కేసీఆర్ గడ్డ నుంచే పోరాటం.. జూన్ 2 నుంచే శ్రీకారం..
posted on Jun 1, 2021 @ 10:56AM
తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరుగుతున్నాయి. రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత పెరిగిందని గ్రహించిన సీఎం కేసీఆర్ రూట్ మార్చారు. కొన్ని రోజులుగా పాలనలో దూకుడు పెంచారు. అదే సమయంలో విపక్షాలు యాక్టివ్ అయ్యాయి. ఈటల రాజేందర్ ఎపిసోడ్ తో తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్నాయి. ఈటల కోసం కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నాలు చేసినా... రాజేందర్ కమలం గూటికి చేరడం ఖాయమైంది. అటు తెలంగాణ పీసీసీ చీఫ్ ను ఫైనల్ చేయబోతోంది కాంగ్రెస్ హైకమాండ్. కొత్త పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల కూడా తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఇతర విపక్షాలకు ధీటుగా ఆమె కార్యక్రమాలు చేస్తున్నారు.
తాజాగా మరో సంచలనానికి శ్రీకారం చుట్టారు షర్మిల. కొన్ని రోజులుగా ట్విట్టర్ వేదికగా కేసీఆర్ పై విరుచుకుపడుతున్నారు షర్మిల. కరోనా, లాక్‌డౌన్ పరిస్థితులపై సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇకపై ఆమె ప్రత్యక పోరాటంలోకి దిగబోతున్నారు. కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ నుంచే ఆమె యాక్షన్ మొదలు పెడుతున్నారు. అది కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే. జూన్ 2న గజ్వేల్ వెళుతున్నారు షర్మిల. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను పరామర్శించి వారికి భరోసానివ్వనున్నారు. గన్‌పార్క్ వద్ద నివాళులర్పించి షర్మిల గజ్వేల్‌కు బయలుదేరనున్నారు. షర్మిల పర్యటన కోసం అనుచరులు ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలంగాణలో పార్టీ పెడతానని ప్రకటించిన షర్మిల జిల్లాల వారీగా వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ లో ఖమ్మంలో సంకల్ప సభ నిర్వహించారు. జూలై8న కొత్త పార్టీ పేరు , ఎజెండా ప్రకటిస్తానని చెప్పారు. అప్పటి నుంచి పార్టీ కార్యాచరణలోనే ఉన్నారు షర్మిల. జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తన యాక్షన్ ప్లాన్‌ను సీఎం కేసీఆర్ ఇలాకా నుంచి షురూ చేయబోతున్నారు. వైఎస్ షర్మిల గజ్వేల్ పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున గజ్వేల్ వెళుతున్న షర్మిల.. అక్కడ ఏం చేయబోతున్నారు, ఏం చెప్పబోతున్నారన్నది చర్చగా మారింది.