ఈటల రాజేందర్ కు మరో షాక్! గులాబీ బాస్ స్కెచ్ మాములుగా లేదుగా..
posted on Jun 1, 2021 @ 3:38PM
సీనియర్ నేత ఈటల రాజేందర్ వ్యవహారంలో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. కేసీఆర్ మంత్రివర్గం నుంచి రాజేందర్ ను బర్తరఫ్ చేసిన తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తన అనుచరులు, నియోజకవర్గ నేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు ఈటల. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ టార్గెట్ గా ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో గులాబీ పార్టీతో తాడోపేడో తేల్చుకుంటారనే ప్రచారం జరిగింది. కాని రాజీనామాపై వెనక్కి తగ్గారు ఈటల. బీసీ సంఘాలు, ఉద్యమ నేతలను కలవడంతో కొత్త పార్టీ పెడతారని భావించారు. టీజేఎస్ అధినేత కోదండరామ్ తో కలిసి కేసీఆర్ కు వ్యతిరేకంగా ఐక్య వేదికగా ఏర్పాటు చేస్తారని భావించారు. కాని అది కూడా జరగలేదు. చివరికి అనూహ్యంగా కమలం గూటికి చేరారు ఈటల రాజేందర్. ఢిల్లీకి వెళ్లి కమలం బీజేపీ పెద్దలను కలిశారు.
ఈటల రాజేందర్ కదలికలపై నిఘా పెట్టిన టీఆర్ఎస్ అధిష్టానం ఎప్పటికప్పుడు కౌంటర్ వ్యూహాలు అమలు చేసింది. హుజురాబాద్ నియోజకవర్గంలోని గులాబీ లీడర్లంతా పార్టీలోనే కొనసాగేలా ప్రయత్నాలు చేసింది. మంత్రి గంగుల కమలాకర్ ను రంగంలోకి దింపింది. మంత్రి హరీష్ రావును కూడా పురమాయించింది. బోయినపల్లి వినోద్ కుమార్ కుడా సీన్ లోకి వచ్చారు. కేసీఆర్ ఎత్తులతో తన సొంత నియోజకవర్గంలోనే ఈటలకు ఇబ్బందికర పరిస్థితులు కల్పించారు. మొదట ఈటలకు మద్దతుగా నిలిచిన నేతలు కూడా ఒక్కొక్కరు తిరిగి టీఆర్ఎస్ సైడ్ కు వచ్చేశారు. దీంతో తన అనుచరులను బెదిరిస్తున్నారంటూ రాజేందర్ ఆరోపణలు చేశారు. తాజాగా ఢిల్లీలో రాజేందర్ కదలికలపైనా గులాబీ ఫోకస్ చేశారని తెలుస్తోంది. రాజేందర్ ఢిల్లీ నుంచి వచ్చి ప్రకటన చేసేలోగా ఆయనకు మరో షాకిచ్చేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారని సమాచారం.
ఢిల్లీలో బీజేపీ నేతలను కలిసిన రాజేందర్ ను టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయనున్నారని తెలుస్తోంది. అంతేకాదు రాజేందర్ ఎమ్మెల్యే పదవికి ఎర్త్ పట్టారని సమాచారం. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్ కు టీఆర్ఎస్ ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ పూర్తైందంటున్నారు. టీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన వెంటనే ఈటలపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది. తనంతట తానుగా ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేసేలోగానే అనర్హత వేటు పడేలా అధికార పార్టీ పావులు కదుపుతుందని తెలుస్తోంది. ఈటలకు మద్దతుగా ఉన్న నేతలను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని సమాచారం.
ఈటల రాజేందర్ ఎపిసోడ్ పై మాట్లాడిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా అదే సంకేతమిచ్చారు. బీజేపీ నాయకులను ఈటల రాజేందర్ కలవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 ఏళ్లుగా కేసీఆర్ ఎందరో నాయకులను తయారు చేశారని చెప్పారు. ఇప్పుడు ఈటల రాజేందర్ కమ్యూనిజం ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. బీజేపీ నాయకుల దగ్గర తాకట్టు పెట్టారా? అని పల్లా వ్యాఖ్యానించారు. అందరూ ఈటలను ఛీ కొడుతున్నారని వ్యాఖ్యానించారు. మంత్రిగా చట్ట విరుద్ధ పనులు ఎలా చేశారని రాజేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.
‘‘అసైన్డ్ భూములు ఎలా తీసుకున్నావు. నీ ఆత్మగౌరవం ఎక్కడ ఉంది. నిన్ను గౌరవించినట్లు సీఎం కేసీఆర్ ఇంకెవరినీ గౌరవించలేదు. ఎక్కువ పదవులు మీరే అనుభవించారు. పదవి లేకుండా ఎప్పుడు ఉన్నావు. సొంత ప్రభుత్వ పథకాలను అవహేళన చేశావు. పార్టీ మీద, నాయకుడి మీద నమ్మకం లేదని క్షమించరాని నేరం చేశావు. మీరు చేసిన దానికి పార్టీపరంగా తప్పక చర్యలు తీసుకుంటాం. సమయం చూసి అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారు. నీ సమాధి నువ్వే కట్టుకున్నావు ఈటల రాజేందర్.’’ అని పల్లా రాజేశ్వర్ రెడ్డి హెచ్చరించారు.