మందు ఆనందయ్యది.. సోకు వైసీపీ నేతలది! ఇదేం విడ్డూరం..
posted on Jun 7, 2021 @ 7:29PM
సొమ్మెకడిది.. సోకొకడిది.. ఇది పూర్వకాలం నుంచి ఉన్న సామెత. ఒకడి కష్టాన్ని ఇంకొకడు తింటుంటే.. ఒకడికి దక్కాల్సిన భాగ్యాన్ని మరొకడికి అనుభవిస్తుంటే ఈ సామెతను వాడుతుంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతల తీరు అచ్చం ఇలానే ఉంది. ఆనందయ్య మందు విషయంలో అధికార పార్టీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ.. ఆనందయ్యకు దక్కల్సిన క్రెడిట్ ను కొట్టేయాలని చూస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఎన్నో వివాదాలు.. అనుమానాలు.. కోర్టు కేసుల మధ్య ఆనందయ్య మందు పంపిణికి అనుమతి వచ్చింది. జనాలు అశగా ఎదురుచూస్తున్న మందు పంపిణీ ప్రారంభమైంది. నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి నియోజకవర్గంలోనూ, చిత్తూరు జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గంలోనూ పంపిణీ జరుగుతోంది. సర్వేపల్లి వద్ద ఆనందయ్యే స్వయంగా మందు తయారుచేస్తుండగా, చంద్రగిరిలో ఆయన తనయుడు, శిష్యులు మందు తయారుచేస్తున్నారు. అయితే ఇక్కడే మరో వివాదం మొదలైంది.మందు పంపిణి వరకే బాగానే ఉన్నా... ప్రజలకు మందు అందిస్తున్న కవర్లపై వైసీపీ రంగులు, సీఎం జగన్ ఫోటోలు ఉండటం రచ్చగా మారుతోంది.
చంద్రగిరిలో పంపిణీ చేస్తున్న ఆనందయ్య మందు డబ్బాలపై వైఎస్ రాజశేఖర్ రెడ్డి, సీఎం జగన్, వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫొటోలు దర్శనమిస్తున్నాయి. మందు సృష్టికర్త ఆనందయ్య పేరు తప్ప ఆయన ఫొటో మాత్రం లేదు. మందు డబ్బాలను చూసిన జనాలు కూడా షాకవుతున్నారు. ఆనందయ్య ఫోటో లేకుండా సీఎం జగన్ , ఎమ్మెల్యే చెవిరెడ్డి ఫోటోలు ఉండటం ఏంటని ముక్కున వేలేసుకుంటున్నారు. సొమ్మెక్కడి.. సొకొకడిది అన్నట్లుగా వైసీపీ నేతలు వ్యవహారం ఉందని కొందరు విమర్శిస్తున్నారు.
ఆనందయ్య మందు కవర్లపై వైసీపీ రంగులు ఉండటంపై టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రంగా స్పందించారు. అసలు... ఆనందయ్య మందుకు రాజశేఖర్ రెడ్డి, జగన్ ఫొటోలకు, వైసీపీకి ఏమిటి సంబంధం? అని ప్రశ్నించారు.ఒక ముఖ్యమంత్రిగా మందుకు కావాల్సిన వనరులను సమకూర్చడంలో తప్పులేదని, అయితే ఆనందయ్య మందును తామే సొమ్ము చేసుకోవాలన్న దుర్బుద్ధి ఇందులో కనిపిస్తోందని గోరంట్ల అభిప్రాయపడ్డారు. "అంతేలే... కోడికత్తిలో కోడి లేదు, గుండెపోటుకి బాబాయ్ లేడు, ఆనందయ్య మందులో ఆనందయ్య లేడు!" అంటూ గోరంట్ల సెటైర్ వేశారు.
ఇక సర్వేపల్లి నియోజకవర్గంలోని గొలగముడి ఆలయం వద్ద ఆనందయ్య మందు పంపిణీని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. అయితే ఆనందయ్య మందు కవర్‌పై వైసీపీ రంగులతో పాటు ఆ పార్టీ నేతల ఫోటోలు దర్శనమిచ్చాయి. ఇది కూడా చర్చనీయాంశంగా మారింది. దీనిపై కొందరు అభ్యంతరం చెప్పగా.. వైసీపీ రంగులతో పాటు తమ ఫోటోలు వేసుకోవడం తమ ఇష్టమని ఎమ్మెల్యే కాకాని తెలిపారు. సొంత నిధులు ఖర్చుపెట్టి తయారు చేయించాం.. సర్వేపల్లి నియోజకవర్గంలో 1.80 లక్షల కుటుంబాలకు ఆనందయ్య మందు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. సర్వేపల్లి నియోజకవర్గంలో పంపిణీ పూర్తి అయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తామన్నారు.
మొత్తంగా ఆనందయ్య మందు పంపిణి మొదలైనా... అది ప్రస్తుతానికి రెండు నియోజకవర్గాలకే పరిమితం కావడం జనాలను నిరాశ పరిచింది. ఇక మందు కవర్లపై వైసీపీ రంగులు ముద్రించడంపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఆనందయ్య మందుపై రాజకీయం చేయడం సరికాదంటున్నారు. మొదటి నుంచి స్థానిక ఎమ్మెల్యే జోక్యం వల్లే గతంలో మందు పంపిణి ఆగిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎన్నో అడ్డంకులు అధిగమించి మందు తయారవుతున్నా.. ఇప్పుడు పార్టీ రంగులు, సీఎం ఫోటోలు ముద్రించి మళ్లీ వివాదాస్పదం చేస్తున్నారని జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆనందయ్యపై రాజకీయం చేయవద్దని.. ఆయన పనిని ఆయనను చేసుకోనివ్వాలని కోరుతున్నారు.