ఏపీలో హిట్లర్ రాజ్యం! ప్రశ్నిస్తే కేసులు.. ఎదిరిస్తే సంకెళ్లు..
posted on Jun 7, 2021 @ 1:03PM
విశాఖ లక్ష్మీ అపర్ణ ఉదంతం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఏపీలో పోలీస్ రాజ్యంపై మరోసారి తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. గతంలో మాస్కులు, పీపీఈ కిట్లు లేవనన్నందుకు డాక్టర్ సుధాకర్‌కు పిచ్చెక్కించడం.. విశాఖలో తెల్లవారుజాము కూల్చివేతల పరంపర కొనసాగుతుండటం.. ఇదంతా విశాఖలో పులివెందుల రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేయడమేనంటూ టీడీపీ విమర్శిస్తోంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇదే తీరు.. ప్రశ్నిస్తే కేసులు.. ఎదిరిస్తే సంకెళ్లు.. అంటూ మండిపడుతోంది. పోలీసు రాజ్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే అడుగడుగునా ప్రజాస్వామ్యం ఇలానే పరిహసింపబడుతుందని.. ప్రజల ప్రాథమిక హక్కులు హరించబడుతాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకు.. అనేక ఉదాహరణలు.
విశాఖ విషయానికే వస్తే.. పాపం.. అపోలో ఫార్మసీలో పని చేసే లక్ష్మీ అపర్ణ చేసిన నేరమేంటి? ఫ్రంట్ లైన్ వారియర్‌గా తనకు కర్ఫ్యూ సమయంలో ప్రయాణించే హక్కు ఉందని అడగడమే ఆమె చేసిన నేరమా? అన్ని రకాల అనుమతి పత్రాలు ఉన్నా.. వాటిని పోలీసులకు చూపించినా.. ఫైన్ వేయడం.. ఆమెను స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేయడాన్ని వ్యతిరేకించడమే తప్పిదమా? ఆ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది కాబట్టి సరిపోయింది.. లేదంటే లక్ష్మీ అపర్ణదే తప్పు అన్నట్టు ఆమెను ఈపాటికే శిక్షించేవారు కాదా? ఆమెనే తమపై తిరగబడిందని.. తమ విధులకు ఆటంకం కలిగించిందంటూ.. నేరం బాధితురాలిపైనే మోపే ప్రయత్నం చేసినా.. ఆ వీడియో చూసిన వాళ్లెవరు పోలీసుల వర్షన్‌ను నమ్మే పరిస్థితి లేదంటున్నారు.
ఫార్మసీ అంటే.. ఎమర్జెన్సీ సర్వీస్. ఆ విషయం ఖాకీలకూ తెలుసు. ఫార్మసీ అని పేరు చెబితేనే వదిలేయాల్సిన పోలీసులు.. ఆమెను అంతలా గుచ్చి గుచ్చి ప్రశ్నించాల్సిన అవసరం ఏమొచ్చింది? అంతగా పత్రాలు, పంతాలకు పోవడం దేనికి? కాసిన్ని ఫైన్ డబ్బుల కోసం ఇంత రచ్చ చేయడం పోలీసులకు అవసరమా? అరకొర జీతానికి పని చేసే ఆ యువతి.. చేయని తప్పునకు అంతగా ఫైన్ వేసే సరికి భరించలేకపోయింది. బాధతో ఆవేశం తన్నుకొచ్చింది. అందుకే, అంతలా పోలీసులపై తిరగబడింది. ఫైన్ ఎందుకు వేశారంటూ నిగ్గదీసి అడిగింది. తన హక్కుల కోసం పోరాడింది. పోలీసుల చర్యను వ్యతిరేకించింది. ఆ వీడియో చూసిన వాళ్లంతా లక్ష్మీకి మద్దతుగానే కామెంట్లు చేస్తున్నారంటే.. ఆమెది తప్పు కాదని ప్రజలు జడ్జిమెంట్ ఇచ్చేసారనేగా అర్థం. సోషల్ మీడియా మొత్తం లక్ష్మీకి మద్దతుగా నిలుస్తోంది. మరి, ఖాకీలు అంత దారుణంగా ఎందుకు ప్రవర్తించాలనే ప్రశ్నా ఇక్కడ వినిపిస్తోంది. వదిలేస్తే పోయేదానికి.. గుచ్చి గుచ్చి.. రచ్చ రచ్చ చేసి.. వివాదం సృష్టించారనే వారూ ఉన్నారు. పోలీసులకు అపరిమిత అధికారులు ఇస్తే.. పోలీస్ రాజ్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే.. ఇలానే ఉంటుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
విశాఖలో పరిపాలనంతా పోలీసుల కనుసన్నల్లోనే జరుగుతోందనే విమర్శ ఉంది. తెల్లవారితే.. ఏ ప్రాంతంలో పోలీసులు మోహరిస్తారో.. ఏ ప్రతిపక్ష నాయకుల ఆస్తులు కూలగొడతారో.. ఆ మానసిక వికలాంగుల భవనాన్ని ధ్వంసం చేస్తారో తెలీని భయానక పరిస్థితి.
గతంలో విశాఖలో జరిగిన డాక్టర్ సుధాకర్ ఎపిసోడ్ గుర్తుకొచ్చి మరింత హడలిపోతున్నారు. మాస్కులు, పీపీఈ కిట్లు అడిగినందుకు.. అతన్ని నడిరోడ్డుపై చితక్కొట్టి.. పిచ్చివాడిగా ముద్రేసి.. గుండెపోటు వచ్చేలా చేసిన ఉదంతాన్ని గుర్తు చేస్తున్నారు.
లక్ష్మీప్రసన్న వ్యవహారంపై స్పందించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. విశాఖ పాలనా రాజధాని అవుతుందో లేదో కానీ వైసీపీ మార్కు పులివెందుల పోలీసింగ్‌తో అరాచకాలకు అడ్డాగా మారిందంటూ విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన అవినీతిని ప్రశ్నిస్తే కేసులు, ఎదిరిస్తే సంకెళ్లు అన్నట్లుగా సాగుతోందని టీడీపీ మండిపడుతోంది. ఆనందయ్య మందు పంపిణీలో వైసీపీ నేతలు జోక్యం చేసుకుంటున్నారని.. ఆనందయ్య అనుమతి లేకుండా వెబ్ సైట్ సృష్టించి కోట్లు కొల్లగొట్టాలని ప్లాన్ చేశారని.. దీనిని ప్రశ్నించినందుకే మాజీమంత్రి సోమిరెడ్డిపై అక్రమ కేసులు బనాయించారని తప్పుబడుతోంది. సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళపై కొవిడ్ నిబంధనల పేరుతో మరో అక్రమకేసు బనాయించారన్నారు. విశాఖలో టీడీపీ నేతల ఆస్తులు కూలగొట్టారని.. తాజాగా మానసిక వికలాంగుల స్థలాన్ని కబ్జా చేసేందుకు అధికార పార్టీ నేతల యత్నిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల సోషల్ మీడియా పోస్టులు పెట్టారంటూ ఇద్దరిని అరెస్ట్ చేయడాన్ని తప్పుబట్టారు. ఇక రఘురామ అరెస్ట్, కస్టడీలో టార్చర్ ఎపిసోడ్ తెలిసిందే.
ఇలా ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపు చర్యలతో పాటు సామాన్యులపైనా జగన్‌రెడ్డి ప్రభుత్వం పోలీస్ రాజ్యాన్ని ప్రయోగించడం దారుణమంటూ టీడీపీతో పాటు నెటిజన్లు మండిపడుతున్నారు. చరిత్రలో హిట్లర్ లాంటి నియంతలే కాలగర్భంలో కలిసిపోయారని గుర్తుచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనపై జనం తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. ఇకనైనా అప్రజాస్వామిక విధానాలను విడనాడాలని హితవు పలుకుతున్నారు.