టించి కొట్టేసిందని బుద్ధా ఆరోపించారు. జగన్ గారూ, ఈ భూస్కాంలో అడ్డంగా దొరికిపోయిన మంత్రి జయరాంపై చర్యలు తీసుకోండి.. లేకపోతే ఇందులో మీ వాటా ఎంతో చెప్పండి? అంటూ బుద్ధా నిలదీశారు.
మరోవైపు, ఇట్టినా ప్లాంటేషన్ కంపెనీ పేరున కొన్న భూములను తిరిగి ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 2006లో తక్కువ ధరకు పొలాలు కొనుగోలు చేసి, కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం ఇస్తామని నమ్మించి.. ఇప్పుడు మంత్రి కుటింబీకులకు భూములు అమ్మిన కంపెనీ యజమాని మంజునాథ్ పై 420 కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.
భూకబ్జా ఆరోపణలతో మంత్రి ఇరుకున పడినట్టే అనిపిస్తోంది. పరిశ్రమ ఏర్పాటు కోసం రైతులు భూములిస్తే.. ఆ భూములను మంత్రి కుటింబీకులు ఆక్రమించుకోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఒకవేళ కంపెనీ యజమాని మంజునాథ్.. మంత్రి కుటుంబీకులకు అమ్మారనుకున్నా.. అసలు పరిశ్రమ ఏర్పాటు కోసం తీసుకున్న భూములను అమ్మే హక్కు ఎవరిచ్చారన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అదీగాక, ఒకవేళ కంపెనీ యజమాని అమ్మితే.. మళ్ళీ కంపెనీ యాజమాన్యం ఎందుకు మంత్రిపై ఫిర్యాదు చేస్తుందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా వరుస వివాదాలు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రిపై సీఎం ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.