రఘురామ మరో సంచలనం.. మాములుగా లేదుగా! 

ఢిల్లీ వేదికగా తన పోరాటం ముమ్మరం చేశారు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు. తన అరెస్టు సమయంలో జరిగిన పరిణామాలపై కేంద్రం పెద్దలతో నివేదిస్తున్న రఘురామ.. మరోసారి సంచలనానికి తెర తీశారు. ఈసారి సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ రిజిస్ట్రార్ కేపీ రెడ్డిపై ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన ఆరోపణలు చేశారు. తనను ఆర్మీ ఆస్పత్రి నుంచి త్వరగా డిశ్చార్జ్‌ చేసేందుకు.. వైద్యులపై కేపీరెడ్డి ఒత్తిడి తెచ్చారని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు రఘురామ ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి రాజ్‌నాథ్‌సింగ్‌కు మూడు పేజీల లేఖను అందజేశారు.  ఆర్మీ హాస్పిటల్ రిజిస్ట్రార్  కేపీ రెడ్డి, టీటీడీ ఏఈవో ధర్మారెడ్డి, గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డిలు తనను ఏపీ సీఐడీకి అప్పగించేందుకు కుట్రపన్నారని ఫిర్యాదులో తెలిపారు ఎంపీ రఘురామ రాజు. ఏపీ మఫ్టీ పోలీసులు ఆర్మీ ఆస్పత్రిలో మకాం వేసేందుకు కేపీ రెడ్డి సహకరించారని ఆరోపించారు. 15 మంది ఏపీ పోలీసుల మెస్ బిల్లులను కూడా తన లేఖకు రఘురామ జతపర్చారు. కేపీ రెడ్డిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. తన ఫిర్యాదుపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని రాజ్‌నాథ్‌సింగ్ హామీ ఇచ్చారని చెప్పారు ఎంపీ రఘురామ. 

లాక్‌డౌన్ పొడిగింపు.. స‌మ‌యం కాస్త స‌డ‌లింపు.. ఎప్ప‌టి వ‌ర‌కు అంటే..?

అంతా అనుకున్న‌ట్టే అయింది. తెలంగాణ‌లో లాక్‌డౌన్‌ను మ‌రోసారి పొడిగించారు. కేసుల తీవ్ర‌తను దృష్టిలో పెట్టుకొని.. మ‌రో ప‌ది రోజుల పాటు లాక్‌డౌన్ పొడిగిస్తూ.. కేబినెట్ నిర్ణ‌యం తీసుకుంది. అయితే.. లాక్‌డౌన్ టైమ్‌ను మాత్రం కాస్త స‌డ‌లించారు.  ప్ర‌స్తుతం ఉద‌యం 6 గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కు లాక్‌డౌన్ స‌డ‌లింపు ఉంది. ఈ వేళ‌ల‌ను కాస్త పెంచారు. ఇక‌పై ఉద‌యం 6 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు లాక్‌డౌన్ స‌డ‌లింపున‌కు మంత్రి వ‌ర్గం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.  మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి మ‌రుస‌టి రోజు ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు లాక్‌డౌన్ అమ‌లు చేయ‌నున్నారు. ఆ స‌మ‌యంలో మ‌రింత క‌ఠినంగా లాక్‌డౌన్ అమ‌లు చేయాల‌ని మంత్రివ‌ర్గం పోలీసుల‌ను ఆదేశించింది.   

దోచుకున్నది రాస్తే గ్రంథమే! జగన్ రెండేళ్ల పాలనపై టీడీపీ చార్జ్‌షీట్‌..

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుంది.  ఈ సందర్భంగా తమ రెండేళ్ల  పాలనపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదివారం పుస్తకాన్ని ఆవిష్కించారు. వైసీపీ కౌంటర్ గా  ఈ రెండేళ్లలో సీఎం చేసిన విధ్వంసంపై ‘జగన్‌ విధ్వంసం అనే చార్జ్‌షీట్‌’ పేరుతో టీడీపీ విడుదల చేసింది. విధ్వంస ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో కెక్కారన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. జగన్ రెండేళ్ల విధ్వంసంపై చర్చకు సిద్ధమన్నారు. రాష్ట్రంలో ఉన్న ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు అంతా డమ్మీలేనని ఆయన విమర్శించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత జేసీబీ, ఏసీబీ, పీసీబీ పాలనే సాగుతుందని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు.  జేసీబీతో కూల్చడం, ప్రశ్నించిన వారిపై ఏసీబీ కేసులు పెట్టడం, కుదరక పోతే పీసీబీని రంగంలోకి దింపుతున్నారన్నారు. సీఎం జగన్ ఏది చెప్తే సీఐడీ అదే చేస్తుందని విమర్శించారు. రాష్ట్రం పతనమైపోతోందని, ఇప్పటికైనా ప్రజలు మేల్కోవాలని అచ్చెన్నాయుడు పిలుపు ఇచ్చారు. ఏపీ సీఎం జగన్ రెండేళ్ల పాలనపై వైసీపీ పుస్తకం తీసుకురావడంపై టీడీపీ నేత ఆలపాటి రాజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు చేసిన దానికే పుస్తకం వేసుకుంటే, దోచుకున్న దానికి గ్రంథాలు విడుదల చేయాలేమో అని అన్నారు. బ్లూ మీడియాను అడ్డుపెట్టుకుని మసిపూసి మారేడు కాయ చేయడంలో వైసీపీ నేతలు సిద్ధహస్తులు అని విమర్శించారు. వైసీపీ చేసిన సంక్షేమం కంటే జరిగిన దోపిడీ పదింతలుంది అని రాజా ఆరోపించారు. చేసిన అభివృద్ధి, సృష్టించిన సంపద ఏంటో చెప్పే దమ్ము వైసీపీ నేతలకు ఉందా? అని ఆలపాటి రాజా ప్రశ్నించారు. ఆస్తులు అమ్మడం, అప్పు చేయడం, పబ్జీ ఆడుకోవడం తప్ప జగన్ రెడ్డికి ఏమీ చేతకాదని ఎద్దేవా చేశారు. తన రెండేళ్ల పాలనపై పుస్తకం రిలీజ్ చేసిన సీఎం జగన్.. రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా పరిపాలన అందిస్తున్నామన్నారు. మెనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని, ప్రతి ఒక్కరి సహాయంతో ఇవన్నీ చేయగలుగుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో 86 శాతం ఇళ్లకు ప్రభుత్వ పథకాలు చేరాయన్నారు. ప్రజల ఖాతాల్లోకి నేరుగా రూ. 95,528 కోట్లు జమ చేశామన్నారు. వివిధ పథకాల ద్వారా రూ. 36,197 కోట్లు ఇచ్చామన్నారు. ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందన్న భరోసా కల్పించామని సీఎం జగన్ అన్నారు. 

ఆయుర్వేద ఆనందయ్య ఎక్కడ? ప్రభుత్వమే కిడ్నాప్ చేసిందా?

దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కృష్ణపట్నం ఆయుర్వేద ఆనందయ్య అచూకి ఇంకా తెలియడం లేదు. ఆయన ఎక్కడున్నాడో అతని కుటుంబ సభ్యులు కూడా చెప్పలేకపోతున్నారు. వారం రోజుల పాటు పోలీసుల నిర్భందంలో ఉన్న ఆనందయ్య శుక్రవారం రాత్రి కృష్ణపట్నంలోని తన ఇంటికి వచ్చారు. తర్వాత కొన్ని గంటల్లోనే శనివారం తెల్లవారుజామున ఆనందయ్య కనిపించకుండా పోయారు. ఆనందయ్యను పోలీసులే తీసుకెళ్లి  ర‌హ‌స్య ప్రాంతంలో ఉంచారని తెలుస్తోంది. ఆనందయ్యకు భద్రత కల్పించేందుకు తీసుకెళ్లామన్నది పోలీసుల వర్గాల వాదన. అయితే ఆయనను ఎక్కడ ఉంచారన్నది మాత్రం  చెప్పడం లేదు.  ఆనందయ్య ఆచూకి చెప్పడం లేదంటూ కృష్ణపట్నం గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వమే కిడ్నాప్ చేసిందని మండిపడుతున్నారు. మరోవైపు  కృష్ణ ప‌ట్నంలో 144 సెక్ష‌న్ కొన‌సాగుతోంది. ముత్తుకూరు నుంచి వ‌చ్చే స్థానికేత‌రుల‌కు అనుమ‌తి నిరాక‌రిస్తున్నారు. కృష్ణ‌ప‌ట్నం, గోపాల‌పురంలో ప్ర‌త్యేకంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఇత‌ర ప్రాంతాల నుంచి కృష్ణ‌ప‌ట్నానికి అంబులెన్సుల్లో రోగులు వ‌స్తున్నారు. వారిని పోలీసులు వెన‌క్కి పంపుతున్నారు. ఆనంద‌య్య ఔష‌ధంపై సోమవారం తుది నివేదిక రానుందని, ఆ తర్వాతే మందు పంపిణిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు.  కృష్ణపట్నం ఆనందయ్యకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లేఖ రాశారు. మీరు ఇచ్చే మందుతో మీ ఖ్యాతి జాతీయ స్థాయిలో మార్మోగుతోంది. రాజకీయాలకు అతీతంగా అందరూ మీకు అండగా నిలుస్తున్నారు. ప్రజలందరూ దేవుడిగా భావిస్తున్న మిమ్మల్ని భద్రత పేరుతో నిర్బంధించడంపై చాలా బాధపడుతున్నాం అంటూ సోమిరెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. జైలులో ఖైదీకి ఉండే స్వేచ్ఛ కూడా మీకు లేకుండా చేయడం బాధాకరం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మీకు భద్రత కల్పించకపోయినా కృష్ణపట్నం ఊరుఊరంతా అండగా ఉంది.. వాళ్లే మీకు రక్షణ కల్పిస్తారు… మీపై కొందరు పెడుతున్న ఒత్తిడిని చూస్తే మీ ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తమవుతోంది అని అన్నారు. నిజంగా మీకు భద్రత కల్పించాలనుకుంటే నెల్లూరులో అనేక అవకాశాలున్నాయి అని తన లేఖలో పేర్కొన్నారు సోమిరెడ్డి.  ప్రైవేటు సంస్థ ఆధీనంలోని వందల మందికి వంట చేసే సౌకర్యం ఉన్న భవనాల్లో నిర్బంధించినపుడే వారి ఉద్దేశం స్పష్టమవుతోంది సోమిరెడ్డి ఆరోపించారు. వైసీపీ నాయకులకు అధికారులకు వారి సన్నిహితులకు మందు అందించిన తర్వాతే సామాన్యులకు పంపిణీకి అనుమతి ఇచ్చేలా ఉన్నారన్నారు.  ఆ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాతే ఆనందయ్యకు నిర్బంధం నుంచి విముక్తి లభిస్తుందని భావిస్తున్నాం..మీ భద్రత, స్వేచ్ఛ విషయంలో స్థానిక ఎమ్మెల్యేని కాదని ఎవరూ జోక్యం చేసుకోలేని పరిస్థితి వచ్చిందని సోమిరెడ్డి అన్నారు. ప్రపంచానికి ఒక ఆపద్బాంధవుడిలా నిలిచిన మిమ్మల్ని ప్రజలు దేవుడిలా భావిస్తున్నారు.. మరో బోధిధర్మలా కీర్తిస్తున్నారు అంటూ ఆనందయ్యను కీర్తించారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ప్రస్తుత పరిస్థితుల్లో మీ అవసరం ప్రజలకు ఎంతో ఉంది.. ఎంతటి ఒత్తిళ్లు వచ్చినా ధైర్యంగా పోరాడి విజయుడివై బయటకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అంటూ లేఖను ముగించారు మాజీ మంత్రి. 

జగన్‌పై 18వ కేసు.. సాయిరెడ్డి అప్రూవర్ గా మారతారా? 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి షాకుల మీదు షాకులు తగులుతున్నాయి. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు వేసిన పిటిషన్ పై సీబీఐ కోర్టులో జూన్ 1న విచారణ జరగనుంది. జగన్ బెయిల్ రద్దుపై సీబీఐ వేసే కౌంటర్ పైనే ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో ఏమవుతుందోమోనన్న ఆందోళన వైసీపీలో కనిపిస్తోంది. ఇదిలా ఉండగానే గృహ నిర్మాణ ప్రాజెక్టులకు సంబంధించిన విచారణలో వెలుగుచూసిన అంశాల ఆధారంగా జగన్ పై  ఈడీ మరో అభియోగ పత్రంపై నమోదు చేసింది.  జగన్​మోహన్ రెడ్డిపై ఇప్పటికే 11 సీబీఐ, 6 ఈడీ కేసులు విచారణలో ఉన్నాయి. ఈడీ దాఖలు చేసిన మరో ఛార్జ్​షీట్‌నూ న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. దీంతో సీబీఐ, ఈడీ కోర్టులో ఏపీ సీఎం జగన్‌పై కేసుల సంఖ్య 18కి చేరాయి.  గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లో అక్రమాలకు సంబంధించి ఈడీ  గత ఏడాదిలోనే ఛార్జ్​షీట్ దాఖలు చేసినప్పటికీ.. కొన్ని లోపాల వల్ల న్యాయస్థానం దానిని రిజెక్ట్ చేసింది. మార్చిలో మళ్లీ దాఖలు చేయగా విచారణ చేపట్టింది. తాజాగా నమోదైన 18వ కేసులో జగన్‌ తో పాటు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్, ఇందూ గ్రూపు వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ రెడ్డి నిందితులుగా ఉన్నారు.  బెంగళూరు స్థిరాస్తి వ్యాపారి జితేంద్రవీర్వానీ,ఇందూ ప్రాజెక్ట్స్,సైబరాబాద్ హైటెక్ ఇంటిగ్రేటెడ్ టౌన్​షిప్ డెవలప్​మెంట్ కార్పొరేషన్,ఇందూ ఈస్టర్న్ ప్రావిన్స్ ప్రాజెక్ట్స్, ఇందూ రాయల్ హోమ్స్, వసంత ప్రాజెక్ట్స్,ఎంబసీ ప్రాపర్టీ డెవలప్​మెంట్స్‌ సంస్థలను ఈడీ నిందితుల జాబితాలో చేర్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఏపీ హౌసింగ్ బోర్డు గృహనిర్మాణ ప్రాజెక్టుల సందర్భంగా.. ఇందూ గ్రూప్ అధినేత శ్యాంప్రసాద్ రెడ్డికి అనుచిత ప్రయోజనాలు కల్పించినట్లు సీబీఐ, ఈడీ ఆరోపించాయి. ఇందూ శ్యాంప్రసాద్ రెడ్డి 70 కోట్ల రూపాయలను జగన్‌ కంపెనీల్లోకి మళ్లించగా… ప్రతిఫలంగా వైఎస్ సర్కారు తక్కువ ధరలకే హైదరాబాద్‌లోని కూకట్​పల్లిలో 65, గచ్చిబౌలిలో 21, బండ్లగూడలో 50, నంద్యాలలో 75 ఎకరాల చొప్పున కేటాయించినట్లు దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. బెంగళూరుకు చెందిన ఎంబసీ ప్రాపర్టీ డెవలప్​మెంట్స్ అధినేత జితేంద్రవీర్వానీ ఈ ప్రక్రియలో సహకరించడం ద్వారా… 50 కోట్ల 16 లక్షల రూపాయల అక్రమ లబ్ధి పొందినట్లు ఈడీ గుర్తించింది. ప్రస్తుతం తితిదే ఛైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి తన సహచరుడు, ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్‌కు ప్రాజెక్టులో భాగస్వామ్యం కల్పించినట్లు ఈడీ దర్యాప్తులో తెలిపింది.వైవీ సుబ్బారెడ్డి, కృష్ణప్రసాద్ కలిపి గచ్చిబౌలి ప్రాజెక్టులో నాలుగున్నర ఎకరాల వాటాను శ్యాంప్రసాద్ రెడ్డికి ఇచ్చినట్లు సీబీఐ కూడా తన ఛార్జ్​షీట్​లో వెల్లడించింది. ఏపీహెచ్‌బీకి నష్టం కలిగించి అక్రమ లబ్ధి పొందిన నిందితులపై మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 3, 4 ప్రకారం చర్యలు తీసుకోవాలని కోర్టును ఈడీ కోరింది.117 కోట్ల 74 లక్షల రూపాయల ఆస్తులను 2018 జనవరిలో తాత్కాలికంగా జప్తు చేసింది. ఇందూ ప్రాజెక్ట్స్‌కు సంబంధించి అభివృద్ధి చేయని భూములు సహా వసంత ప్రాజెక్ట్స్, ఎంబసీ ప్రాపర్టీస్‌కు చెందిన ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఈడీ అటాచ్ చేసింది. ఈ ఛార్జ్​షీట్‌పై విచారణను జూన్ 30కి కోర్టు వాయిదా వేసింది.   ఈ కేసులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే…ఇందులో ఎంపీ విజయసాయిరెడ్డి పేరు తొలగించారు. జగన్‌కు చెందిన కార్మెల్ ఏషియా, ఐఏఎస్ అధికారి ఎస్.ఎన్.మహంతి పేర్లు కూడా లేవు. విజయసాయి రెడ్డి ఢిల్లీలో బీజేపీ పెద్దలతో చేసిన లాబీయింగ్ వల్ల ఇలా జరిగిందా? అప్రూవర్ గా మారతారా ? అని నెటిజన్లు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. జగన్ విషయంలో విజయసాయి రెడ్డి హ్యాండివ్వడం అసంభవమని వైసీపీ మద్దతుదారులు కొట్టి పారేస్తున్నారు. ఏమో ఏదైనా జరగవచ్చని మరికొందరు చెబుతున్నారు. తాజా పరిణామాలతో సీఎం జగన్ కేసుల్లో ఏం జరగబోతోంది అన్నది ఏపీతో దేశ వ్యాప్తంగా ఆసక్తిగా మారింది. 

మోడీ ఏడేళ్ళ పాలనలో  మరుపులు – మరకలు 

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాలనకు ఏడేళ్ళు పూర్తయ్యాయి. ఈ ఏడేళ్ళలో తొలి ఐదేళ్ళ పాలన ఒకెత్తు అయితే, రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాతా గడచిన రెండేళ్ళ పాలన ఒకటీ ఒకెత్తుగా సాగుతోంది. తొలి ఐదేళ్లలో ఆమాటకొస్తే, రెండవసారి మరింత భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరం చివరి వరకు, మోడీ –అమిత్ షా జోడీ బండి గతుకుల రోడ్డు మీద కూడా సాఫీగా సాగిపోయింది. విపక్షాల విమర్శలకు విలువే లేకుండా పోయింది.  ఇక అక్కడి నుంచి ఎదురుదెబ్బలు మొదలయ్యాయి. ఒక్కసారిగా ప్రళయంగా విరుచుకు పడిన కొవిడ్ సెకండ్ వేవ్’ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేసింది. ప్రభుత్వ దూకుడుకు కళ్ళెం వేసింది. కొవిడ్ తొలి వేవ్’ ను కొంత సమర్ధవంతంగా ఎదుర్కున్న మోడీ ప్రభుత్వం గత రెండు మూడు నెలలుగా విజృంభణ  సాగిస్తున్న సెకండ్ వేవ్ విషయంలో ఇంటా బయటా తీవ్ర విమర్శలను ఎదుర్కుంటోంది. ఈ నేపధ్యంలోనే, ప్రభుత్వం, అధికార పార్టీ ఏడేళ్ళ వేడుకలు జరుపుకోలేదు. అందుకు  ముఖం చెల్లలేదు. అందుకే, ‘సేవా హీ సంఘటన’ (సేవే సంఘటన) పేరిట సేవా కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు.  అదలా ఉంచి ఏడేళ్ళ పాలనలో ప్రధాని మోడీ ప్రభుత్వం ఏమి సాధించింది?ఎక్కడ విఫలమైంది? అని అలోచిస్తే, సహజంగానే ఇతరుల పాలనలోలానే  మోడీ పాలనలోనూ మెరుపులు, మరకలు రెండూ దర్శనమిస్తాయి. అయితే, ఇందులో ఏవి మెరుపులు, ఏవి మరకలు అనేది చూసే చూపును బట్టి, రాజకీయ విశ్వాసాలు, అవసరాలను బట్టి మారుతూ ఉంటాయి. మోడీ ప్రభుత్వం తీసుకున్న ప్రతి కీలక నిర్ణయాన్ని, ప్రతిపక్షాలువిమర్శిస్తూనే వచ్చాయి. ఉదాహరణకు పెద్ద నోట్ల రద్దు, చాలా ప్రమాదకర నిర్ణయమని, ప్రతిపక్షాలు విరుచుకు పడ్డాయి. అలాగే, వస్తు సేవల పన్ను( జీఎస్టీ) విషయంలోనూ ప్రతిపక్షలు మోడీ ప్రభుత్వాన్ని ఏకి పారేశాయి. ప్రతిపక్షాలు మాత్రమే కాదు, ప్రతిపక్షాల వాదనను సమర్ధించే ఆర్థిక రంగ నిపుణులు, అదే కోవకు చెందిన మేథావులు, విశ్లేషకులు, మోడీ నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమనం దిశగా  పరుగులు తీస్తుందని మండి పడ్డారు. దేశం నాశనం అవుతుందని, దివాళా దీస్తుందని... గణాంకాల ఆధారంగా  చాలా  బలమైన వాదనలు వినిపించారు.  అలాగే, రాజకీయ పండితులు, మోడీ ప్రభుత్వం ఆర్థిక నిర్ణయాల ప్రభావం, ఎన్నికల ఫలితాలపై ఉంటుందని జోస్యం  చెప్పారు.  అయితే వాస్తవంలో ఏమి జరిగిందో కళ్ళముందు కనిపిస్తోంది. 2014లో కేంద్రంలో తొలిసారి, అధికారంలోకి వచ్చే సమయానికి, దేశంలో మూడు నాలుగు రాష్ట్రాలలో మాత్రమే బీజేపీ అధికారంలో వుంది. ఇప్పడు, బీజీపీ/ఎన్డీఏ ఇచుమించుగా 20 రాష్ట్రాలలో అధికారంలో ఉంది. అలాగే, విపక్షాల విమర్శలను ఎదుర్కున్న పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, వంటి కీలక నిర్ణయాలు తీసుకున్న తర్వాత జరిగిన  2019, లోక్ సభ ఎన్నికలలోనూ బీజేపీ ముందుకంటే ఎక్కువ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది.అలాగని, మోడీ ప్రభుత్వం తీసుకున్ననిర్ణయాలు అన్నీ మంచివని కాదు. కేవలం ఎన్నికల ఫలితాలు మాత్రమే మంచి చెడులను నిర్ణయిస్తాయని అనలేము. అదే సమయంలో, ప్రజాస్వామ్యంలో, అంకెలు కూడా మాట్లాడతాయి. అదెలా ఉన్నా,  నిజంగా కూడా పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీల వలన దేశ ఆర్థిక వ్యవస్థ కొంత నష్ట పోయింది. పరిశ్రమలు మూతపడ్డాయి. కార్మికులు ఉపాధి కోల్పోయారు. అయితే, తాత్కాలికంగా కొన్ని ఒడిదుడుకులు వచ్చిన దీర్ఘాకాలంలో సుస్థిర అభివృద్ధి, సుస్థిర ప్రయోజనాలు పొందాలంటే, తాత్కాలికంగా కష్ట నష్టాలు తప్పవన్న వాదనలోనూ కొంత నిజం లేక పోలేదు.ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే, ప్రజలు రెండవ వాదన వైపే మొగ్గు చూపారు.  అదలా, ఉంటే మోడీ ప్రభుత్వం ఏడేళ్ళలో, అధికార పార్టీ (బీజేపీ) భావజాల పరిధిలోని అనేక వివాదస్పద అంశాల విషయంలో ఎలాంటి బెరుకు భయం లేకుండా చకా చకా నిర్ణయాలు తీసుకుంది. ట్రిపుల తలాక్ రద్దు మొదలు  ఆర్టికల్ 370 రద్దు వరకు, పౌరసత్వ సవరణ చట్టం, రామజన్మ భూమి వంటి  దశాబ్దాలుగా నలుగుతున్న అనేక భావోద్వేగ  పూరిత సంబంధించి నిర్ణయాలను నిర్భయంగా తీసుకుంది. ఆందోళనలను సంర్ధవంతంగా ఎదుర్కుంది. భావజ్వాల వ్యాప్తికి గట్టి పునాదులు నిర్మించుకుంది. ఈ నేపధ్యంలోనే ఇక దేశంలో మితవాద రాజకీయాలు, అతి మితవాదంగా, తీవ్ర జాతీయవాదంగా పరిణమిస్తాయని, ఫలితంగా సమకూరే తిరుగులేని అధికారంతో నాయకులు నియంతలుగా మారే ప్రమాదం కూడా ఉన్నదని పరిశీలకులు హెచ్చరించారు. అయినా, మోడీ  ప్రభుత్వం. బీజేపీ దూకుడు తగ్గలేదు. ప్రభుత్వం ఒకదాని తర్వాత ఒకటిగా  భావజాల అనుకూల నిర్ణయాలు తీసుకుని, సవాలు విసిరింది.  అలాంటిది,  అదే ప్రభుత్వం ఇప్పడు కొవిడ్ దెబ్బకు మైండ్ బ్లాక్ అయిపోయిందా అన్న విధంగా, చేష్టలుడిగి చూస్తోంది. కిం కర్తవ్యమ్’ అనేది అర్ధం కాక దిక్కులు చూస్తోంది. నిజానికి ఆరున్నరేళ్లకు పైగా, ఏ అవరోధమూ లేకుండా జైత్రయాత్ర సాగించిన నరేంద్రమోదీ సామర్ధ్యానికి ఇప్పుడు గట్టి ఎదురదెబ్బ తగిలింది. ఒక విధంగా మోడీ ప్రభుత్వ ప్రతిష్ట  ఇంత హఠాత్తుగా కుప్పకూలిపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే, అయినా అది నిజం. ఇప్పడు, అక్కడ మోడీ మొదలు ఇక్కడి సామాన్య కార్యకర్త వరకు ప్రతి ఒకక్రిలో విషాద ఛాయలు పస్పుటంగా కనిపిస్తున్నాయి. ఇదొక అనూహ్య పరిణామం.  అయితే  ఈ మొత్తం వ్యవహారంలో, మోడీకి కాస్త ఊరట`కలిగించే అంశం ఏదైనా ఉందంటే, అది ప్రతిపక్షాల బలహీనత. ముఖ్యంగా రాహుల్ గాంధీ.. అతగాడి నోరు. అలాగే, మోడీకి ఉన్న బలం బావజాలం. సంఘ్ పరివారం. దేశంలో మరే పార్టీకికి లేని బలం , బలగం బీజేపీకి ఉన్నాయి, సో ..మోడీ  తాత్కాలికంగా కొంత మౌనంగా ఉన్నా, అదే ...శాశ్వతం అనుకోలేము .. ఎన్నికలకు ఇంకా మూడేళ్ళ సమయం ఉంది ... ఈ మూడేళ్ళలో ఏమైన జరగవచ్చును... ఏది జరిగినా అది దేశానికి మంఛి జరగాలి.. అదే సామాన్యుల కోరిక.

ఆల‌యంలో వైసీపీ క‌ల‌ర్స్‌.. అధికారుల ఓవ‌రాక్ష‌న్‌.. టెంపుల్ పాలిటిక్స్‌..

నీలం, తెలుపు, ఆకుప‌చ్చ‌.. ఈ మూడు వైసీపీ జెండా రంగులు. ఏపీని ఈ మూడు రంగుల్లో ముంచెత్తాల‌ని గ‌తంలో ప్ర‌య‌త్నించారు. గ్రామ స‌చివాల‌యాలు, ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు, రేష‌న్ షాపులు, ప్ర‌భుత్వం అనే పేరున్న దేనికైనా.. ఈ మూడు రంగుల‌నే పులిమేవారు. కోర్టు మొట్టికాయ‌ల‌తో ఈ మ‌ధ్య కాస్త కంట్రోల్ అయ్యారు.  తాజాగా, మ‌రోసారి ఓవ‌రాక్ష‌న్ చేశారు అధికారులు. ఈసారి ఏకంగా గుళ్లోనే ఆ మూడు రంగులతో అలంక‌ర‌ణ చేసేశారు. దేవుడంటే భ‌యంలేదో.. లేక‌, ముఖ్య‌మంత్రి అంటే భ‌య‌మో తెలీదు కానీ.. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల ఆలయ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. స్వామివారి బ్రహ్మోత్సవాలను రాజ‌కీయ కార్య‌క్ర‌మంగా మార్చేశారంటూ విమ‌ర్శ‌లు వెళ్లువెత్తుతున్నాయి.  ద్వార‌కా తిరుమ‌ల‌లో ఈ నెల 22 నుంచి 29 వరకు.. వైశాఖమాస తిరు కల్యాణోత్సవాలు జరిగాయి. శనివారం  బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు కావడంతో రాత్రి స్వామి వారి పవళింపు సేవ నిర్వహించారు. ఆ సంద‌ర్భంగా గర్భాలయంలో పూలు, పళ్లతో అలంకరణ చేశారు. ఈ అలంకరణలో భాగంగా.. వైసీపీ రంగులతో కూడిన ప్లాస్టిక్ పూల దండలను వినియోగించడం ప్ర‌స్తుత వివాదానికి కేంద్రం.  గర్భాలయంతో పాటు ఆలయ ముఖద్వారాలకు గజ మాలలుగా వైసీపీ జెండా రంగుల ప్లాస్టిక్ పూలను వేలాడ దీయ‌డంపై పెద్ద ఎత్తున‌ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆలయ ఈవో జీవీ సుబ్బారెడ్డితో పాటు అధికారుల తీరుపై భ‌క్తులు భక్తులు మండిపడుతున్నారు. దేవాల‌యంలో ఈ రాజ‌కీయ రంగులు ఏంటంటూ త‌ప్పుబ‌డుతున్నారు. స‌హ‌జ‌మైన పూల‌తో అలంక‌రించ‌కుండా.. కావాల‌ని ఇలా వైసీపీ రంగులు ఉన్న ప్లాస్టిక్ పూల‌దండ‌ను తెప్పించ‌డం ఏంట‌ని భ‌క్తులు మండిప‌డుతున్నారు. ప్లాస్టిక్ పూల‌ను పెట్ట‌డం.. వెంక‌న్న స్వామి వైభ‌వాన్ని కించ‌ప‌ర‌చ‌డ‌మేన‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.  అయినా.. మంచి పాల‌న అందిస్తే ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొందుతారు కానీ.. ఇలా రంగుల‌ను చూసి.. ఎవ‌ర‌బ్బా ఓట్లు వేసేది? ఇంత చిన్న లాజిక్ మ‌రిచి.. ముఖ్య‌మంత్రిని ప్ర‌స‌న్నం చేసుకునేందుకు.. దేవాదాయ శాఖ అధికారులు ఇలా ద్వార‌కా తిరుమ‌ల‌ను రాజ‌కీయ రంగుల‌ క్షేత్రంగా మార్చ‌డాన్ని భ‌క్తులు చీద‌రించుకుంటున్నారు. 

రాజ్‌నాథ్‌తో రఘురామ.. సీఎం కేసీఆర్‌కు లేఖ‌.. న్యాయం కోసం పోరాటం..

దెబ్బ‌తిన్న పులిలా ఎంపీ ర‌ఘురామ కృష్ణ‌రాజు న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు. త‌న‌కు జ‌రిగిన అన్యాయంపై రాజ్యాంగ వ్య‌వస్థ‌ల ముందు ఏక‌రువు పెడుతున్నారు. ఇప్ప‌టికే మెజిస్ట్రేట్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వ‌ర‌కు.. రాజ్యంపై ఒంట‌రి పోరాటం చేస్తున్నారు. మ‌రోవైపు, ఆయ‌న కుటుంబ స‌భ్యులు సైతం ర‌ఘురామ త‌ర‌ఫున త‌మ వంతు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఏపీ ప్ర‌భుత్వ కుట్ర‌ల‌పై లోక్‌స‌భ స్పీక‌ర్ నుంచి జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ వ‌ర‌కూ.. ర‌ఘురామ‌కు జ‌రిగిన దారుణంపై ఫిర్యాదులు చేశారు. అక్క‌డితో ఆగిపోలేదు ర‌ఘురామ‌. తాజాగా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో ఆయ‌న‌ భేటీ అయ్యారు. దాదాపు 10 నిమిషాల పాటు సమావేశమయ్యారు.  సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేశాక‌.. సికింద్రాబాద్‌ ఆర్మీ హాస్పిట‌ల్ నుంచి డిశ్చార్జ్ అయి.. నేరుగా ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స తీసుకున్నారు ర‌ఘురామ‌. ఆయ‌న కాలికి తీవ్ర గాయాలు ఉండ‌టంతో ప్లాస్ట‌ర్ ఆఫ్ పారిస్‌తో క‌ట్లు క‌ట్టిన వైద్యులు.. ఆయ‌న‌కు రెస్ట్ అవ‌స‌ర‌మ‌ని సూచించారు. ఢిల్లీ ఎయిమ్స్ నుంచి వ‌చ్చాక‌.. తాజాగా కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను క‌లిసి మొత్తం విష‌యాన్ని ఆయ‌న దృష్టికి తీసుకొచ్చారు. ఏపీ ప్రభుత్వం తనపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తోందని రాజ్‌నాథ్‌కు రఘురామ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కాలి గాయాల‌తో న‌డ‌వ‌లేని స్థితిలో ఉన్న ర‌ఘురామ‌.. వీల్‌ చెయిర్‌లోనే రాజ్‌నాథ్ ఇంటికి వెళ్లారు.   మ‌రోవైపు.. ఎంపీ ర‌ఘురామ కృష్ణ‌రాజు.. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖ రాయ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఒక ప్రజాప్రతినిధిని అరెస్టు చేసే సమయంలో పొరుగు రాష్ట్ర పోలీసులు అనుసరించాల్సిన విధివిధానాలు, మార్గదర్శకాలను గచ్చిబౌలి స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ (ఎస్‌హెచ్‌వో) పట్టించుకోలేదని ర‌ఘురామ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ అధికారిపై  క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈనెల 14న తన అరెస్టు సమయంలో చోటుచేసుకున్న నిబంధనల ఉల్లంఘనను వివరిస్తూ... కేసీఆర్‌కు 8 పేజీల లేఖ రాశారు ర‌ఘురామ‌. ‘‘నాపై ఏపీసీఐడీ సూమోటోగా కేసు నమోదు చేసింది. ఈ  కేసును గుంటూరు సీఐడీ అడిషనల్‌ ఎస్పీ విజయపాల్‌ నేతృత్వంలో పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 14వ తేదీన హైదరాబాద్‌ గచ్చిబౌలి బౌల్డర్‌హిల్స్‌లోని నా నివాసమైన 74వ నంబర్‌ విల్లాకు ఒక బృందం వచ్చింది. నన్ను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసేందుకు వచ్చినప్పుడు గచ్చిబౌలి స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ కనీస పోలీసు మాన్యువల్స్‌ను కూడా పట్టించుకోలేదు. ఎంపీగా ఉన్న నా అరెస్టుకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని కూడా పరిశీలించలేదు. ఏపీసీఐడీ  నుంచి ట్రాన్సిట్‌ రిమాండ్‌ ఆర్డరు తీసుకోలేదు. అసలు ఎఫ్‌ఐఆర్‌ ఉందో లేదో కూడా పరిశీలించలేదు. నన్ను అరెస్టు చేసే ముందు నా ఆరోగ్య పరిస్థితిపై  స్థానిక ఆసుపత్రిలో పరీక్షలు చేయించాలన్న నిబంధనను పట్టించుకోలేదు. నన్ను అదుపులోకి తీసుకుంటున్న సమయంలో ఏపీసీఐడీ న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా వ్యవహరించేలా చూడాల్సిన బాధ్యతనూ విస్మరించారు. నన్ను కారులోకి నెట్టేస్తున్నా గచ్చిబౌలి ఎస్‌హెచ్‌ఓ స్పందించలేదు. రాజ్యాంగ హక్కులను కాపాడడంలో భాగంగా నా అరెస్టుకు సంబంధించి ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. అది కూడా తీసుకోలేదు’’ అని రఘురామ లేఖ‌లో వివరించారు.  తనను అరెస్టు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దును దాటేముందు ప్రస్తుతమున్న నిబంధనలు, మార్గదర్శకాల మేరకు తెలంగాణ ప్రభుత్వ అనుమతిని ఏపీసీఐడీ తీసుకోలేదని ఆరోపించారు. తెలంగాణ పోలీసులు ‘రూల్‌ ఆఫ్‌ లా’ను అమలుచేసేలా చర్యలు తీసుకోవాలని కేసీఆర్‌ను కోరారు. సీఐడీ అడిషనల్‌ ఎస్పీ విజయపాల్‌ బృందంతో పాటు తన నివాసానికి వచ్చిన గచ్చిబౌలి పోలీసు సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు.  ఇలా, ఎంపీ ర‌ఘురామ త‌న అరెస్ట్ విష‌యంలో అసంబ‌ద్ధంగా వ్య‌వ‌హ‌రించిన ప్ర‌తీ ఒక్క అంశంపై పోరాడుతున్నారు. ఇప్ప‌టికే కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండ‌గా.. ఎన్‌హెచ్ఆర్‌సీ, కేంద్ర ర‌క్ష‌ణ‌మంతి, తెలంగాణ ముఖ్య‌మంత్రి.. ఇలా న్యాయం కోసం ఆయ‌న తొక్క‌ని గ‌డ‌ప లేదు. అంతిమ విజ‌యం సాధించే వ‌ర‌కూ విశ్ర‌మించేది లేద‌న్న‌ట్టు ఉంది ర‌ఘురామ చిత్త‌శుద్ధి. మ‌రి, త‌ను చేస్తున్న ఒంట‌రి పోరాటంలో ఏ మేర‌కు స‌ఫ‌లం అవుతారో చూడాలి...

అప్పులు కాదు అభివృద్ధి కావాలి!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనకు రెండేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా వైసీపీ పాలనపై స్పందించారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. రెండేళ్లుగా ఏపీలో జరిగిన, జరుగుతున్న పరిణామాలను ఉదహరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యూజిలాండ్‌లో  టీడీపీ మ‌హానాడు నిర్వ‌హ‌ణ‌లో భాగంగా  వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో మాట్లాడారు చంద్రబాబు. రాజ‌కీయ క‌క్ష కోసం తాను ఎన్న‌డూ ప్ర‌య‌త్నాలు చేయ‌లేద‌ని చెప్పారు. అభివృద్ధి కోసమే నిరంతం తపించానని తెలిపారు.  ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అరాచక పాలన సాగుతుందన్నారు. అభివృద్దినా గాలికొదేలిసి ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ అప్పులమయం చేశారని ఆరోపించారు. ఆర్థిక అస‌మాన‌త‌ల‌ను తొల‌గించుకుంటూ పోవాలి.. అంతేగానీ, ఇష్ట ప్ర‌కారం చేసుకుంటూ పోతానంటే అభివృద్ధి జ‌ర‌గ‌దని చెప్పారు. ఆంధ్రప్ర‌దేశ్‌లో ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితులే కొన‌సాగుతున్నాయి.. అప్పులు చేసుకుంటూ పోతున్నారని అన్నారు. 'ఇలా చేసుకుంటూ పోతే భ‌విష్య‌త్తులో అప్పులు ఇచ్చే వారు కూడా క‌ర‌వైపోతారు రాష్ట్రం దివాళా తీస్తుంది. ఏ రాష్ట్ర ప్ర‌భుత్వ‌మైనా సంప‌ద సృష్టించాలి. ఆ సంప‌ద‌తో ప‌థ‌కాల‌ను కొన‌సాగించాలి. కానీ ప్ర‌స్తుత ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఇటువంటి ప‌ని చేయ‌ట్లేదు. అప్పులు చేసుకుంటూ వెళ్తోంది' అని చంద్ర‌బాబు విమ‌ర్శ‌ల జ‌ల్లు కురిపించారు. ఐటీని ప్ర‌మోట్ చేయాల‌ని ఆనాడు హైటెక్ సిటీకి రూప‌క‌ల్ప‌న చేశానని చెప్పారు చంద్రబాబు. అమెరికాలో తిరిగి భార‌త్‌కు రావాల‌ని ఐటీ కంపెనీల‌ను కోరాను.. మైక్రోసాఫ్ట్ ప్ర‌తినిధుల‌తో మాట్లాడానని చంద్ర‌బాబు తెలిపారు. భార‌త్ లో ఐటీ రంగ అభివృద్ధికి ఉన్న అవ‌కాశాల‌ను వివ‌రించి.. మైక్రోసాఫ్ట్ బ్రాంచ్‌ను హైద‌రాబాద్‌లో పెట్టాల‌ని కోరానన్నారు. మైక్రోసాఫ్ట్ హైద‌రాబాద్‌కు వ‌స్తే ప్ర‌పంచంలోని అనేక ఐటీ కంపెనీలు అక్క‌డ‌కు వ‌స్తాయ‌ని భావించాను... అనంత‌రం అదే జ‌రిగిందన్నారు చంద్రబాబు. అనేక ఐటీ కంపెనీలు హైద‌రాబాద్‌లో ఉన్నాయంటే గతంలో తాను చేసిన ప్రయత్నమే కారణమన్నారు.హైద‌రాబాద్‌లో అభివృద్ధిని ఎప్పుడు చూసినా తనకు చాలా సంతృప్తి క‌లుగుతుందన్నారు చంద్రబాబు. తన విజన్ వల్లే హైద‌రాబాద్‌లో ఇంజ‌నీరింగ్ కాలేజీలు పెరిగాయని చెప్పారు. 

రెండేళ్ల అరాచ‌కం.. మ‌రో మూడేళ్లు భ‌రించాల్సిందేనా?

జ‌గ‌న్‌రెడ్డి గ‌ద్దె నెక్కి స‌రిగ్గా రెండేళ్లు. మిగిలింది మ‌రో మూడేళ్లు. ఈ రెండేళ్ల‌లోనే ర‌చ్చ రంబోలా చేశాడు. వామ్మో.. ఇంకో మూడేళ్లు భ‌రించాలా? అని జ‌నం బెంబేలెత్తిపోతున్నారు. జ‌గ‌న్ అన్నా.. ఆయ‌న పాల‌న‌న్నా.. జ‌నాలు అంత‌గా భ‌య‌ప‌డుతున్నారు. ఈ రెండేళ్ల‌లో జ‌గ‌న్ ఏం సాధించారో చెప్ప‌డం క‌ష్ట‌మే కానీ.. జ‌గ‌న్ ఏం నాశ‌నం చేశారో చెప్ప‌డం మాత్రం చాలా సులువు. పాల‌న‌ను ఎలా భ్ర‌ష్టు ప‌ట్టించారో చెప్ప‌డానికి అనేక ఉదాహ‌ర‌ణ‌లు... ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని ఏది? ఈ ప్ర‌శ్న ఏ సివిల్ స‌ర్వీస్ ఇంట‌ర్వ్యూలో అడిగినా ట‌క్కుమ‌ని స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితి?  దేశంలోకే క‌ఠినమైన‌ ప్ర‌శ్న ఇది. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాజ‌ధాని అమ‌రావ‌తి అని.. ఆంధ్రులంతా స‌గ‌ర్వంగా.. చాతి విరుచుకు మ‌రీ చెప్పుకునే వారు. మా రాజ‌ధాని.. సింగ‌పూర్ త‌ర‌హాలో ఉంటుంద‌ని.. మాది అంత‌ర్జాతీయ స్థాయి రాజ‌ధాని అని.. మా రాజ‌ధానికి దేశంలో మ‌రే ప్రాంతం సాటికాద‌ని.. ఇలా ఆంధ్రులంతా గొప్ప‌లు పోయేవారు. సీమ ప్ర‌జ‌లు సైతం అమ‌రావ‌తిని అదృష్టంగా భావించారు. ఉత్త‌రాంధ్ర వాసులు సైతం మా అమ‌రావ‌తి అని మురిసిపోయారు. ఒక్క ఛాన్స్ అంటూ అంద‌ల‌మెక్కిన జ‌గ‌న‌న్న‌.. ఒక్క మాట‌తో అమ‌రావ‌తిని మూడు ముక్కలు చేశాడు. ఆ ముక్క‌ల‌నైనా చ‌క్క‌గా చేశాడా? అంటే అదీ లేదు. క‌ర్నూలు అలానే కునారిల్లుతోంది. త‌మ ప్రాంతానాకి న్యాయం జ‌ర‌గ‌డం కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉంది. జ‌గ‌న్‌రెడ్డి తీరును చూసి విశాఖ విస్తుబోతోంది. స‌ముద్ర‌తీరంలో జ‌రుగుతున్న‌ భూదందాల‌తో బెదిరిపోతోంది. జ‌గ‌న్‌రెడ్డి రెండేళ్ల పాల‌న ఎంత అరాచ‌కంగా సాగిందో చెప్ప‌డానికి.. అమ‌రావ‌తినే బెస్ట్ ఎగ్జాంపుల్ అంటున్నారు. 500 రోజుల‌కు పైబ‌డి అమ‌రావ‌తి రైతులు దీక్ష‌లు చేస్తున్నా.. ఈ స‌ర్కారులో ఉలుకూప‌లుకూ లేకుండా పోయింది. రైతుల చేతికి సంకెళ్లు వేసి అక్క‌సు తీర్చుకున్న ఘ‌న‌త జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌దే అనే విమ‌ర్శ‌. అసైన్డ్ భూములంటూ.. ఏకంగా ప్ర‌తిప‌క్ష నేత‌పైనే కేసుల కుట్ర చేస్తుండ‌టం ఈ రెండేళ్ల పాల‌న ఫ‌లితం.  న‌వ్యాంధ్ర మొద‌టి ముఖ్య‌మంత్రిగా.. ఏపీపై చంద్ర‌బాబు చేసిన అంద‌మైన‌ సంత‌కాన్ని.. విధ్వంసంతో చెరిపేసే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌నేది అంద‌రి అభిప్రాయం. చంద్ర‌బాబు ల‌క్ష్యంగానే జ‌గ‌న్ పాల‌న కొన‌సాగుతోంద‌ని అంటున్నారు. గ‌ద్దె నెక్కిన తొలినాళ్ల‌లోనే.. 'ప్ర‌జా వేదిక' కూల్చేసి.. ప్ర‌తీకారం తీర్చుకున్నార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ.. ఐఏఎస్‌, ఐపీఎస్‌ల స‌మావేశం పెట్టాలంటే.. ఏపీలో ఒక మంచి వేదికంటూ లేకుండా పోయింది. ప్రజా వేదిక కూల‌గొట్టి ఏం సాధించారో జ‌గ‌న్‌కే తెలియాలి అంటున్నారు. ఇక‌, అక్ర‌మ నిర్మాణ‌మంటూ చంద్ర‌బాబు నివాసానికి ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చారో.. వారికే తెలీదు. మ‌రి, ఈ రెండేళ్ల‌లో క‌ర‌క‌ట్ట‌పై అక్ర‌మ నిర్మాణాల తొల‌గింపు ఎంత వ‌ర‌కు వ‌చ్చింది ముఖ్య‌మంత్రి గారు?   మ‌రింత దారుణ‌మైన విష‌యం ఏంటంటే.. పేద‌ల నోటి కాడి.. కూడు చెద‌ర‌గొడుతూ.. అన్న క్యాంటీన్ల‌ను అర్థాంత‌రంగా మూసేయ‌డం. ప్ర‌భుత్వం మారింది.. పేద‌ల నిత్యాన్న‌ప‌థ‌కం మూత‌బ‌డింది. రాజ‌న్న క్యాంటీన్లు పెడ‌తామ‌న్నారు.. రెండేళ్లు అవుతోంది ఏవి?  పేద‌ల‌కు ప‌ట్టెడు అన్నం పెట్ట‌డానికి కూడా ఇంత రాజ‌కీయం చేయాలా జ‌గ‌న్‌? అని క‌డుపు కాలుతున్న వాళ్లంతా క‌డుపుమంట‌తో నిల‌దీస్తున్నారు.  న‌వ‌రత్నాల పాల‌నంటూ జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం మురిసిపోతోంది. ఆ న‌వ‌ర‌త్నాల వెనుక ఉన్న‌.. అప్పుల కుప్ప‌ల సంగ‌తి సామాన్యుల‌కు తెలీద‌ని అనుకుంటోంది. ఈ రెండేళ్ల‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను.. అప్పుల‌ప్ర‌దేశ్‌గా మార్చేశారు. ఇక అప్పు ముట్ట‌డం క‌ష్ట‌మ‌వుతుండ‌టంతో.. ఏకంగా ప్ర‌భుత్వ భూముల‌ను అడ్డంగా అమ్మేసుకునేందుకు తెగ‌బ‌డుతున్నారు. బంగారంలాంటి విశాఖ భూముల‌ను అంగ‌ట్లో వేలానికి పెట్టారు. అప్పులు, అమ్మేసుకోవ‌డాలే.. రెండేళ్ల విశిష్ట‌త‌.  ఇక‌, అభివృద్ధి అనే ప‌దం ఏపీలో అడ్ర‌స్ లేకుండా పోయింది. ఈ రెండేళ్ల‌లో ఒక్క‌టంటే ఒక్క కంపెనీ అయినా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వ‌చ్చిందా? ఒక్క‌టంటే ఒక్క భారీ పెట్టుబ‌డి అయినా ఏపీలో పెట్టారా?  చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్పుడు.. కియాలాంటి ఎన్నో కంపెనీలు ఏపీకి క్యూ క‌డితే.. జగ‌న్‌రెడ్డి సీఎం అయ్యాక‌.. ఉన్న కంపెనీలే త‌ట్టాబుట్టా స‌దురుకొని రాష్ట్రం నుంచి చెక్కేసే ప‌రిస్థితి దాపురించిందని వ్యాపార వ‌ర్గాలు గ‌గ్గోలు పెడుతున్నా.. ఈ ముఖ్య‌మంత్రి చెవికి సోకితేగా?  విశాఖ స్టీల్ ప్లాంట్ మ‌న‌ది కాకుండా పోతున్నా.. ప‌ట్టించుకుంటేగా?      ఇక‌, లిక్క‌ర్‌, ఇసుక పాల‌సీల గురించి ఎంత త‌క్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. దేశ ప్ర‌జ‌ల‌కు తెలిసిన‌.. ఏ బ్రాండ్ మ‌ద్యం కూడా ఏపీలో అమ్మ‌రు. మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్ర‌భుత్వప‌రం చేసి.. ఊరూ-పేరు లేని బ్రాండ్లు తీసుకొచ్చి.. భారీగా రేట్లు బాదేసి.. జ‌నాల‌తో బ‌ల‌వంతంగా మందు తాగిస్తున్నారు. మ‌ద్యం మాన‌లేక‌.. ఆ మందు గొంతు దిగ‌క‌.. బుక్క బుక్క‌కీ.. జ‌గ‌న్‌రెడ్డికి శాప‌నార్థాలు పెడుతున్నారు మందుబాబులు. వివిధ సంక్షేమ ప‌థకాల పేరుతో మ‌హిళ‌ల‌కు ఇస్తున్న డ‌బ్బంతా.. ఆ ఇంటాయ‌న తాగే మ‌ద్యం రూపంలో మ‌ళ్లీ ప్ర‌భుత్వ ఖ‌జానాకే చేరుతుంద‌నేది జ‌నం మాట‌. ఒక చేత్తో 10 రూపాయ‌లు ఇచ్చి.. మ‌రో చేత్తో వంద లాగేసుకుంటున్నార‌నే విమ‌ర్శ‌. ఆ మ‌ద్యం బ్రాండుల‌తో జ‌గ‌న్‌రెడ్డి జేబులోకి వేల కోట్ల రూపాయ‌లు క‌మిష‌న్‌గా వ‌చ్చి ప‌డుతోంద‌నేది ప్ర‌తిప‌క్షాల‌ ఆరోప‌ణ‌. ఇక‌, ఉచిత‌ ఇసుక హామీ ఎప్పుడు గంగ‌లో క‌లిసిపోయింది. ఏపీలోని ఇసుక రీచుల‌ను వేలం పాట‌లో అయిన వారికి అమ్మేసుకున్నారు. ఇసుక నుంచి కాసుల తైలంబు పిండుకుంటున్నారు.  అభివృద్ధితో పాటు పాల‌న ఇలా ప‌డ‌కేస్తే.. క‌క్ష్య సాధింపు చ‌ర్య‌లు, కుట్ర రాజ‌కీయాల్లో మాత్రం ఈ రెండేళ్ల‌లో జ‌గ‌న్‌రెడ్డి భారీ విజ‌య‌మే సాధించార‌ని చెప్పొచ్చు. ప్ర‌తిప‌క్ష నేత‌ చంద్ర‌బాబు మొద‌లు.. అచ్చెన్నాయుడు, జేసీ ఫ్యామిలీ, దేవినేని ఉమా, ధూళిపాళ్ల న‌రేంద్ర‌, కొల్లు ర‌వీంద్ర‌, కూన ర‌వికుమార్‌.. ఇలా ఏ జిల్లాలో ఎవ‌రినీ వ‌ద‌ల‌కుండా.. కుట్ర‌లు, కేసుల‌తో ఏపీలో ప్ర‌తిప‌క్ష‌మే లేకుండా చేయాల‌నే ప్ర‌య‌త్నాల్లో ఈ రెండేళ్లూ బిజీగా ఉన్నారు సీఎం జ‌గ‌న్‌రెడ్డి. ఇందులో ఏ కేసులో బ‌లం లేకుండా.. టీడీపీని భ‌య పెట్ట‌డానికే ఇలా కేసుల‌తో బెదిరిస్తున్నార‌నే విమ‌ర్శ వినిపిస్తోంది. ప్ర‌తిప‌క్షమ‌నే కాదు.. స్వ‌ప‌క్షంలో విప‌క్షంగా మారిన న‌ర్సాపురం ఎంపీ ర‌ఘురామ‌ను ఎంత‌గా ఇబ్బంది పెట్టాలో అంత‌కంటే ఎక్కువే ఇబ్బంది పెట్టింది ఏపీ స‌ర్కారు. ఇలాంటి క‌క్ష్య సాధింపు చ‌ర్య‌లో గ‌తంలో ఏ ప్ర‌భుత్వ‌మూ చేప‌ట్ట‌లేద‌ని.. ఇది జ‌గ‌న్ పైశాచిక ఆనందానికి నిద‌ర్శ‌న‌మ‌ని.. ప్ర‌తిప‌క్ష టీడీపీ ప్ర‌తినిత్యం విమ‌ర్శిస్తూనే ఉంది.  కేవ‌లం పార్టీలు, నేత‌ల‌నే కాదు.. రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల‌నూ జ‌గ‌న్‌రెడ్డి వ‌ద‌ల‌డం లేదంటూ జ‌నాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మాజీ ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్‌కు.. జ‌గ‌న్‌రెడ్డికి జ‌రిగిన.. టామ్ అండ్ జెర్రీ వార్‌ను చూసి జ‌నాలే చీద‌రించుకున్నారు. ఎన్నిక‌లు వ‌ద్దంటూ.. జ‌గ‌న్ స‌ర్కారు చేసిన కుట్ర‌లు.. మ‌ధ్య‌లో ఆర్డినెన్స్ తీసుకొచ్చి.. ర‌మేశ్‌కుమార్‌ను తొల‌గించి.. జ‌స్టిస్ క‌న‌క‌రాజ్‌ను ఎస్ఈసీగా చేసి.. కోర్టు మెట్టికాయ‌ల‌తో త‌ల‌బొప్పిక‌ట్టి.. అబ్బో.. స్టేట్ వ‌ర్సెస్ ఎస్ఈసీ ఎపిసోడ్‌.. ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్‌రెడ్డి అనుభ‌వ‌రాహిత్యానికి నిద‌ర్శ‌నం అంటున్నారు. ఇక‌, వ‌రుస‌గా జ‌రిగిన స్థానిక సంస్థ‌లు, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో అధికార ప‌క్షం చేసిన ఆగ‌డాల‌కు అడ్డూఅదుపు లేకుండా పోయింది. తిరుప‌తి ఉప ఎన్నిక‌లో దొంగ ఓట్లు పోటెత్తిన వైనం చూసి అంతా నివ్వెర్ర‌పోయారు.  ఇలా చెప్పుకుంటూ పోతే.. ఇంకా చాల‌నే ఉన్నాయి జ‌గ‌న్‌రెడ్డి య‌వ్వారాలు. ఈ రెండేళ్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఓ పీడ‌క‌లగా మారిందంటున్నారు. జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌లో అభివృద్ధిలో ఏపీ రెండు ద‌శాబ్దాలు వెన‌కబ‌డింద‌ని వాపోతున్నారు. అరాచ‌కాల్లో మాత్రం అంద‌నంత ఎత్తులో.. అంద‌రిక‌న్నా ముందున్నార‌ని అంటున్నారు. ఇలాంటి అధ్వాహ్న‌, అడ్డ‌గోలు పాల‌న‌ను ఏపీ ప్ర‌జ‌లు మ‌రో మూడేళ్లు భ‌రించాలా? అని భ‌య‌ప‌డిపోతున్నారు. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాలంటూ ఎంపీ ర‌ఘురామ సీబీఐ కోర్టులో వేసిన పిటిష‌న్‌పై వేగంగా విచార‌ణ జ‌రుగుతుండ‌టం ఒక్క‌టే కాస్త ఊర‌ట‌నిచ్చే అంశం.. అప్ప‌టి దాకా త‌ప్ప‌దు ఈ దారుణం అంటున్నారు. జ‌గ‌న్‌రెడ్డి రెండేళ్ల అరాచ‌క పాల‌న‌పై ఓ పుస్త‌కం రిలీజ్ చేయాల్సిన అవ‌స‌రం ఉందంటున్నారు ప్ర‌జాస్వామ్య‌వాదులు.

కొవిడ్ బాధితులకు  కేంద్రం  భరోసా 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండవసారి బాధ్యతలు స్వీకరించి రెండేళ్ళు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కొవిడ్’తో కన్నుమూసిన వారి కుటుంబాలను, కొవిడ్ కాటుకు తల్లి తడ్రులను కోల్పోయి అనాధలుగా మిగిలిన పిల్లలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సంక్షేమ చర్యలకు శ్రీకారం చుట్టింది. కొవిడ్  మహమ్మారి సృష్టించిన సంక్లిష్టతలను దృష్టిలో ఉంచుకుని, అనాధ పిల్లల సంరక్షణ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది.అనాధ పిల్లలకు కేవలం తాత్కాలిక ఆర్థిక సహాయం చేయడం కాకుండా, వారి జీవితాలను తీర్చిదిద్దే విధంగా, ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. అనాధ పిల్లలకు విద్యా బుద్ధులు అందించడంతో పాటుగా, వారికి  18 ఏళ్ల వయసు వచ్చే నాటికి, వారి పేరున రూ.పది లక్షల మూలనిధిని ‘పీఎం కేర్స్ ఫర్ చిల్ద్రన్’  ద్వారా ప్రభుత్వం సమకూరుస్తుంది. అదే విధంగా చిన్నారులకు ఉన్నత విద్య కోసం రుణ సదుపాయం కల్పించడంతో పాటు ఆ మొత్తానికి సంబంధించిన వడ్డీని పీఎం కేర్స్‌ చెల్లిస్తుంది. కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐ), ఉద్యోగుల భవిష్య నిధి సంస్థల సభ్యుల కుటుంబాలకు చేయూతగా పెన్షన్ అందజేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. కొవిడ్‌ కారణంగా తల్లిదండ్రులను లేదా వారిలో ఏ ఒక్కరినైనా కోల్పోయిన చిన్నారులకు సైతం పీఎం కేర్స్‌ నిధి ద్వారా పెన్షన్ సదుపాయం కలిపిస్తుంది.  ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వ్యవస్థీకృత కార్మికులు, ఉద్యోగులకే కాకుండా అవ్యవస్తీకృత రంగంలో పనిచేసే కార్మికులు కొవిడ్’తో మరణిస్తే వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ప్రస్తుత నిబంధనల ప్రకారం సగటు రోజు కూలీలో 90 శాతం సొమ్మును పెన్షన్‌గా అందజేస్తారు. గతేడాది మార్చి 24 నుంచి 2022 మార్చి 24 వరకు ఈ పథకం వర్తిస్తుంది. ఉద్యోగుల బీమా పథకం అనుసరించి ఇచ్చే గరిష్ఠ బీమా మొత్తాన్ని రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెరిగింది. కనిష్ఠ బీమా కింద రూ.2.5 లక్షలను ఇచ్చే పథకాన్ని కూడా పునరుద్ధరించారు.. ఈ పథకం గతేడాది ఫిబ్రవరి 15 నుంచి వచ్చే మూడేళ్లపాటు వర్తిస్తుంది. ఈ పథకాలకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడిస్తుంది’’ అని ప్రభుత్వం వివరించింది.  ఇదిలా ఉంటే, మరోవంక కరోనా మహమ్మారి రెండోదశలో తల్లిదండ్రులిద్దరినీ లేదా వారిలో ఏ ఒకరినైనా కోల్పోయిన చిన్నారుల వివరాలను సమర్పించాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌(ఎన్‌సీపీసీఆర్‌) రాష్ట్రాలను శనివారం కోరింది. ఆ సమాచారాన్ని ‘బాల్‌ స్వరాజ్‌ పోర్టల్‌’లో పొందుపరచాలని సూచిస్తూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కార్యదర్శులకు లేఖలు రాసింది. జువెనైల్‌ జస్టిస్‌ ప్రకారం తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను, వారి హక్కులను సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని కమిషన్‌ అభిప్రాయపడింది. అలాంటి చిన్నారులను బాలల సంక్షేమ కమిటీ ముందుకు తీసుకురావాలని తెలిపింది. కొవిడ్‌ కారణంగా తల్లిదండ్రులు చనిపోవడంతో దేశవ్యాప్తంగా సుమారు  577 మంది బాలలు అనాథలైనట్లు ఈ వారం ప్రారంభంలో ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో అలాంటి చిన్నారుల సంరక్షణకు చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల లేఖలు రాసింది. దిల్లీ, ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, పంజాబ్‌ సహా పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే చిన్నారుల కోసం ఉచిత విద్య, నెలవారీ భృతిని అందజేస్తూ అండగా నిలుస్తున్నాయి. పోషణ, సంరక్షణ అవసరమైన చిన్నారులను పర్యవేక్షించేందుకు బాల్‌ స్వరాజ్‌ పోర్టల్‌ను రూపొందించారు.

ముక్కు నేల‌కు రాస్తారా? కుట్ర‌ల‌కు భ‌య‌ప‌డేదే లే..

సీఎం కేసీఆర్‌తో తాడోపేడో తేల్చుకునేందుకే సిద్ధ‌మ‌వుతోంది మాజీ మంత్రి ఈట‌ల కుటుంబం. అక్ర‌మ కేసులు, అస‌త్య ఆరోప‌ణ‌ల‌పై తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్నారు. ఈట‌ల స‌తీమ‌ణి జ‌మున పేరుతో కొనుగోలు చేసిన భూముల‌ను.. క‌బ్జా భూములంటూ ప్ర‌చారం చేయ‌డంపై మండిప‌డుతున్నారు. ఇప్ప‌టికే రాజ్యం బ‌నాయించిన కేసుల‌పై ఈట‌ల రాజేంద‌ర్ ఇటు ప్ర‌జాక్షేత్రంలో.. అటు హైకోర్టులో.. పోరాడుతున్నారు. బ‌ల‌మైన ప్ర‌భుత్వాన్ని ఎదుర్కోవాలి కాబ‌ట్టి.. బ‌ల‌మైన జాతీయ పార్టీలో చేరేందుకూ సిద్ధ‌మ‌వుతున్నారు. అటు టీఆర్ఎస్ నేత‌లు.. ఇటు పింక్ మీడియా క‌లిసి.. ఈట‌ల అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డారంటూ దుమ్మెత్తిపోస్తుండ‌టంపై.. ఈట‌ల ఫ్యామిలీ భ‌గ్గుమంది. తాజాగా, ఈట‌ల స‌తీమ‌ణి జ‌మున  కేసీఆర్‌పై, అధికారుల‌పై డైరెక్ట్‌గా మాట‌ల యుద్ధానికి దిగారు. బ‌స్తీమే స‌వాల్ అన్న‌ట్టు మాట్లాడారు.  ‘‘మెదక్‌ జిల్లా మాసాయిపేటలో 46 ఎకరాలు కొనుగోలు చేశాం. ఒక్క ఎకరం ఎక్కువగా ఉన్నా ముక్కు నేలకు రాస్తా.. సర్వే చేసిన అధికారులు ముక్కు నేలకు రాస్తారా?’’ అంటూ స‌వాల్ విసిరారు ఈట‌ల జ‌మున‌.  తమ హేచరీస్‌, గోదాములపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని జమున ఆరోపించారు. అసత్య ప్రచారాలు తిప్పికొట్టడం తమకు తెలుసన్నారు. తాము కష్టపడి పైకొచ్చామని.. ఎవరినీ మోసం చేయలేదన్నారు. మాసాయిపేటలో మోడ్రన్‌ హ్యాచరిస్ పెట్టాలని 46 ఎకరాలు కొన్నామని, బడుగు బలహీనవర్గాల భూమి కాజేశామని దుష్ప్రచారం చేస్తున్నారని మండిప‌డ్డారు. 1992లో దేవరయాంజల్‌ వచ్చి 1994లో అక్కడి భూములు కొన్నాం. మా గోదాములు ఖాళీ చేయించి ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తున్నారు. అసత్య ప్రచారాలు ఎక్కువ రోజులు నిలవలేవు. ఎన్ని కుట్రలు చేసినా భయపడేది లేదంటూ భ‌గ్గుమ‌న్నారు ఈట‌ల రాజేంద‌ర్ స‌తీమ‌ణి జ‌మున‌. ప‌నిలో ప‌నిగా.. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ప‌త్రిక‌పైనా ఫైర్ అయ్యారు. పత్రిక ఉందని ఎలా పడితే అలా రాస్తారా? మా స్థలంలో ఏర్పాటు చేసిన పత్రికలోనే మాపై దుష్ప్రచారం చేస్తారా? అంటూ నిల‌దీశారు. నిజాలు ఎప్పటికైనా బయటపడతాయని, పత్రిక కోసం భూమి ఇచ్చిన కుటుంబం తమదని ఈటల భార్య జమున ఆవేశంగా మాట్లాడారు.  ముక్కు నేల‌కు రాస్తారా? అంటూ నేరుగా అధికారుల‌ను.. మా భూమిలో పెట్టిన ప‌త్రిక అంటూ ప‌రోక్షంగా కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ.. ఇక త‌గ్గేదే లే.. తాడోపేడో తేల్చుకునుడే.. అన్న‌ట్టుగా ఈట‌ల జ‌మున సంకేతాలు ఇచ్చారు. 

అవమాన భారంతో ఏడ్చిన ఈటల రాజేందర్! 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో తాడోపేడో తేల్చుకునేందుకు మజీ మంత్రి ఈటల రాజేందర్ సిద్ధమయ్యారు. సీఎం కేసీఆర్ కు, టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈటల రాజేందర్ కుటుంబ సభ్యులు ఓపెన్ చాలెంజ్ విసిరారు. తమపై చేస్తున్న ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు. ఒక మహిళగా ఛాలెంజ్ చేస్తున్నా అక్రమాలు జరిగినట్లు నిరూపించాలంటూ ఈటల జమున సవాల్ చేశారు. ఉద్యమంలోకి రాక ముందు కేసీఆర్ కుటుంబ ఆస్తులు ఎంత..? ఇప్పుడు ఎంత..? చర్చకు సిద్ధమేనా అంటూ జమున ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు ఈటల జమున.  సమైక్యాంధ్రలో ఆత్మ గౌరవంతో బ్రతికామన్నారు జమున. 2014 నుంచి ఆ పరిస్థితులు లేవన్నారు. ప్రగతి భవన్ గేట్ వద్దే మూడు సార్లు అపాయింట్మెంట్ లేదని ఆపితే ఈటెల ఇంటికి వచ్చి ఏడ్చినా సందర్భాలు ఉన్నాయన్నారు జమున. ఉమ్మడి రాష్ట్రంలో ఈటెల కు జ్వరం వస్తే అప్పటి పాలకులు వచ్చి పరామర్శించారని.. తెలంగాణ వచ్చాక ఆ పరిస్థితి లేదన్నారు. ఉద్యమంలో ఈటెల రెండు మూడు రోజులు ఇంటికి రాకపోయినా కూడా దైర్యంగా ఉన్నామని.. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ పరిస్థితులు లేవన్నారు. వైఎస్సార్ పార్టీలోకి  ఆహ్వానిస్తే  వెళ్లని వ్యక్తి రాజేందర్ అని చెప్పారు. అధికారం ఉందని ఎం చేసినా చెల్లుతుందని అనుకుంటే పోరపాటన్నారు జమున.  ఉద్యమంలో ఈటెల పెట్టిన డబ్బుల గురించి ఎవరైనా ఆడిగారా..? అని జమున ప్రశ్నించారు. తాను వ్యాపారం చేస్తూ ఈటెలను ఉద్యమంలోకి పంపానని చెప్పారు.  తన వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బుల ద్వారా ఉద్యమంలో ఈటెల అందరిని కాపాడుకున్నారని జమున తెలిపారు.  ఈటెల ఉద్యమంలో ఎలా ఉన్నాడో ఓయూ విద్యార్థులను అడగాలన్నారు. తన  ఆస్తులు మొత్తం అమ్మి ఐనా సరే మా ఆయనకు అండగా ఉంటానని జమున స్పష్టం చేశారు. తెలంగాణ ఆత్మ గౌరవ పోరాటంలో ఎంతకైనా సిద్ధమేనన్నారు. నయీమ్ చంపుతాను అంటే భయపడలేదన్నారు.  వకులాభారణం మొహం చూసి ఒక్క వోట్ పడతాదా అని జమున ఎద్దేవా చేశారు. అన్నా అని బతిలాడితే బీసీ కమిషన్ లో సభ్యుడిగా నియామకం జరిగేలా చేశారన్నారు. తన  ఇంట్లో అన్నం తిన్న వాళ్ళతోనే తిట్టిస్తున్నారని విమర్శించారు. పోలీసులు తన కుటుంబం కోసమే పని చేస్తున్నట్లు ఉందన్నారు. సమైక్య పాలనలో కూడా ఇన్ని ఇబ్బందులు లేవన్నారు జమున. ఇప్పుడు రెడ్డి-ముదిరాజ్ లమని ఇప్పుడు గుర్తుకు వచ్చిందా..? అని ప్రశ్నించారు. కులాల పేరుతో పాలన చేస్తున్నారని జమున మండిపడ్డారు. 

తెలంగాణలో లాక్ డౌన్ పొడిగింపే?

తెలంగాణలో లాక్ డౌన్ ను సడలిస్తారా.. పొడిగిస్తారా? సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. రాష్ట్రంలో మే 12 నుంచి లాక్ డౌన్ అమలవుతోంది. మొదట మే 20 వరకు ప్రకటించారు. తర్వాత 30వ తేదీ వరకు పొడిగించారు. ఆదివారంతో అ గడువు ముగియనుండటంతో లాక్ డౌన్ పై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది.  ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు సడలింపు ఇస్తూ... తర్వాత లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. ఇదే విధంగా మరో  10 రోజులు లాక్ డౌన్ పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది.  కరోనా కట్టడి, లాక్‌డౌన్‌ అమలుపై రాష్ట్రమంత్రివర్గం భేటీలో చర్చించనున్నారు.  జూన్‌ నెలాఖరు వరకు కరోనా మార్గదర్శకాలను పొడిగిస్తూ కేంద్రం నిర్ణం తీసుకుంది. దీంతో తెలంగాణలోనూ లాక్‌డౌన్‌ పొడిగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. లాక్ డౌన్ తోనే  కరోనా నియంత్రణ పటిష్టంగా జరుగుతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది. కేబినెట్ సమావేశానికి హోంశాఖ, వైద్యారోగ్య, ఆర్థిక శాఖ అధికారులను పిలిచి మాట్లాడే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది. కరోనా కట్టడికి ఇప్పటిదాకా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు, ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో అందుతున్న వైద్యసేవలు, అందుబాటులో ఉన్న బెడ్లు, ఆక్సిజన్‌ సరఫరా, బ్లాక్‌ఫంగస్‌ చికిత్సపై సమావేశంలో చర్చించనున్నారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్రస్తుతం లాక్ డౌన్ అమలవుతోంది. చాలా రాష్ట్రాలు జూన్ 15 వరకు పొడిగించాయి. తెలంగాణ పక్క రాష్ట్రాలైనా కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లోనూ లాక్ డౌన్, కర్ఫ్యూ అమలవుతోంది. పక్క రాష్ట్రాల్నని లాక్ డౌన్ లో ఉన్నందున... ఇక్కడ కూడా లాక్ డౌన్ పెట్టడం తప్పనిసరని అధికారులు అభిప్రాయపడుతున్నారు.  రాష్ట్రంలో 600 టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి చేయాలని సర్కారు నిర్ణయించిన నేపథ్యంలో ఈ అంశంపై సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నది. సంగారెడ్డి, జగిత్యాల, కొత్తగూడెం, వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్‌లో కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటుకు సంబంధించిన ఫైలును మంత్రివర్గం ఆమోదించనున్నది. వైద్యసిబ్బంది నియామకం, జ్వరసర్వే, వ్యాక్సిన్‌ గ్లోబల్‌ టెండర్లపై చర్చించనున్నారు. వ్యాక్సిన్‌ గ్లోబల్‌ టెండర్ల ప్రక్రియలో ప్రీబిడ్డింగ్‌ సమావేశం కూడా పూర్తయ్యింది. కొవిషీల్డ్‌, స్పుత్నిక్‌-వీ వ్యాక్సిన్‌ తయారుచేసిన అంతర్జాతీయ కంపెనీలు బిడ్లను దాఖలు చేశాయి. ఈ అంశంపైనా చర్చించే అవకాశం ఉన్నది. వర్షాకాల వ్యవసాయ సీజన్‌ వస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ వ్యవసాయరంగంపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచటం, రైతుబంధు అందజేత తదితర అంశాలపై క్యాబినెట్‌ సమావేశంలో చర్చించి పలు నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉన్నది. ధాన్యం సేకరణ ఎంతవరకు వచ్చిందనే అంశంపైనా చర్చించే అవకాశం ఉన్నది. జూన్ 15 నుంచి రైతు బంధు నిధులు అందిస్తామని చెప్పడంతో.. దానిపైనా కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. 

ఎంసెట్ పరీక్షలు వాయిదా

తెలంగాణలో  ఎంసెట్‌ పరీక్షలు వాయిదా  పడ్డాయి. కరోనా ఉధృతి తగ్గనందున పరీక్షలను వాయిదా వేయాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం జూలై 5, 6 తేదీల్లో ఎంసెట్‌ మెడికల్‌.. 7, 8, 9 తేదీల్లో ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే మే2 నుంచి జరగాల్సిన ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు వాయిదాపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సెకండియర్‌ పరీక్షలను జూలై 15 తర్వాత నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించిన తేదీలను ప్రకటించాల్సి ఉంది. ఇంటర్‌ ద్వితీయ సంవత్సర పరీక్ష తేదీలు ఖరారైన తర్వాత ఎంసెట్‌ తాజా షెడ్యూల్‌ను ప్రకటిస్తామని తెలంగాణ ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ఆచార్య తుమ్మల పాపిరెడ్డి వెల్లడించారు.. ఇక వెనుకబడిన, సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాలకు  జరగనున్న టీజీసెట్‌ ప్రవేశపరీక్ష వాయిదా పడింది. ఈ పరీక్ష ఆదివారం జరగాల్సి ఉంది. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో పరీక్షను వాయిదా వేశామని, తదుపరి తేదీని తర్వాత ప్రకటిస్తామని టీజీ సెట్‌ కన్వీనర్‌, సాంఘిక, గిరిజన గురుకులాల విద్యాసంస్థల కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

రాజ‌రాజ న‌రేంద్రుడు.. సంగం స‌పోర్ట్‌ ఆయ‌న‌కే..

ధూళిపాళ్ల న‌రేంద్ర‌. సంగం డెయిరీ ఛైర్మ‌న్ ఆయ‌న‌. ఏళ్లుగా ఆయ‌నే అధిప‌తి. పాల ఉత్ప‌త్తిదారుల‌కు పెన్నిధి. డెయిరీలో ఎలాంటి స‌మ‌స్య లేదు. అంతా సంతోషంతో ఉన్నారు. అందుకే, స‌ర్కారుకు క‌ళ్లు మండిన‌ట్టున్నాయి. ధూళిపాళ్ల టీడీపీ నాయ‌కుడు కాబ‌ట్టి.. ఆయ‌న సార‌ధ్యంలోని సంగం డెయిరీని టార్గెట్ చేసిన‌ట్టున్నారు. క‌ట్ చేస్తే.. ధూళిపాళ్ల న‌రేంద్ర అరెస్ట్‌. జైలుకు త‌ర‌లింపు. సంగం డెయిరీ ఆస్తులు స్వాధీనం. హైకోర్టు తీర్పుతో ఆస్తులు మ‌ళ్లీ సంగం డెయిరీకే సొంతం. ఇదీ జ‌రిగింది.    బెయిల్‌పై తిరిగొచ్చిన ధూళిపాళ్ల‌.. ఛైర్మ‌న్ హోదాలో విజయవాడలో జ‌రిగిన‌ సంగం డెయిరీ పాలకవర్గం సమావేశానికి హాజ‌ర‌య్యారు. సుదీర్ఘ విరామం త‌ర్వాత‌.. అతిపెద్ద రాజ‌కీయ హైడ్రామా త‌ర్వాత‌.. న‌రేంద్ర నేతృత్వంలో మీటింగ్ జ‌ర‌గ‌డం విశేషం. ఏ కుర్చీన‌యితే.. అత‌ని నుంచి లాక్కోవాల‌ని చూశారో.. ఇప్పుడు అదే సీటులో మ‌రోసారి ఆసీనులై.. అదే సంగం పాల‌క వ‌ర్గానికి ఛైర్మన్‌గా.. ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డం రాజ‌కీయంగా ఆస‌క్తిక‌రంగా మారింది. తాత్కాలికంగా త‌న‌ను ఇబ్బందిపెట్టినా.. తుది విజ‌యం త‌న‌దేనంటూ ధూళిపాళ్ల‌.. రాజ‌రాజ న‌రేంద్రుడిలా.. సంగం డెయిరీ ఛైర్మ‌న్‌గా.. సింహాస‌నం అధిష్టించ‌డం ఆయ‌న స‌త్తాకు నిద‌ర్శ‌నం.  సంగం డెయిరీ పూర్తిగా పాల ఉత్పత్తిదారుల ఆస్తి.. దీనికి పాలకవర్గం కేవలం విధాన నిర్ణేత మాత్రమేనని ధూళిపాళ్ల తెలిపారు. నరేంద్ర అధ్యక్షతన జరిగిన పాలకవర్గం సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జూన్ 1 నుంచి గేదె పాల సేకరణ.. కిలో వెన్నకు 715 రూపాయలు చెల్లించనుంది. 10 శాతం వెన్న శాతం ఉన్న గేదె పాలు లీటరుకు రూ.71.50 చెల్లించేందుకు పాలకవర్గంలో నిర్ణయం తీసుకున్నారు. పశు దాణా కోసం మొక్కజొన్నల ధర క్వింటాల్‌కు 1700 చెల్లించాలని తీర్మానం చేశారు. ఈ ఏడాదిలో 2 వేల టన్నుల మొక్కజొన్న కొనుగోలుకు సంగం డెయిరీ నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జిల్లాలో ఆవులలో పొదుగువాపు పథకం ప్రారంభించాలని, చిత్తూరు జిల్లా కుప్పం, నెల్లూరు జిల్లా వెంకటగిరిలో 5 వేల లీటర్ల బల్క్ కూలర్‌ను ప్రారంభించేందుకు డెయిరీ నిర్ణయం తీసుకుంది. ఛైర్మన్ ధూళిపాళ్ల న‌రేంద్ర‌కు సంఘీభావాన్ని తెలియజేస్తూ సంగం డెయిరీ ఏకగ్రీవ తీర్మానం చేయ‌డం విశేషం. సంగం డెయిరీపై ఆయ‌న‌కున్న అనుబంధానికి ఇది నిద‌ర్శ‌నం. 

మా నాన్నకు ప్రాణహాని! హైకోర్టుకు జడ్జీ రామకృష్ణ కొడుకు లేఖ 

దళిత జడ్జి రామకృష్ణ తనయుడు వంశీకృష్ణ ఆంధ్రప్రదేశ్  హైకోర్టుకు లేఖ రాశారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న తన తండ్రికి ప్రాణహాని ఉందని వంశీకృష్ణ లేఖలో తెలిపారు. తన తండ్రి ఉన్న బ్యారెక్‌లోకి అపరిచితుడిని పంపారని, ఆ అపరిచితుడు తన తండ్రిని బెదిరిస్తున్నాడని పేర్కొన్నారు. ఆ వ్యక్తిని, తన తండ్రిని వేర్వేరు బ్యారెక్‌లో ఉంచాలని వంశీకృష్ణ హైకోర్టును విజ్ఞప్తి చేశారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిపై  తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ జడ్జి రామకృష్ణను ఏప్రిల్ 15న మదనపల్లెలో పోలీసులు అరెస్ట్ చేశారు.  బీ కొత్తకోట నుంచి మదనపల్లెలో కరోనా టెస్ట్ కోసం వెళుతుండగా దారి మధ్యలో జడ్జి రామకృష్ణ పోలీసులు అదుపులోకి తీసుకొని పీలేరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఆయనను కోర్టులో హాజరు పర్చారు. కోర్టు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు.  తన అరెస్ట్ పై రామకృష్ణ స్పందిస్తూ...గతంలో  నంద్యాల ఉపఎన్నికల్లో ప్రతిపక్ష నాయకుడి హోదాలో జగన్ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును నడిరోడ్డుపై కాల్చి చంపాలని అన్నారని గుర్తుచేశారు. ఇప్పుడు తాను అదే విధంగా అన్నానని చెప్పారు. జగన్ అప్పటి ముఖ్యమంత్రిపై చేసిప వ్యాఖ్యలు తప్పుకానప్పుడు ఇప్పుడు తాను సీఎం జగన్‌ను అంటే దేశ ద్రోహం ఎలా అవుతుందని రామకృష్ణ  ప్రశ్నించారు. జడ్జి రామకృష్ణ వ్యవహారాన్ని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. మెజిస్ట్రేట్ రామకృష్ణ జీవితం ప్రమాదంలో ఉందని వర్ల రామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పెద్దిరెడ్డి మెజిస్ట్రేట్ రామకృష్ణపై దాడి చేయించారని ప్రతి ఒక్కరికీ తెలుసని అన్నారు. జైలులో ఉన్న రామకృష్ణకు ప్రాణహాని ఉందని తన కుమారుడు వంశీ ఆవేదన చెందుతున్నారని వర్ల రామయ్య అన్నారు. 

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. జూన్ 15 నుంచి డబ్బులు...

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు ముఖ్యమంత్రి కేసీఆర్. జూన్ 15 నుంచి రైతు బంధు నిధులు అందిస్తామన్నారు. జూన్ 15 నుంచి 25 వ తేదీ లోపల రైతుబంధు పంటసాయం కింద ప్రభుత్వం అందించే ఆర్ధిక సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయాలని సిఎం కెసిఆర్ ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. గత యాసంగిలో అవలంబించిన విధానాన్నే ఇప్పుడు కూడా అవలంబిస్తూ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని సిఎం ఆదేశించారు. ఇప్పటిదాకా ఇచ్చిన  కాటగిరీ ల వారిగానే  రైతు బంధు ఆర్ధిక సాయాన్ని ఖాతాలో వేయాలన్నారు.  జూన్ 10 వ తేదీని కటాఫ్ డేట్ గా పెట్టుకోని ఆ తేదీవరకు పార్ట్ బీ నుంచి పార్ట్ ఏ లోకి చేరిన భూములకు రైతు బంధు వర్తింప చేయాలని సిఎం కేసీఆర్ ఆదేశించారు.  దేశంలో తెలంగాణ రాష్ట్రం తప్ప ఎక్కడా రైతువద్దనుంచి వొక్కగింజకూడా కొంటలేరని చెప్పారు కేసీఆర్. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా కొన్ని ప్రతిపక్షాలు రైతుల వద్దకు పోయి ధర్నాలు చేయాలని కుయుక్తులకు పాల్పడుతున్నాయని విమర్శించారు. కానీ వాస్తవం తెలిసిన, విజ్జత కలిగిన రైతులు ప్రతిపక్షాల ఆటలు సాగనిస్తలేరన్నారు. గత సంవత్సరంలో కరోనా సమయంలో ఆర్ధిక వ్యవస్థ కుప్పుకూలితే తెలంగాణ జీఎస్డీపీకి వ్యవసాయ రంగం 17 శాతం ఆదాయన్ని అందచేసిందని చెప్పారు కేసీఆర్. ధాన్యం దిగుబడిలో  తెలంగాణ ది దేశంలోనే నెంబర్ వన్ స్థానం అన్నారు. వొక్క కారు మాత్రమే వరి పంట పండించే పంజాబ్ కన్నా తెలంగాణలో రెండు పంటల ద్వారా అధిక దిగుబడి వచ్చిందన్నారు. రాబోయే కాలంలో మెదక్, మహబూబ్ నగర్ తదితర జిల్లాల్లో  ఇంకా మరికొన్ని ప్రాజెక్టులను లిఫ్టులను పూర్తి చేసుకోబోతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ రంగం నూటికి నూరు శాతం స్థిరీకరించబడుతుందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి.  తెలంగాణలో పండుతున్న వరి ధాన్యం మొత్తాన్ని కొనాల్సిందిగా కేంద్రాన్ని కోరనున్నామని సిఎం కేసీఆర్ తెలిపారు. పంజాబ్ వంటి రాష్ట్రాల్లో నూటికి నూరు శాతం ధాన్యం సేకరిస్తున్న ఎఫ్ సీ ఐ.. తెలంగాణలో సేకరిచంక పోవడం పై సిఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం ఇట్లా వివక్ష చూపడం సరికాదన్నారు. ఈ మేరకు ప్రధానికి లేఖ రాయనున్నామన్నారు. ధాన్యాన్ని కొనడం ఎంత శ్రమో.. ధాన్యాన్ని సేకరించి స్టాకు చేయడం కూడా అంతే శ్రమతో కూడుకున్నదని సిఎం తెలిపారు. తెలంగాణ వచ్చిన కొత్తలో కేవలం 4 లక్షల టన్నుల ధాన్యాన్ని స్టాకు చేయడానికి మాత్రమే గోడౌన్ల లభ్యత వుండేదని, కానీ నేడు 25 లక్షల టన్నుల ధాన్యాన్ని నిల్వచేసుకునేందుకు గోడౌన్ల నిర్మాణం జరిగిందన్నారు. భవిష్యత్తులో మొత్తం 40 లక్షల టన్నుల సామర్థ్యనికి గోడౌన్ల నిర్మాణాలకు  ప్రతిపాదనలు మార్కెటింగ్ శాఖ  సిద్ధం చేసిందన్నారు.  వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో... విత్తనాల లభ్యత, ఎరువులు ఫెస్టిసైడ్ల లభ్యత, కల్తీ విత్తనాల నిర్మూలన అనే అంశం మీద సిఎం కెసిఆర్ చర్చించారు. నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులోకి తేవాలని సిఎం వ్యవసాయ శాఖ అదికారులను ఆదేశించారు. కల్తీ విత్తనాలమీద ఉక్కుపాదం మోపాలన్నారు. జిల్లాల వ్యాప్తంగా కల్తీ విత్తన తయారీదారులమీద దాడులు జరపాలని . కల్తీ విత్తనదారులను వలవేసి పట్టుకోవాలని, ఎంతటి వారినైనా పీడీ యాక్టుకింద అరెస్టు చేసి చట్టబపరమైన చర్యలు తీసుకోవాలని సిఎం  స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. చిత్తశుద్దితో పనిచేసి కల్తీ విత్తన విక్రయ ముఠాలను పట్టుకున్న వ్యవసాయ శాఖ, పోలీసు శాఖ, అధికారులను గుర్తించి వారికి ఆక్సిలరీ ప్రమోషన్, రాయితీల తో పాటు ప్రభుత్వం సేవా పతకం అందచేస్తుందని సిఎం స్పష్టం చేశారు. ఈ మేరకు తక్షణమే జిల్లాల వారిగా పోలీసులను రంగంలోకి దించాలని  డిజిపీ కి ఫోన్లో సిఎం ఆదేశించారు. నిఘావర్గాలు కల్తీ విత్తన తయారీదారుల మూఠాలను కనిపెట్టాలని ఇంటిలిజెన్స్ ఐజీని సిఎం ఆదేశించారు.

అనాథశ‌వాల‌కు అంతిమ గౌర‌వం.. ఎన్టీఆర్ ట్ర‌స్ట్‌ సాయం..

నారా భువ‌నేశ్వ‌రి. టీడీపీ అధినేత చంద్ర‌బాబు సతీమ‌ణి. భ‌ర్తే ఆమెకు స‌ర్వ‌స్వం. రాజ‌కీయం తెలీదు. త‌న వ్యాపార‌మేదో తాను చేసుకుంటూ ఉంటారు. చాలా అరుదుగా మాత్ర‌మే ప్ర‌జ‌ల ముందుకు వ‌స్తారు. ఏదైన విష‌యం త‌న‌ను తీవ్రంగా క‌లిచివేస్తే మాత్రం.. త‌ప్ప‌కుండా స్పందిస్తారు. గ‌తంలో అమ‌రావ‌తి రైతుల ఆక్రంద‌న ఆమెను క‌లిచివేసింది. రైతు దీక్షా శిబిరాన్ని సంద‌ర్శించి.. అమ‌రావ‌తి ఉద్య‌మానికి త‌న వంతు సాయంగా, అప్ప‌టిక‌ప్పుడు త‌న‌ చేతికి ఉన్న‌ బంగారు గాజులు తీసి విరాళంగా ఇచ్చారు. అమ‌రావ‌తి కోసం నేను సైత‌మంటూ ముందుకొచ్చారు.  తాజాగా, ఏపీలో క‌రోనా క‌ల్లోలంతో ప‌రిస్థితులు దారుణంగా త‌యార‌య్యాయి. టెస్టుల నుంచి ట్రీట్‌మెంట్ వ‌ర‌కూ.. ప్ర‌భుత్వం అన్ని విష‌యాల్లోనూ అట్ట‌ర్‌ఫ్లాప్ అయింది. క‌రోనాతో చ‌నిపోతే క‌నీసం అంత్య‌క్రియ‌లూ జ‌రిపించ‌లేని దుస్థితిలో ఉంది ప్ర‌భుత్వ యంత్రాంగం. అలాంటి ఉదంతాలు చూసి చంద్ర‌బాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి క‌ల‌త చెందారు. అనాథ శ‌వాల‌కు ఎన్టీఆర్ ట్ర‌స్ట్ ఆద్వ‌ర్యంలో అంత్య‌క్రియ‌లు చేస్తామ‌ని ఆమె ప్ర‌క‌టించారు.  క‌రోనా బారిన ప‌డి మృతిచెందిన వారిని కొన్ని చోట్ల‌ రోడ్ల ప‌క్క‌న వదిలేయ‌డంపై క‌ల‌త చెందామ‌ని నారా భువ‌నేశ్వ‌రి అన్నారు. కరోనా మృతుల కుటుంబీకులు ముందుకు రాక‌పోతే అంత్య‌క్రియ‌ల‌కు ఏర్పాట్లు చేస్తామ‌ని చెప్పారు. ఇందుకోసం ప్ర‌త్యేక వాహ‌నాల‌ను సిద్ధం చేసిన‌ట్లు వివ‌రించారు.   మ‌రోవైపు, ఎన్టీఆర్ ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో నాలుగు ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ల నిర్మాణానికి చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. రేపల్లె, పాలకొల్లు, టెక్కలి, కుప్పంలో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ తెలిపింది. ఇప్పటికే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందుబాటులో ఉన్నాయి. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా టెలీమెడిసిన్, మందుల పంపిణీ, అన్నదానం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.