సీఎం జగన్‌కు క్రికెటర్ లేఖ.. కూల్చివేతపై ఆందోళన..
posted on Jun 7, 2021 @ 7:58PM
విశాఖలో కూల్చివేతల పరంపర కాక రేపుతోంది. సీఎం జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ బుల్డోజర్ల దూకుడుతో సాగర తీరం షేక్ అవుతోంది. ఇన్నాళ్లూ టీడీపీ నాయకుల ఆస్తులే లక్ష్యంగా కూల్చివేతలు కొనసాగాయి. మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటి ప్రహారీ, గీతం వర్సిటీ కట్టడాలు, టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు బిల్డింగ్.. ఇలా వరుసబెట్టి ఆస్తుల ధ్వంసంతో విశాఖ అట్టుడికింది. అదంతా రాజకీయ ప్రతీకారమంటూ నగరం హోరెత్తింది. అయితే, అంతటితో ఆగలేదు విధ్వంసకాండ. ఆ తర్వాత భీమిలీ రోడ్డులో అక్రమణల పేరుతో షాపుల తొలగింపు మరింత కలకలం రేపింది. తాజాగా, ఏకంగా మానసిక దివ్యాంగుల పాఠశాల కూల్చివేత జగన్‌రెడ్డి పైశాచిక ఆనందానికి నిదర్శనమంటూ ప్రతిపక్షంతో పాటు ఈసారి సామాన్యులూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ పాఠశాలను కబ్జా చేసేందుకు వైసీపీ బ్యాచ్ ప్రయత్నం చేసిందని.. అది కుదరకపోవడంతో జీవీఎమ్‌సీని ముందుంచి కూల్చివేతలకు తెగబడిందంటూ టీడీపీ విమర్శలు చేస్తోంది. దివ్యాంగులంటే ఎవరికైనా సానుభూతి ఉంటుంది. కానీ, ఆ మాత్రం మానవత్వం కూడా లేకుండా వారి పాఠశాలను కూల్చివేయడం దారుణమంటూ విశాఖ వాసులు మండిపడుతున్నారు.
మరోవైపు, మానసిక దివ్యాంగుల పాఠశాల కూల్చివేతపై మాజీ క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించారు. హిడెన్ స్ప్రౌట్స్ మానసిక దివ్యాంగుల పాఠశాల నలుగురు విద్యార్థులతో 2013లో ప్రారంభమైందని.. ప్రస్తుతం 150కి పైగా విద్యార్థులకు జ్ఞానాలయంగా మారిందని తెలిపారు. పాఠశాల నెలకొల్పిన శ్రీనివాస్ జీవితమంతా స్కూల్‌కే అంకితం చేశారని ఎమ్మెస్కే ప్రసాద్ గుర్తుచేశారు. అందుకే శ్రీనివాస్‌కు జ్యువెల్ ఆఫ్ ఇండియా అనే అవార్డు వచ్చిందన్నారు. దీనిపై సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి పునరాలోచించాలని కోరుతూ ఎమ్మెస్కే ప్రసాద్ లేఖ రాయడంతో వివాదం మరింత ముదురుతోంది. జీవీఎమ్‌సీ అధికారులు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చూడాలన్నారు. ఆ పాఠశాల తిరిగి ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టాలని సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేశారు మాజీ క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్.