కాంగ్రెస్ ఎమ్మెల్యేకు చంద్రబాబు పరామర్శ.. కంటతడి పెట్టిన సీతక్క..
posted on Jun 7, 2021 @ 3:35PM
తెలంగాణ రాష్ట్రంలోని ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే ధనసరి సీతక్కనను టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. సీతక్క తల్లి సమ్మక్క హైదరాబాదులోని ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏఐజీకి వెళ్లి సమ్మక్కను చంద్రబాబునాయుడు పరామర్శించారు. ఆమె ఆరోగ్యం గురించి ఎమ్మెల్యే సీతక్కతోనూ, ఏఐజీ వైద్యులతోనూ మాట్లాడారు. సీతక్కకు ధైర్యంగా ఉండాలని చెప్పారు. సీతక్క నిరాడంబరత, ప్రజాసేవ, క్రమశిక్షణ తదితర అంశాలను చంద్రబాబు అక్కడి వైద్యులకు వివరించారు. ఆమె అవలంబిస్తున్న సేవా కార్యక్రమాలను చంద్రబాబు అభినందించారు.
తన గురించి ఏఐజీ వైద్యులకు చంద్రబాబు ప్రత్యేకంగా వివరించడంతో సీతక్క ఉద్వేగానికి లోనయ్యారు. ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. దీని గురించి ఆమె ట్విట్టర్ లో వెల్లడించారు. తన తల్లిని పరామర్శించడమే కాకుండా, తమకు ధైర్యం చెప్పారని తెలిపారు. చంద్రబాబును సీతక్క తన ఆత్మీయ సోదరుడు అని అభివర్ణించారు. థాంక్స్ అన్నా అంటూ సీతక్క తన ట్విట్టర్ అకౌంట్లో చంద్రబాబు సందర్శన వీడియోను పంచుకున్నారు.
సీతక్క తెలుగు దేశం పార్టీలో సుదీర్ఘకాలం పని చేశారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడారు. తెలంగాణలో టీడీపీ ముఖ్య నేతల్లో ఒకరిగా నిలిచిన సీతక్క.. చంద్రబాబుకు అత్యంత సన్నిహితురాలిగా ఉన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి తెలంగాణ టీడీపీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో... అతనితో పాటు హస్తం గూటికి చేరారు. గత ఎన్నికల్లో ములుగు నుంచి ఘన విజయం సాధించారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఆమె యాక్టివ్ నేతగా ఉన్నారు. కాంగ్రెస్ మహిళా విభాగం జాతీయ కమిటీలో కీలకమైన స్థానంలో ఉన్నారు. కరోనా కల్లోల సమయంలో పేదలకు అండగా నిలుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఎమ్మెల్యే సీతక్క.