బెయిల్ రద్దుకు నో చెప్పని సీబీఐ.. జగన్ కు జైలు తప్పదా?
posted on Jun 1, 2021 @ 1:43PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌పై నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు గతంలో జగన్, సీబీఐ మూడు సార్లు గడువు కోరారు. దీంతో కౌంటర్ దాఖలు చేసేందుకు జగన్, సీబీఐకి చివరి అవకాశం ఇస్తున్నామంటూ గత నెల 26న సీబీఐ కోర్ట్ హెచ్చరించింది. ఈ క్రమంలో సీబీఐ, జగన్ తరఫు న్యాయవాదులు కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు.
జగన్ బెయిలును రద్దు చేయాలన్న పిటిషన్‌పై సీబీఐ ఎలాంటి వైఖరి తీసుకుంటుంది అన్నది కొన్ని రోజులుగా ఆసక్తి రేపింది. వైసీపీలో టెన్షన్ పుట్టించింది. జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతుందా లేక రద్దు చేయవద్దు.. బెయిలు నిబంధనలను ఆయన ఎంతమాత్రమూ ఉల్లంఘించడంలేదు అని చెబుతుందా? అన్నది రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపింది. కేంద్ర సర్కార్ తో జగన్ కొనసాగిస్తున్న సత్ససంబంధాలతో జగన్ కు అనుకూలంగానే సీబీఐ నిర్ణయం ఉంటుందనే చర్చ కూడా జరిగింది. అయితే వైసీపీ ఆశలను వమ్ము చేస్తూ న్యాయస్థానంలో మెమో దాఖలు చేసింది సీబీఐ. జగన్ బెయిల్ రద్దు చేయవద్దని కోరలేదు. రఘురామ పిటిషన్‌పై చట్టప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. కోర్టు విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవాలని కోరింది.ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం విచారణను ఈనెల 14కి వాయిదా వేసింది.
జగన్ బెయిల్ కేసులో సీబీఐ వేసిన కౌంటర్ పై ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జగన్ బెయిలు రద్దుకు ఎస్ లేదా నో అని చెప్పకుండా బంతిని కోర్టు పరిధిలోకి నెట్టింది సీబీఐ. ఈ విషయంలో మేం జోక్యం చేసుకోం.. మీరే నిర్ణయం తీసుకోండి అని చెప్పింది. దీంతో జగన్ బెయిల్ కేసులో ఏదైనా జరగవచ్చని చెబుతున్నారు. రఘురామరాజు తన పిటిషన్‌లో అనేక కీలక అంశాలను ప్రస్తావించారు. సాక్షులను ప్రత్యక్షంగా, పరోక్షంగా బెదిరిస్తున్నారని.. బెయిల్ షరతులను ఉల్లంఘిస్తున్నారని తెలిపారు. న్యాయస్థానం ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. పలువురు సాక్షులు జగన్ ప్రభుత్వంలో అధికారులుగా ఉండటం, కొందరు సహ నిందితులు కీలక స్థానాల్లో ఉండటం, ఒకరికి సలహాదారు పదవి ఇవ్వడం, విజయసాయి రెడ్డి, అయోధ్య రామిరెడ్డిని రాజ్యసభకు పంపడం లాంటివన్నీ పిటిషన్‌లో వివరించారు. ప్రజాప్రతినిధుల కేసుల్లో విచారణ వేగవంతం చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలను జీర్ణించుకోలేని వైసీపీ నేతలు న్యాయవ్యవస్థపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. ఇంత నిర్దిష్టమైన అంశాలు ఉండటంతో జగన్ బెయిల్ పై ఎటువంటి నిర్ణయం ఉంటుందన్నది ఆసక్తిగా మారింది. జగన్ బెయిల్ కేసులో జరగబోయే పరిణామాలపై ఏపీ జనాల్లోనూ ఉత్కంఠ నెలకొంది.
జగన్ తరపు లాయర్లు 98 పేజీల కౌంటర్ దాఖలు చేశారు. జగన్ బెయిల్ షరతులను ఎక్కడా ఉల్లంఘించలేదని అందులో పేర్కోన్నారు. సీబీఐని ప్రభావితం చేస్తున్నారన్న పిటిషనర్ వాదనలో నిజం లేదని పేర్కొన్నారు. సీబీఐ కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తుందని.. పిటిషనర్ రఘురామరాజుకు ఈ కేసులో సంబంధం లేదని వివరించారు. ఇలాంటి కేసుల్లో థర్డ్ పార్టీ జోక్యం చేసుకోవద్దని సుప్రీం కోర్టు తీర్పులున్నాయని స్పష్టం చేశారు. రఘురామరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని స్పీకర్‍కు లేఖ కూడా రాసినట్లు వెల్లడించారు. రఘురామ పిటిషన్‌కు విచారణార్హత లేదని.. వ్యక్తిగత, రాజకీయాల కోసం న్యాయవ్యవస్థను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రఘురామరాజుపై ఏపీలో అనేక కేసులున్నాయని.. విన్నవించారు.