ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్ భేటీ
posted on Oct 6, 2020 @ 3:02PM
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ ముగిసింది. దాదాపు 40 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది. రాష్ట్ర అభివృద్ధి అంశాలు, కరోనా పరిస్థితులు, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి, అలాగే అమరావతి విషయంలో తలెత్తుతున్న సమస్యలతో పాటు విభజన చట్టంలోని వివిధ అంశాలపై ప్రధానితో సీఎం జగన్ చర్చించినట్లు తెలుస్తోంది. మొత్తం 17 అంశాలపై జగన్ ప్రధానికి నివేదించినట్లు తెలుస్తోంది. ప్రత్యేకంగా, జీఎస్టీ చెల్లింపులు, రాష్ట్ర విభజన హామీల గురించి ప్రధాని దృష్టికి తీసుకెళ్లారని సమాచారం.
మరోవైపు, కేంద్ర కేబినెట్ లో చేరాలని జగన్ కు ఆహ్వానం అందిందని ఢిల్లీలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ పర్యనటకు ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది. వైసీపీకి రెండు కేబినెట్, ఒక సహాయ మంత్రి పదవులను కేంద్రం ఆఫర్ చేసినట్టుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, వైసీపీ నేతలు మాత్రం.. ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలను కేంద్రం నెరవేరుస్తామంటే తాము ఎన్డీయేలో చేరే అంశాన్ని పరిశీలిస్తామని అంటున్నారు. అయితే ఇప్పటివరకు ఎన్డీయే లో చేరాలని తమకు ఎటువంటి ఆహ్వానమూ లేదని, అలాగే వైసీపీ సైతం ఆ ప్రతిపాదన చేయలేదని చెబుతున్నారు. వైసీపీ ఎన్డీయేలో చేరే అంశంపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశముంది.