రాహుల్‌గాంధీనే ప్రధాని.. కాంగ్రెస్‌కు పీకే బంపర్ ఆఫర్..
posted on Jun 7, 2021 @ 2:07PM
ప్రశాంత్ కిషోర్. ఇది పేరు కాదు ఓ పొలిటికల్ బ్రాండ్. దేశంలోనే సంచలనాత్మక వ్యూహకర్త. ఆయన డీల్ ఓకే చేస్తే.. ఇక ఆ పార్టీ గెలిచినట్టే. ఏపీలో వైఎస్ జగన్, తమిళనాడులో స్టాలిన్, ఢిల్లీలో కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్‌లో మమత బెనర్జీలను.. తన వ్యూహాలతో గెలిపించిన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే. హోరాహోరీగా సాగిన బెంగాల్ దంగల్ తర్వాత రాజకీయ వ్యూహకర్తగా విరామం తీసుకుంటానని ప్రకటించిన పీకే.. అంతలోనే మనసు మార్చుకున్నట్టున్నారు. ఇప్పుడాయన బీజేపీని గద్దె దింపడమే పనిగా పెట్టుకున్నట్టున్నారు. మోదీకి వ్యతిరేకంగా రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిగా చేయాలనే సంకల్పంతో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే, అడగకుండానే కాంగ్రెస్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చారు.
దేశంతో బీజేపీయేతర ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీ పేరును ప్రకటింపజేస్తే.. తాను కాంగ్రెస్ కోసం పనిచేయడానికి సిద్దమంటూ ప్రకటించారు పీకే. మోదీని ఢీకొట్ట గల సత్తా.. విడివిడిగా ప్రాంతీయ పార్టీలకు లేవని.. రాహుల్‌గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ కూటమికే అది సాధ్యమనేది పీకే అంచనా. 2024లో కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీని ప్రకటిస్తే ఆయన కోసం పనిచేయడానికి సిద్ధం అంటూ ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన చేశారు.
2019లో కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీయే గ్రాఫ్ వేగంగా తగ్గుతూ వస్తోంది. పలు రాష్ట్రాల్లో అధికారానికి దూరమైంది. దక్షిణాదిన ఇంకా కోలుకోనే లేదు. నాటి పెద్ద నోట్ల రద్దు నుంచి.. నేటి వ్యాక్సిన్ ఉదాసీనత వరకూ.. మోదీ ఇమేజ్ దారుణంగా పడిపోతోంది. కేవలం మాటల ప్రధానిగా.. మాయల మరాఠీగా ఆయనపై ముద్ర పడుతోంది. చేసేది తక్కువ.. చెప్పేది ఎక్కువ అనే భావన ప్రజల్లో వచ్చేసింది. అందుకే, ఇటీవల జరిగిన పలు అసెంబ్లీ ఎన్నికలతో పాటు, కర్ణాటక, యూపీలో జరిగిన స్థానిక సంస్థల సంగ్రామంలోనూ బీజేపీ దారుణ ఫలితాలు చవిచూసింది. అయితే, అదే సమయంలో విపక్ష కాంగ్రెస్ సైతం పుంజుకోలేక పోవడం బీజేపీకి అడ్వాంటేజ్‌గా మారుతోంది.
కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం కోసం ఎదురుచూస్తోంది. అందుకోసం చేసే ప్రయత్నాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. నాయకత్వలేమి కాంగ్రెస్‌ను తీవ్రంగా వేధిస్తోంది. వందేళ్ల చరిత్ర ఉన్నహస్తం పార్టీ.. తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో నెట్టుకొస్తోంది. అధ్యక్ష పదవి చేపట్టేదుకు రాహుల్‌గాంధీ మారం చేస్తున్నారు. ప్రియాంకగాంధీ పూర్తి స్థాయిలో రాజకీయ అరంగేట్రం చేయటం లేదు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు ఇప్పటికీ బలమైన ఓటు బ్యాంకు ఉన్నా.. కేడర్ మాత్రం తీవ్ర నిరుత్సాహంలో కూరుకుపోయి ఉంది. కాంగ్రెస్ పార్టీకి.. బీజేపీ కంటే కాంగ్రెస్ ఉదాసీన వైఖరే బద్ద శత్రువుగా కనిపిస్తోంది. త్వరలో కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో.. ఇంకా ఆలస్యం చేస్తే కోలుకోలేని నష్టం తప్పకపోవచ్చు. అందుకే, సమయం లేదు మిత్రమా అంటూ హస్తం పార్టీకి చేయి అందిస్తున్నారు ప్రశాంత్ కిషోర్. మీరు సై అంటే.. తానుసైతం సై సైరా.. అంటూ స్నేహహస్తం చాస్తున్నారు.
2014 లో ఎన్డీయే అధికారంలోకి రావడంలో ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించారు. మోడీకి పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌గా పని చేశారు. అనంతరం బీజేపీకి దూరం అయ్యారు. ఆ తర్వాత ఢిల్లీ, బీహార్, యూపీ, ఏపీ, తమిళనాడు, బెంగాల్.. ఇలా అన్నీ బీజేపీ వ్యతిరేక పార్టీల కోసమే పని చేయడంతో.. కాషాయ పార్టీకి అంటరానివాడిగా మారిపోయాడు ప్రశాంత్ కిశోర్. పని చేసి చేసి.. ఆయన సైతం బీజేపీ వ్యతిరేకిగా మారిపోయారు. ఆ మధ్య బీహార్‌లో సీఎం నితీశ్‌కుమార్ పార్టీలో చేరి.. ఆయనతో విభేదాలు వచ్చి.. తనకు ఈ రాజకీయాలు సరిపడవంటూ.. బయటకు వచ్చేశారు.
ఇటీవల బెంగాల్ దంగల్‌లో మమత కోసం వ్యూహకర్తగా పని చేశారు. దీదీ కంటే పీకేనే బీజేపీతో గట్టిగా ఫైట్ చేశారని అంటారు. బెంగాల్‌లో బీజేపీ రెండంకెల సీట్లకే పరిమితం అవుతుందని.. ఒకవేళ బీజేపీకి వంద సీట్లు దాటితే.. తాను ఇకపై రాజకీయ వ్యూహాకర్త కొనసాగబోనంటూ మోదీ, అమిత్‌షాలకు సవాల్ చేసి మరీ బీజేపీని రెండంకెల స్థానాలకే పరిమితం చేసి చూపించాడు ప్రశాంత్ కిశోర్. అదీ పీకే స్టామినా. అలాంటి ప్రశాంత్ కిశోరే.. ఇప్పుడు స్వయంగా తాను కాంగ్రెస్ కోసం పని చేస్తానని.. అయితే.. రాహుల్‌గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలంటూ కండిషన్ పెట్టడం సంచలనంగా మారింది. మరి, పీకే ఆఫర్‌కు కాంగ్రెస్ పార్టీ సై అంటుందా? దేశవ్యాప్తంగా చతికిలపడిన హస్తం పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడం పీకే వల్ల అవుతుందా? అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్.