సీబీఎస్ఈ పరీక్షలు రద్దు.. విద్యార్థుల భద్రతే ముఖ్యమన్న మోడీ
posted on Jun 1, 2021 @ 7:56PM
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు జరపకపోవడమే మేలని ప్రధాని అభిప్రాయపడ్డారు. పరీక్షల కంటే విద్యార్థుల ఆరోగ్యం, భద్రతే తమకు ముఖ్యమని ప్రధాని మోడీ అన్నారు. పరీక్షల రద్దుపై ఆయన ట్వీట్ చేశారు.‘‘విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పరీక్షల కోసం విద్యార్థులను ప్రమాదంలోకి నెట్టలేం..’’ అని ప్రధాని స్పష్టం చేశారు.
ఒకవేళ ఎవరైనా పరీక్షలు రాయాలనుకుంటే, వారికి కరోనా తీవ్రత తగ్గాక పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. పరీక్షలకు హాజరు కావాలని విద్యార్థులను బలవంతపెట్టొద్దని ప్రధాని పేర్కొన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై మంగళవారం సాయంత్ర ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. కేంద్ర మంత్రులు అమిత్ షా, ప్రకాశ్ జవదేకర్, పియూష్ గోయల్, స్మృతి ఇరానీ, ధర్మేంద్ర ప్రధాన్, నిర్మలా సీతారామన్‌లతో పాటు పాఠశాల, ఉన్నత విద్య సెక్రటరీ, పలువురు ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. 12వ తరగతి బోర్డు పరీక్షల నిర్వహణపై అన్ని రాష్ట్రాలు, ఇతర పక్షాలతో చర్చించిన మీదట.. ప్రభుత్వం ముందున్న అన్ని అవకాశాలపైనా ప్రధాని చర్చించారు. పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.