ఫ్రీ వ్యాక్సిన్.. దేశప్రజలకు మోదీ బంపర్ ఆఫర్..
posted on Jun 7, 2021 @ 6:12PM
కరోనా కల్లోల వేళ దేశ ప్రజలకు ప్రధాని మోదీ గుడ్ న్యూస్ చెప్పారు. జూన్ 21 నుంచి.. 18 ఏళ్లు పైబడిన వారికి కేంద్రమే ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేస్తుందని ప్రకటించారు. కేంద్రమే టీకాలు కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఇస్తుందని మోదీ చెప్పారు. వ్యాక్సిన్‌కు రాష్ట్రాలు రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని.. కొవిడ్ వ్యాక్సినేషన్ బాధ్యత పూర్తిగా కేంద్రానిదేనన్నారు ప్రధాని మోదీ. ప్రైవేట్ ఆసుపత్రలకు 25 శాతం డోసులు ఇస్తామని.. అయితే, ప్రైవేటు ఆసుపత్రులు వ్యాక్సిన్లపై సర్వీస్ చార్జి కింద కేవలం రూ.150 మాత్రమే వసూలు చేయాల్సి ఉటుందని ప్రధాని స్పష్టం చేశారు.
వ్యాక్సినేషన్‌పై అనేకసార్లు సీఎంలతో మాట్లాడానని.. టీకాల కొరతపై రాష్ట్రాల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. దేశంలో మెడికల్ ఆక్సిజన్ డిమాండ్ బాగా పెరిగింది. తక్కువ సమయంలోనే ఆక్సిజన్ ఉత్పత్తిని 10 రెట్లు పెంచాం. ఆక్సిజన్ సరఫరాకు వైమానిక, నౌకా, రైల్వే సేవలు వినియోగించుకున్నాం. సెకండ్ వేవ్ కంటే ముందే ఫ్రంట్‌లైన్ యోధులకు వ్యాక్సినేషన్ పూర్తి చేశాం. ఇప్పటివరకు 23కోట్ల డోసులు పంపిణీ చేశామన్నారు ప్రధాని.
‘కరోనా వ్యాక్సిన్ కోసం ఎన్నో దేశాలు ఎదురుచూస్తున్నాయి. కరోనా అదృశ్య శక్తితో పోరాటంలో కొవిడ్ ప్రొటోకాల్ పాటించడమే మనకు రక్ష. ఇంతమంది జనాభా ఉన్న దేశంలో వ్యాక్సిన్ తయారు చేసుకోకుంటే పరిస్థితి ఏమిటి? మనం వ్యాక్సిన్ తయారు చేసుకోకపోతే విదేశాల నుంచి వచ్చేందుకు ఏళ్లు పట్టేది. గతంలో టీకాల కోసం దశాబ్దాల తరబడి ఎదురుచూడాల్సి వచ్చేది. మిషన్ ఇంద్ర ధనస్సు ద్వారా యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సినేషన్ ప్రారంభించాం. వ్యాక్సిన్‌తయారీలో ప్రపంచ దేశాలతో సమానంగా పోటీపడ్డాం. తక్కువ సమయంలో టీకా తయారీలో మన శాస్త్రవేత్తలు సఫలమయ్యారు. టీకా తయారీలో అన్ని విధాలుగా కేంద్రం మద్దతిచ్చింది. టీకా తయారీ సంస్థలు, క్లినికల్ ట్రయల్స్‌కు పూర్తి మద్దతుగా నిలిచాం. కేంద్రం తీసుకున్న కచ్చితమైన నిర్ణయాల వల్లే వ్యాక్సిన్లు వచ్చాయి.
దేశంలో 7 కంపెనీలు టీకాలు తయారు చేస్తున్నాయి. మరో మూడు కంపెనీలు క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. చిన్నారుల టీకా కోసం కూడా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. నాసల్ స్పే టీకా కోసం కూడా ప్రయోగాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియలో మనం ఎవరి కంటే వెనుకబడిలేం. కొద్ది రోజుల్లోనే కొవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తి మరింత వేగవంతమవుతుంది. జూన్ 21 నుంచి 18ఏళ్లు పైబడిన వారందరికీ కేంద్రమే ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తుంది. వ్యాక్సినేషన్ బాధ్యత పూర్తిగా కేంద్రానిదే’’ అని మోదీ ప్రకటించారు.
ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాన్ని దీపావళి వరకూ పొడిగిస్తున్నట్టు ప్రధాని ప్రకటించారు. ఈ పథకం వల్ల 80 కోట్ల మంది పేదలు ఉచిత రేషన్ అందుకుంటారని చెప్పారు. గత ఏడాది కూడా కోవిడ్ సమయంలో కొన్ని నెలల పాటు ఈ స్కీమ్‌ను కేంద్రం అమలు చేసింది. కోవిడ్ సెకెండ్ వేవ్ నేపథ్యంలో కేంద్రం తీసుకుంటున్న చర్యలు, వ్యాక్సినేషన్ లభ్యత, స్వదేశీ వ్యాక్సిన్ల అభివృద్ధి తదితర కీలక విషయాలపై జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు.