ఒక కేసీఆర్.. ఒక జగన్.. ఒక ఈటల.. ఒక మంచి ఛాన్స్ మిస్?
posted on Jun 1, 2021 @ 1:43PM
అష్టలక్ష్మిల్లోకి ధైర్యలక్ష్మినే ముఖ్యమంటారు. ధైర్యమున్నవాడే విజేత. తాత్కాలిక ప్రయోజనాల కోసం రాజీ పడితే... శాశ్వత అధికారానికి దూరమవుతారు. ఆనాడు.. కేసీఆర్, జగన్‌రెడ్డిలు ధైర్యాన్నే నమ్ముకున్నారు. నేడు ముఖ్యమంత్రులుగా అధికారం చెలాయిస్తున్నారు. ఈటల రాజేందర్ మాత్రం అలా చేయలేకపోయారు. సొంతపార్టీ పెట్టి, కేసీఆర్ వ్యతిరేక శక్తులను క్రూడీకరించి.. ముఖ్యమంత్రి పీఠం దిశగా అడుగులు వేయగల అన్నిరకాల సామర్థ్యాలు ఉన్నా కూడా.. ధైర్యం మాత్రం చేయలేకపోయారు. కేసుల భయం వెంటాడినట్టుంది. తాత్కాలిక ప్రయోజనాల కోసం.. శాశ్వత అవకాశాన్ని చేజేతులారా కాలదన్నుకున్నారు. చరిత్రలో నిలవగల సత్తా ఉన్న నేత అయి ఉండి కూడా.. చరిత్ర నుంచి ఆయన సరైన పాఠాలు నేర్వనట్టున్నారు.
అది 2001, ఏప్రిల్ 27.. హైదరాబాద్ జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం. ఆ సమయంలో ప్రత్యేక తెలంగాణ కోసం పార్టీ పెట్టడమంటే సాహసమే. అది కేసీఆర్‌కు మాత్రమే సాధ్యమైంది. అంతకుముందు, చంద్రబాబు కేబినెట్‌లో చోటు కోసం కేసీఆర్ గట్టిగానే ప్రయత్నించారు. ఈక్వేషన్స్ కుదరక.. మంత్రి పదవి దక్కలేదు. డిప్యూటీ స్పీకర్‌తో సంతృప్తి చెందని కేసీఆర్.. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం లేవనెత్తారు. స్వపరిపాలన ప్రస్తావనే వినిపించని రోజుల్లోనే.. తెలంగాణ కోసం సొంతపార్టీతో ఉద్యమాన్ని ఉరకలెత్తించారు.
చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి లాంటి బలమైన పాలకులతో బలంగా పోరాడారు. ఒకటి, రెండు కాదు.. ఏకంగా 15 ఏళ్ల పాటు ఓపిగ్గా ఎదురుచూశారు. ఆ ధైర్యమే ఆయన్ను విజయతీరాలకు చేర్చింది. ఏడేళ్లుగా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. ఈటల రాజేందర్ మాత్రం బలమైన కేసీఆర్‌తో పోరాడే ధైర్యం చేయలేక.. సొంతపార్టీ పెట్టేందుకు వెనకడుగు వేశారని అంటున్నారు. పట్టుమని పది రోజులు కూడా నిలబడలేకపోయారు. కేసులతో ఉక్కిరిబిక్కిరి అయి.. బెదిరి.. బేజారై.. బీజేపీ అనే రక్షణ చట్రం కింద చేరిపోయారు.
ఒక్క కేసీఆర్ అనే కాదు.. ధైర్యాన్ని నమ్ముకొని.. తెగువ ప్రదర్శించి.. ఓపిగ్గా రాజకీయం నెరిపిన.. ఏ ఒక్క నాయకుడూ.. ఓడిపోయినట్టు చరిత్రలోనే లేదు. వైఎస్ జగన్‌రెడ్డి ఉదంతం అందుకు మరో బెస్ట్ ఎగ్జాంపుల్. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాత.. తానే సీఎం కావాలని పట్టుబట్టారు జగన్మోహన్‌రెడ్డి. తండ్రి శవం సాక్షిగా సంతకాల సేకరణ చేశారని అంటారు. జగన్ సీఎం కావాలనే కాంక్షను.. కాంగ్రెస్ హైకమాండ్ మొగ్గలోనే తుంచేసింది. పార్టీలో అలా పడుండు.. సమయం వచ్చినప్పుడు చూద్దాంలే అన్నట్టు మాట్లాడింది.
కాంగ్రెస్ అధిష్టానంతో విభేదించారు జగన్‌రెడ్డి. అప్పుడు ఆయన ముందు రెండు దారులు కనిపించాయి. అందులో..
ఆప్షన్ 1-- అధిష్టానం మాట విని.. రాజకీయంగా రాజీపడితే.. ఏ ఎంపీ పదవో, మంత్రి పదవో వస్తుంది. ఎంచక్కా ఎప్పటిలానే వ్యాపారాలు చేసుకోవచ్చు. వేల కోట్లు కూడబెట్టుకోవచ్చు. బెంగళూరు ప్యాలెస్‌లో దర్జాగా జీవితం గడిపేయవచ్చు.
ఆప్షన్ 2-- తన లక్ష్యమైన ముఖ్యమంత్రి పీఠాన్ని సాధించుకోవడం కోసం రాజకీయ, ఆర్థిక భవిష్యత్తును పణంగా పెట్టి.. కేసులు, ఇబ్బందులు ఎదుర్కోవడానికి సిద్ధం కావటం.
స్వతహాగా మొండిఘటమైన జగన్.. రెండో ఆప్షన్‌నే ఎంచుకున్నారు. అక్రమాస్తుల కేసుల్లో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అయినా.. రెండేళ్లు జైల్లో మగ్గినా.. దాదాపు తొమ్మిది ఏళ్లు అన్నిరకాల కష్టనష్టాలను భరిస్తూ.. ఓపిగ్గా పోరాడుతూ వచ్చారు. అంతిమంగా తన స్వప్నం సాకారం చేసుకున్నారు. ముఖ్యమంత్రి సింహాసనంపై రెండేళ్లుగా పెత్తనం చెలాయిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో కంటి ముందు కనిపిస్తున్న ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల ఉదంతాన్ని ఈటల రాజేందర్ అవగాహన చేసుకోలేకపోయారని అంటున్నారు. పోరాడితే పోయేదేమీ లేదు- బానిస సంకెళ్లు తెగి ముఖ్యమంత్రి కావడం మినహా.. అని గుర్తించలేకపోయారు. చాలామంది రాజకీయ నాయకులు ఇలానే చేస్తుంటారు. బడా వ్యాపారాలు ఉన్న వారైతే మరీ భయపడిపోతుంటారు. ఎన్నికల్లో ఓడిన వెంటనే అధికార పార్టీలోకి చేరిపోతుంటారు. తమ ఆర్థిక ప్రయోజనాల కోసం కాంప్రమైజ్ అవుతుంటారు. ఆ క్రమంలో రాజకీయ భవిష్యత్తును నాశనం చేసుకుంటుంటారు. ఈటల రాజేందర్ సైతం అలానే రాజీ పడ్డారనేది విశ్లేషకుల మాట.
ఈటలది సుదీర్ఘ ఉద్యమ, రాజకీయ చరిత్ర. బెదిరింపులకు భయపడే మనిషి కాదు. ఆనాడు వైఎస్ విసిరిన వలకు చిక్కకుండా.. ఉద్యమాన్నే నమ్ముకొని ఉన్న నిఖార్సైన నాయకుడు. ఆర్థిక బలమూ మెండు. సామాజిక అండా దండా పుష్కలం. కానీ, ఆయనలో కొరవడింది విసుమెత్తు ధైర్యం. కేసీఆర్‌ను సొంతంగా ఢీకొట్టే ధైర్యం లేకనే ఆయన జాతీయ పార్టీలో చేరి గుంపులో గోవిందలా మిగిలేందుకు సిద్ధమయ్యారు. గడీల పాలనకు గండికొట్టేలా.. దొరకు వ్యతిరేకంగా.. తెలంగాణ ఉద్యమం మాదిరి.. రాజకీయ శక్తుల పునరేకీకరణకు ప్రయత్నం చేసే సాహసం చేయలేకపోయారు. కోదండరాం సారు, కొండా విశ్వేశ్వరరెడ్డిలాంటి వాళ్లు ఎంతగా ధైర్యం నింపినా.. సొంతపార్టీతో కేసీఆర్‌కు సవాల్ విసరలేకపోయారు.
ఈటల గట్టిగా పోరాడి ఉంటే.. ఓపిగ్గా రాజకీయం చేయగలిగి ఉంటే.. ఆయన సైతం కేసీఆర్‌లా, జగన్‌రెడ్డిలా.. ఏనాటికైనా ముఖ్యమంత్రి కాగల అర్హత, సామర్థ్యం ఉన్నవాడే. కానీ, కేసీఆర్ దాడి నుంచి తన ఆర్థిక సామ్రాజ్యాన్ని తాత్కాలికంగా కాపాడుకోవటానికి.. సొంతపార్టీ విషయంలో కాంప్రమైజ్ అయ్యారని అంటున్నారు. ముఖ్యమంత్రి అయ్యే శాశ్వత రాజకీయ అవకాశాన్ని పోగొట్టుకున్నారని చెబుతున్నారు. కేసీఆర్, జగన్‌రెడ్డిలా చిత్తశుద్ధి, పట్టుదల, ధైర్యం లేకనో.. లేక, దేవేందర్‌గౌడ్, ఆలె నరేంద్ర, విజయశాంతి, చిరంజీవి లాంటి వాళ్లను చూసి.. సొంతపార్టీ పెడితే చరిత్రలో కలిసిపోతాననే భయమో.. కారణం ఏదైనా కానీ.. కేసీఆర్‌పై సింగిల్‌గా పోరాడకుండా.. చేతులెత్తేసి.. మరోపార్టీలో చేరిపోయి.. చరిత్ర సృష్టించే అవకాశాన్ని కోల్పోయారని విశ్లేషిస్తున్నారు. ఒక కేసీఆర్.. ఒక జగన్.. ఒక ఈటల రాజేందర్.. అనేలా ఆ ఇద్దరి సరసన నిలబడలేకపోయారు. ఈటల ముఖ్యమంత్రి అయితే.. అది కేవలం ఆయనకే కాదు.. బీసీలకు రాజ్యాధికారం సాధించిన వాడిగా చరిత్రలో నిలిచిపోతాడు. అందుకే అంటారు.. ధైర్యే సాహసే లక్ష్మి.