కంటే కూతుర్నే కనాలి.. ‘సైకిల్ గర్ల్’ జీవితంలో విషాదం..
posted on Jun 1, 2021 @ 11:20AM
కంటే కూతుర్నే కనాలి అనిపించింది ఆమె కష్టం. తండ్రి కోసం ఆ కూతురు.. చేయలేని సాహసం చేసింది. అనితర సాధ్యమైన పనిని.. చేసి చూపించింది. గతేడాది లాక్‌డౌన్ సిత్రాలలో ఆమె ఘటనే హైలైట్. ఆమె.. సైకిల్ జ్యోతిగా అప్పట్లో ఫుల్ పాపులర్. గాయపడిన తండ్రిని సైకిల్‌పై కూర్చోబెట్టుకొని.. అనేక రాష్ట్రాలు దాటి.. ఏకంగా 1200 కిలోమీటర్లు సైకిల్ తొక్కి.. తండ్రిని సొంతూరికి తీసుకొచ్చిన బాలిక. అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూతురు ఇవాంక సైతం ఆమె సైకిల్ యాత్రను మెచ్చుకున్నారు. ఇండియన్ సైక్లింగ్ ఫెడరేషన్ సైతం శభాష్ అంటూ ప్రశంసించింది. ఆ సైకిల్ జ్యోతి కుటుంబంలో ఇప్పుడు తీవ్ర విషాధం. ఏ తండ్రి కోసమైతే తాను అంతగా కష్టపడి.. అంతదూరం సైకిల్ తొక్కి.. సురక్షితంగా ఇంటికి తీసుకొచ్చిందో.. ఇప్పుడా తండ్రి గుండెపోటుతో మరణించాడు. ఆమె తండ్రి చనిపోవడం.. జ్యోతితో పాటు యావత్ దేశాన్ని కంటతడి పెట్టిస్తోంది. అంతా అయ్యో పాపం అంటూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దేశాన్నే కదిలించిన ఆమె కథ అలాంటిది మరి... ఆ జ్ఞాపకాల్లోకి మరోసారి.....
బిహార్‌లోని దర్భంగ జిల్లా సిర్హులి గ్రామానికి చెందిన మోహన్ పాస్వాన్ బతుకుతెరువు కోసం ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్ వలస వెళ్లాడు. మోహన్‌కు ముగ్గురు పిల్లలు. గతేడాది లాక్‌డౌన్‌కు ముందు మోహన్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. తండ్రిని చూసుకునేందుకు పెద్ద కుమార్తె జ్యోతి కుమారి గురుగ్రామ్‌కు వచ్చింది. ఆమె వచ్చిన కొంతకాలానికే మోదీ సర్కారు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఈ తండ్రీకూతుళ్లు అక్కడే చిక్కుకుపోయారు.
గురుగ్రామ్‌లో ఉండలేక.. ఎలాగైన సొంతూరుకు వెళ్లాలనుకున్నారు. ఓ పాత సైకిల్ కొని.. దానిపై తండ్రిని కూర్చోబెట్టుకొని.. సుమారు 1200 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ.. ఎన్నో కష్టాలను ఓర్చుకుంటూ.. ఏడు రోజుల తర్వాత స్వగ్రామానికి చేరింది. ‘సైకిల్ గర్ల్’ పేరుతో జ్యోతి ఉదంతం అప్పట్లో మారుమోగిపోయింది.
జ్యోతి సాహసాన్నిభారత సైక్లింగ్ ఫెడరేషన్ గుర్తించింది. ఆమెకు సైక్లింగ్‌లో శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఈ ఏడాది జనవరిలో ప్రధానమంత్రి బాలల పురస్కారాన్ని అందుకుంది జ్యోతి కుమారి. ఆత్మనిర్భర్ పేరుతో నిర్మిస్తున్న ఓ సినిమాలో జ్యోతి కథను తెరకెక్కిస్తుండగా.. అందులో తన పాత్రను తానే పోషిస్తోంది. అలాంటి జ్యోతికుమారి.. ఏ తండ్రి కోసమైతే అంతదూరం సైకిల్ తొక్కిందో.. ఇప్పుడు అదే తండ్రి అర్థాంతరంగా చనిపోవడంతో సైకిల్ జ్యోతి ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె కుటుంబాన్ని ఆదుకుంటామని జిల్లా యంత్రాంగం తెలిపింది. సైకిల్ జ్యోతి ఉదంతం మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.