ఎంపీ రేవంత్ రెడ్డికి బిగ్ షాక్! టీపీసీసీ పదవికి గండమేనా..
posted on Jun 1, 2021 @ 5:06PM
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ,మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. ఓటుకు నోటు కేసు ఏసీబీ పరిధిలోకి రాదని.. రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. కేసు ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుందని రేవంత్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. గతంలో ఏసీబీ కోర్టు కొట్టివేయడంతో హైకోర్టును ఆశ్రయించారు రేవంత్. అయితే ఇక్కడ కూడా అదే రిపీట్ అయ్యింది.
ఇటీవలే ఈ కేసులో ఏసీబీ కోర్టులో ఈడీ చార్జీషీట్ దాఖలు చేసింది. ఎంపీ రేవంత్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా పేర్కొంది. ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రేవంత్‌రెడ్డి 50 లక్షలు ఇచ్చినట్టు చార్జ్‌షీట్‌లో రాశారు. తెలంగాణ శాసన మండలి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసే విధంగా.. ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రాయబారం నడిపినట్టుగా రేవంత్‌రెడ్డిపై చార్జ్‌షీట్‌లో అభియోగాలు మోపారు. ఛార్జీషీట్‌లో రేవంత్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి, అతని కుమారుడు వేం కృష్ణ, కీర్తన రెడ్డి, సెబాస్టియన్‌ల పేర్లను పొందుపరిచారు. ఈడీ చార్జ్ షీట్ లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేరు లేకపోవడంతో ఆయనకు రిలీఫ్ దక్కింది.
ఈడీ చార్జీషీట్ వేసిన మరుసటి రోజే ఎంపీ రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట కలిగింది. ఓటుకు నోటులో మిగిలిన సాక్షలందరి చీఫ్ ఎగ్జామినేషన్ పూర్తయిన తరువాతనే క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని సుప్రీం కోర్టులో రేవంత్ రెడ్డి పిటిషన్ వేశారు. ఈ కేసులో తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు సాక్షులను క్రాస్ ఎగ్జామినేషన్ చేయవద్దని ఏసీబీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏసీబీకి నోటీసులు జారీ చేసింది. దీనిపై నాలుగు వారాలలో సమాధానం చెప్పాలని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.
2015 మే 21న స్టీఫెన్ సన్‌కు 50 లక్షల రూపాయలు లంచం ఇస్తూ రెడ్ హ్యాండెడ్‌గా రేవంత్ రెడ్డి పట్టుపడ్డారు. అప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగ్గా… టీడీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్న వేం నరేందర్ రెడ్డికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేసేందుకు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రలోభాలకు గురిచేశారన్నది రేవంత్ రెడ్డి తదితరులపై ఉన్న ప్రధాన అభియోగం. అప్పట్లో వీడియో ఆధారాలు బట్టబయలు కాగా, రేవంత్ రెడ్డి కొంతకాలం జైలులో కూడా ఉన్నారు. బెయిల్ పై బయటికి వచ్చిన ఆయన టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరారు.
ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు రేవంత్ రెడ్డి. త్వరలోనే ఆయనకు పీసీసీ పగ్గాలు వస్తాయనే ప్రచారం జరుగుతోంది. రేవంత్ రెడ్డి పేరును కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసిందని.. రెండు,మూడు రోజుల్లోనే అధికారిక ప్రకటన వస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓటుకు నోటు కేసులో ఈడీ చార్జీషీట్ దాఖలు చేయడం కాక రేపుతోంది. రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు రాకుండా కుట్రలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.