కేటీఆర్ వర్సెస్ సోనూసూద్.. ఎవరు సుపర్‌హీరో?
posted on Jun 1, 2021 @ 2:46PM
కరోనా కాలంలో ఎవరు, ఏ చిన్న సాయం చేసినా అతన్ని సూపర్‌హీరోగానే చూస్తున్నారు. అలాంటిది లెక్కలేనన్ని.. చెప్పుకోలేనన్ని.. సాయాలు చేస్తూ.. ప్రజల పాలిటి రియల్ సూపర్‌హీరోగా నిలుస్తున్నారు సోనూసూద్. వలస కూలీల నుంచి క్రికెట్ స్టార్స్ వరకూ.. అనేక మందికి సోనూసూదే సూపర్‌హీరో. లాక్‌డౌన్‌లో కూలీలను బస్సులు, ప్రత్యేక విమానాల్లో గమ్య స్థానాలకు చేర్చిన ఘనత ఆయనది. అందుకే, హాస్పిటల్‌లో బెడ్ కావాలన్నా.. రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు కావాలన్నా.. ఆక్సిజన్ సిలిండర్లు కావాలన్నా.. సోనూసూద్‌నే ఆశ్రయిస్తున్నారు జనాలు. అందుకే, కేవలం ప్రజలే కాదు పాలకులు సైతం సోనూసూద్‌ను సూపర్‌హీరోగా కీర్తిస్తున్నారు. తాజాగా, మంత్రి కేటీఆర్ సోనూసూద్‌ను సూపర్‌హీరో అంటూ ట్వీట్ చేయడం.. సోనూ సైతం కేటీఆర్‌ను పొగడటం సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది.
ఇటీవల తెలంగాణకు చెందిన ఒక కరోనా బాధితుడు తనకు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయాయని.. అర్జెంటుగా ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ అందించగలరా? అంటూ మంత్రి కేటీఆర్‌కు ట్విటర్‌లో రిక్వెస్ట్ పెట్టాడు. ఆ బాధితుడి ట్వీట్‌కు స్పందించిన కేటీఆర్ ఆయనకు ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ అందేలా చేశారు. దీంతో.. ఆ కరోనా బాధితుడు తిరిగి ట్విట్టర్‌లోనే కేటీఆర్‌కు కృతజ్ఞత చెప్పాడు. "కేవలం పది గంటల్లోనే తాము కోరిన ఆక్సిజన్ కాన్సెంట్రేటర్‌ను అందించినందుకు ధన్యవాదాలు కేటీఆర్ సార్. కరోనా కష్టకాలంలో ఇప్పటి వరకూ మీరెంతోమంది తెలంగాణ ప్రజలకి సాయం చేశారు. మీరందించిన సహాయాన్ని మేము ఎప్పటికీ మరచిపోలేము. మీరు రియల్ సూపర్హీరో" అంటూ అతను కేటీఆర్ కు మెసేజ్ పెట్టాడు.
అతని ట్వీట్‌కు కేటీఆర్ స్పందించారు. "బ్రదర్.. నేను మీచే ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధిని. నావంతు బాధ్యత మాత్రమే చేస్తున్నా.. మీరు చెప్పిన సూపర్ హీరో కచ్చితంగా సోనుసూద్." అంటూ అతని ట్వీట్‌కు బదులిచ్చారు కేటీఆర్. ఆ ట్వీట్‌కు సోనూసూద్‌ని కూడా ట్యాగ్ చేశారు. ఆ తర్వాత.. కేటీఆర్ ట్వీట్‌పై సోనూసూద్ కూడా స్పందించారు.
"మీ ప్రేమ పూరిత మాటలకు చాలా ధన్యవాదాలు సార్! కానీ మీరు నిజంగా తెలంగాణ కోసం ఎంతో చేసిన హీరో. మీ నాయకత్వంలో రాష్ట్రం చాలా అభివృద్ధి చెందింది. నేను తెలంగాణను నా రెండో ఇంటిగా.. నా వర్క్ స్టేషన్ గా భావిస్తున్నాను. ఎన్నో ఏళ్లుగా తెలంగాణ ప్రజలు నాపై చాలా ప్రేమను చూపించారు." అంటూ సోనూసూద్ కేటీఆర్‌కు రిప్లై ఇచ్చారు.
సోనూసూద్ రిప్లైకి కూడా కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ‘చాలా ధన్యవాదాలు బ్రదర్.. లక్షలాది మందికి స్పూర్తినిస్తూ మీరు ప్రారంభించిన గొప్ప పనిని కొనసాగించండి’.. అంటూ కేటీఆర్ అన్నారు.
ఇలా కేటీఆర్, సోనూసూద్‌ల మధ్య జరిగిన ట్వీట్స్ సంభాషణపై అనేక కామెంట్లు, రీట్వీట్‌లు వస్తున్నాయి. సోషల్ మీడియాలో వీరి సంభాషణ వైరల్‌గా మారింది.