స్టాలిన్‌ను చూసి నేర్చుకో జగన్.. తమిళనాట తెలుగుకు పెద్దపీట..
posted on Jun 7, 2021 @ 12:03PM
తెలుగు భాష. తేనెలొలుకు తేట తెలుగు భాష. అమ్మ బాష. మనందరి భాష. అలాంటి తెలుగు భాషను తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో చిన్నచూపు చూస్తున్నారు. చదువు నేర్వడానికి పనికిరాదంటూ పక్కన పెట్టేశారు. పసిపిల్లల దశ నుంచే తెలుగును దూరం చేసేస్తున్నారు. స్వభాష మీద ఇంతటి కుఠిల ప్రయత్నం మరెక్కడా కనిపించకపోవచ్చు. సీఎం జగన్మోహన్‌రెడ్డి పాలనలో మాత్రమే సాధ్యం ఇలాంటి దౌర్భాగ్యం అంటూ తెలుగువాళ్లు వాపోతున్నారు. మన నాయకుడు తెలుగుకు తెగులు పట్టిస్తుంటే.. పరాయి రాష్ట్రంలో, పరభాష ముఖ్యమంత్రి మాత్రం మన తెలుగును అందలం ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు.
దేశ భాషలందు తెలుగు లెస్సా.. అనే స్పూర్తితో తెలుగు భాషకి.. కేంద్ర ప్రభుత్వ అధికార భాష హోదా లభించే విధంగా కృషి చేస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించడం సంచలనంగా మారింది. కేవలం తెలుగు అనే కాదు.. భారత రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూలులో పేర్కొన్న భాషలన్నిటికీ.. అధికార భాష హోదా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానన్నారు సీఎం స్టాలిన్. అంటే, తమిళనాడులో తమిళంతో పాటు తెలుగుకూ పెద్దపీట వేసేందుకు కృషి చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడం అభినందనీయం. తెలుగు వారందరికీ గర్వకారణం.
సీఎం పీఠం అధిరోహించనప్పటి నుంచీ స్టాలిన్ ఇలా పలు జనరంజక నిర్ణయాలు తీసుకున్నారు. జయలలిత పేరు మీద ఉన్న అమ్మ క్యాంటీన్లను కొనసాగిస్తామని ప్రకటించారు. కరోనా కట్టడి కోసం సీఎం నేతృత్వంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి.. అందులో సభ్యులుగా ప్రతిపక్ష అన్నాడీఎంకే ఎమ్మెల్యేలనే తీసుకుని సంచలనం సృష్టించారు. అదే ఏపీలో అయితే.. జగన్‌రెడ్డి సీఎం సీటులో కూర్చోగానే.. పేదలకు అన్నంపెట్టే.. అన్నా క్యాంటీన్లను మూసేయించారు. ప్రతిపక్ష నేతలే టార్గెట్‌గా కుట్రలు చేస్తూ కేసులు పెడుతున్నారు. అక్కడితో సంతృప్తి చెందక.. బహుషా తెలుగుదేశంపార్టీలో తెలుగు అనే పదం ఉందని కాబోలు.. తెలుగు భాషను తెరమరుగు చేసేలా.. తెలుగు మీడియం స్కూల్స్ రద్దు చేసేందుకు దూకుడు ప్రదర్శించారు. అమ్మ బాషను దూరం చేసే ప్రయత్నాన్ని అంతా వ్యతిరేకించినా వెనక్కి తగ్గడం లేదు.
ఏపీలో భాషపై కుట్ర ఇలా ఉంటే.. అటు భాషాభిమానం మెండుగా ఉండే తమిళులు.. తమిళంతో పాటు తెలుగుకూ అధికార భాషగా అధిక ప్రాధాన్యం ఇచ్చేందుకు కృషి చేస్తామనడం చిన్న విషయమేమీ కాదు. పక్క రాష్ట్రం తమిళనాడులో తెలుగు భాషకు ఇంతటి ఆదరణ లభిస్తుంటే.. తెలుగు భాషా ప్రాతిపదికన ఏర్పడిన మన ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం తెలుగును తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు. సీఎం జగన్‌రెడ్డి తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల.. పసిపిల్లలు తెలుగులో చదువు నేర్చుకునే సదవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. పాఠశాల విద్య ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉండాలంటూ జీవో తీసుకొచ్చి దాన్ని ప్రజలపై బలవంతంగా రుద్దు తున్నారు.
ప్రతిపక్షాలతో పాటు భాషాభిమానులు, విజ్ఞులు అంతా జగన్‌రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకించినా.. వారిపై మాటలతో ఎదురుదాడి చేశారే కానీ.. తెలుగు మీడియంకు చదువుకు సదవకాశం కల్పించనే లేదు. తెలుగు వద్దు.. ఇంగ్లీష్ ముద్దు.. అన్నట్టుగా ఉంది సీఎం జగన్‌రెడ్డి నిర్ణయాలు అంటూ ప్రజలు మండిపడుతున్నా.. ఆయనలో మార్పు కనిపించడం లేదు. తాజాగా, తమిళనాడు సీఎం స్టాలిన్ ఆ రాష్ట్రంలో తెలుగుకు ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం చేస్తుండటాన్ని చూసైనా.. సీఎం జగన్‌రెడ్డి ఆలోచనా విధానం మారితే బాగుండు అంటున్నారు.
తమిళులు సైతం తెలుగులో మాట్లాడటానికి చాలా ఇష్టపడతారు. చాలామంది తమిళులకు తెలుగు బాగా వచ్చు. మాజీ సీఎం జయలలిత తెలుగు భాషలో ప్రావీణురాలు. తమిళనాడులో సెటిల్ అయిన తెలుగువారంతా తెలుగు మీడియంలో విద్యాభ్యాసం చేయడానికే ఇష్టపడతారు. తమిళనాడులోనూ ఇప్పటికీ తెలుగు మీడియం స్కూల్స్ ఉన్నాయంటే నమ్మాల్సిందే. అరవ రాష్ట్రంలోనే తెలుగుకు అంత ఆదరణ ఉంటే.. మన ఏపీలో మాత్రం భాషనూ రాజకీయం చేస్తూ.. తెలుగు ఉనికినే ప్రశ్నార్థకం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు ఉన్నాయి. కోర్టులు సైతం తెలుగు మీడియం రద్దును వ్యతిరేకించినా.. పాలకుల కుట్రలతో ఇంగ్లీష్ మీడియంకే ప్రయారిటీ ఉంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు భాషకు జరుగుతున్న అన్యాయాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాటల్లో చెప్పాలంటే.. పరాయి భాష కళ్లద్దాలు లాంటిది.. మాతృభాష కళ్లు. కళ్లుంటేనే కదా కళ్లద్దాలు పెట్టుకునేది..!