పిల్లలకు ఆ టీకా బెస్ట్! ఐఏపీ సూచన ఏంటంటే..
posted on Jun 1, 2021 @ 4:50PM
కరోనా సెకండ్ వేవ్ హడలెత్తిస్తోంది. థర్డ్ వేవ్ వార్తలు వణికిస్తున్నాయి. సెకండ్ వేవ్‌లోనే ఇన్ని లక్షల మంది కరోనా బారిన పడితే.. ఇక మూడో ముప్పు ఏ రేంజ్‌లో ఉంటుందోననే భయం వేధిస్తోంది. థర్డ్ వేవ్‌లో వైరస్ ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉండనుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్రంలో థర్డ్ వేవ్ కల్లోలం మొదలైపోయిందని.. ఒకే జిల్లాలో 8వేల మందికిపైగా పిల్లలకు కరోనా సోకిందని తెలడంతో అంతా అలర్ట్ అవుతున్నారు. మూడో ముప్పు నుంచి పిల్లలను రక్షించుకునేది ఎలానని తెగ హైరానా పడుతున్నారు తల్లిదండ్రులు.
థర్డ్ వేవ్ నుంచి పిల్లలను రక్షించడానికి ఐదేళ్ల లోపు పిల్లలకు ప్రతి ఏడాది 'ఫ్లూ' సంబంధిత టీకాలను ఇవ్వడం మంచిదని ఇండియన్ అకాడమీ ఆఫ్ పిడియాట్రిషన్ (ఐఏపీ) సూచించింది. ఇటీవల అమెరికా మిచిగాన్ మిస్సోరీ నిర్వహించిన అధ్యయనంలోనూ ఈ విషయం నిర్ధారణ అయింది. ఇనాక్టివేటెడ్ ఇన్‌ఫ్లూయెంజా టీకాను తీసుకున్న తర్వాత.. కొవిడ్ బారిన పడిన పిల్లలు.. త్వరగా కోలుకున్నారని తెలిసింది.
మహారాష్ట్ర పిడియాట్రిక్ టాస్క్‌ఫోర్స్ చిన్నారులు కరోనా నుంచి త్వరగా కోలుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించింది. కొవిడ్ టీకా, ఇన్‌ఫ్లూయెంజా టీకాలు.. ఎపిటామిమోలాజిక్ క్లినికల్ ఫీచర్లు ఇంచుమించు దగ్గరగా ఉంటాయి. కరోనా వైరస్ పిల్లలపై ప్రాణాంతకంగా మారకుండా ఉండడానికి ఫ్లూ కి సంబంధించిన టీకాలు ఇప్పించడం మంచిదని తెలిపింది. ఫ్లూ టీకా వల్ల.. కొవిడ్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్‌ను తగ్గించవచ్చని, పిల్లల ఆరోగ్య పరిస్థితి విషమించకుండా ఉంటుందని సూచించింది. పిల్లలకు ఇన్‌ఫ్లూయెంజా టీకా ఇవ్వడం వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఆ రోగ నిరోధక శక్తి కరోనా వైరస్‌తో పోరాడటానికి బాగా పనికొస్తుందనేది వైద్యులు చెబుతున్న మాట.
అయితే, ఫ్లూ టీకా, కరోనా టీకా.. ఆ రెండూ వేరు వేరు. అందుకే, ఒకవేళ పిల్లలకూ టీకాలు ఇవ్వడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. ఆ రెండు టీకాలకు మధ్య దాదాపు నాలుగు వారాల సమయం ఉండాలి. అప్పుడు పిల్లల్లో యాంటీబాడీస్ డెవలప్‌మెంట్‌కి కావలసిన సమయం ఉంటుంది. వైరస్‌లతో పోరాడటానికి కావలసిన ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఎంతగా టీకాలు వేసుకున్నా.. మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం మాత్రం మరిచిపోవద్దని వైద్యులు సూచిస్తున్నారు.