హైకోర్టుకు కోపం వస్తే ఎట్టా ఉంటాదో తెలుసా?
posted on Jun 1, 2021 @ 3:13PM
అన్నీ భవిష్యత్‌లోనే చేస్తారా? ఇప్పుడేమీ చేయడం లేదా? ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సల ధరలు ఒకే విధంగా ఉండాలన్న ఆదేశాలు అమలు చేశారా? ప్రైవేట్ ఆస్పత్రుల్లో ట్రీట్‌మెంట్‌కు గరిష్ఠ ధరలను సవరిస్తూ కొత్త జీవో ఇచ్చారా? కొత్త ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌లు ఇంకెప్పుడు అందుబాటులోకి వస్తాయి? కరోనాపై సలహా కమిటీ ఎందుకు ఏర్పాటు చేయలేదు? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తెలంగాణ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది హైకోర్టు.
బంగారం తాకట్టు పెట్టి ఆస్పత్రులకు ఫీజులు చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, సిబ్బంది పెంపునకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని నిలదీసింది. మూడో దశ సన్నద్ధతపై వివరాలు సమగ్రంగా లేవని.. మహారాష్ట్రలో ఒకే జిల్లాలో 8వేల మంది చిన్నారులు కరోనా బారిన పడ్డారని గుర్తు చేసింది. కేటాయించిన బ్లాక్ ఫంగస్ ఔషధాలు ఎందుకు సరఫరా చేయలేదో తెలపాలని కేంద్రాన్ని ఆదేశించింది హైకోర్టు.
గతంలో తాము ఇచ్చిన ఆదేశాల్లో కొన్ని ఎందుకు అమలు చేయలేదని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్) హైకోర్టుకు నివేదిక సమర్పించారు.
కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ప్రజారోగ్య సంచాలకులు(డీహెచ్), డీజీపీ, కార్మిక, జైళ్ల శాఖలు, జీహెచ్ఎంసీ వేర్వేరుగా నివేదికలు అందించాయి. ప్రైవేట్ఆస్పత్రులపై వచ్చిన ఫిర్యాదులు పరిశీలిస్తున్నామని.. దీనికి సంబంధించి ముగ్గురు ఐఏఎస్‌లతో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పటికే 79 ఆస్పత్రులకు 115 షోకాజ్ నోటీసులు జారీ చేశామని.. 10 ఆసుపత్రుల కరోనా చికిత్స లైసెన్సులు రద్దుచేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ పడకలు పెంచుతున్నామన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 744 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైనట్లు డీహెచ్ హైకోర్టుకు తెలిపారు. బ్లాక్ ఫంగస్ చికిత్సకు 1,500 పడకలు అందుబాటులో ఉన్నాయని నివేదికలో తెలిపారు.
తెలంగాణలో లాక్‌డౌన్, కర్ఫ్యూ నిబంధనల ఉల్లంఘనలపై 2.61లక్షల కేసులు నమోదు చేసినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి హైకోర్టుకు తెలిపారు. ఔషధాల బ్లాక్ మార్కెట్‌పై 150కేసులు నమోదు చేశామన్నారు. ఏప్రిల్ 1నుంచి మే30వ తేదీ వరకు 7.49లక్షల కేసులు నమోదు చేశామని.. మాస్కులు ధరించని వారిపై 4.18లక్షల కేసులు నమోదు చేసి రూ.35.81కోట్ల జరిమానా విధించినట్టు.. జనం గూమిగూడినందుకు 13,867కేసులు పెట్టినట్టు నివేదికలో తెలిపారు. ప్రభుత్వ వర్గాలు సమర్పించిన నివేదికలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. సర్కారుపై ప్రశ్నల వర్షం గుప్పించింది హైకోర్టు.