ఆనందయ్య మందు పంపిణికి డేట్ ఫిక్స్!
posted on Jun 1, 2021 @ 3:30PM
కృష్ణపట్నం ఆనందయ్య యాదవ్ ఆయుర్వేద మందుకు అనుమతి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు హైకోర్టు మందు పంపిణికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఆనందయ్య మందుకు అడ్డంకులు తొలగిపోవడంతో జనాలంతా సంతోషపడ్డారు. మందు ఎప్పుడిస్తారా అంటూ ఎదురుచూస్తున్నారు. మందు పంపిణికి అనుమతి వచ్చిందని తెలియగానే వందలాది మంది కృష్ణపట్నం బాట పట్టారు. అయితే మందు పంపిణిపై మాత్రం క్లారిటీ రావడం లేదు. ప్రస్తుతానికి మందు అందుబాటులో లేదని తెలుస్తోంది. వన మూలికలు సేకరించి మందును తయారు చేశాకే పంపిణి చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఆనందయ్య మందు పంపిణిపై ప్రభుత్వం దృష్టి సారించింది. సోమవారం కృష్ణపట్నం వెళ్లి ఆనందయ్య ఇంటిని, మందు తయారయ్యే ప్రాంతాన్ని పరిశీలించారు నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్. మంగళవారం కలెక్టరేట్ లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఆనందయ్య కూడా ఈ సమావేశానికి వచ్చారు. ఈ సందర్బంగా మందు తయారీ, పంపిణి, కొవిడ్ మార్గదర్శకాలు ప్రకారం పంపిణీకి ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు. మందు తయారు కాగానే.. కొవిడ్ రూల్స్ పాటిస్తూ పంపిణి చేయాలని నిర్ణయించారట. ఇందుకోసం ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేస్తుందని కలెక్టర్ క్లారిటీ ఇచ్చారు. రెండు, మూడు రోజుల్లోనే మందు పంపిణి ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఆనందయ్య మందుకు ప్రజల్లో విపరీతమైన డిమాండ్ ఉన్న కారణంగా అందరికి మందు అందుబాటులోకి తేవాలంటే పెద్ద ఎత్తున తయారు చేయాల్సి ఉంటుంది. మూలికలు, ఆకులు అడవుల్లో లభించినా.. తేనె, మిరియాలు తదితరాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆనందయ్య ఒక్కరే వీటిని సమీకరించుకోవడం, ఆర్థికంగా సాధ్యం కాకపోవచ్చు. ప్రభుత్వమే వనరులను సమీకరించి ఆనందయ్యకు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. మందు పంపిణీకి అధికార యంత్రాంగం విశాలంగా ఉన్న ప్రదేశాన్ని ఎంపిక చేయడం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆనందయ్య మందుకు ప్రజల్లో ఆదరణ, డిమాండ్ ఉండటంతో భారీ సంఖ్యలో వచ్చే అవకాశముంది. తొక్కిసలాట జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది
మందు తయారీ కోసం వనమూలికల సేకరణలో ఆనందయ్య టీమ్ పని చేస్తోంది. వీలైనంత త్వరలో కొవిడ్ మందుల పంపిణీ ప్రారంభిస్తానని, ఇప్పుడే కృష్ణపట్నం రావద్దని ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య చెప్పారు. మందుల తయారీకి కావాల్సిన మూలికలు సిద్ధం చేసుకోవాల్సి ఉందని తెలిపారు. సాధ్యమైనంత వరకు దేశవ్యాప్తంగా ప్రజలకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కృష్ణపట్నంలోనే కాకుండా వివిధ ప్రాంతాల్లో మందుల పంపిణీకి సన్నాహాలు చేస్తున్నట్లు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ప్రత్యేకంగా ఒక యాప్ తయారు చేసే విషయాన్ని ఆలోచిస్తున్నామన్నారు. దూర ప్రాంతాల వారు కృష్ణపట్నం రావాల్సిన అవసరం లేకుండా యాప్‌లో బుక్ చేసుకుంటే కొరియర్ సర్వీస్ ద్వారా మందు పంపాలని యోచిస్తున్నామని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ అనుమతి పొందిన ఆనందయ్య మందు పంపిణీ తేదీని త్వరలో ప్రకటిస్తామని ఆయుష్ కమిషనర్ రాములు చెప్పారు. ఆ మందును ఆయుర్వేదంగా గుర్తించడం లేదని, సంప్రదాయ మందుగా పంపిణీ చేసుకోవచ్చని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. కరోనా సోకిన వారు డాక్టర్లు ఇచ్చే మందులు వాడుతూనే ఆనందయ్య మందులు తీసుకోవాలని రాములు సూచించారు. పంపిణీ సందర్భంగా పాజిటివ్ బాధితులు క్యూలో నిలబడకూడని తెలిపారు. వారు తమకు తెలిసిన వారితో మందు తెప్పించుకోవాలని సూచించారు.
మరోవైపు ఆనందయ్య మందు వ్యవహారంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కృషి అభినందనీయమని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆనందయ్య మందు ఆగిపోడానికి వైసీపీ ఎమ్మెల్యేనే కారణమని ఆరోపించారు. ఎంతమంది పేదలు ఉచితంగా ఇచ్చే మందును కోల్పోయారని అన్నారు. హైకోర్టు ఆదేశాలతో ఆనందయ్య మందుకు విముక్తి కలిగిందన్నారు. చేసేందంతా చేసి ఇప్పుడు సన్మానాలు చేసుకోవడం సిగ్గుచేటని సోమిరెడ్డి విమర్శించారు