పార్లమెంట్ లో మద్దతివ్వండి! ఢిల్లీ సీఎంకు రఘురామ లేఖ..
posted on Jun 7, 2021 @ 4:57PM
నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు దూకుడు మరింత పెంచారు. ఎంపీ అయిన తనపై ఏపీ సీఐడీ పోలీసులు దారుణంగా వ్యవహరించారని ఆరోపిస్తున్న రఘురామ.. తన పోరాటం ఉధృతం చేశారు. ఇప్పటికే తనపై జరిగిన దాడిపై లోక్ సభ స్పీకర్ కు , పార్లమెంట్ కమిటీలకు ఫిర్యాదు చేశారు. ఎంపీలందరికి లేఖలు రాశారు. రఘురామపై దాడి ఘటనపై ఎంపీలు షాకయ్యారు. తీవ్రంగా స్పందిస్తూ కొందరు ఎంపీలు ట్వీట్లు చేశారు. ఎంపీకే ఇంత దారుణమా అంటూ కొందరు ఏపీ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎంపీపై రాజద్రోహం కేసు పెట్టడంపై అన్ని విధాల పోరాటం చేస్తున్న రఘురామ.. పార్లమెంట్ లో ఈ అంశాన్ని లేవనెత్తపోతున్నారు.ఇందుకోసం ఇప్పటికే ఎంపీల మద్దతు కూడగట్టిన రఘురామ.. ఇప్పుడు పార్టీల మద్దుతు కోసం ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ కు లేఖ రాశారు ఎంపీ రఘురామ రాజు. సెక్షన్ 124ఏ రద్దుకు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు పార్లమెంటులో డిమాండ్ చేయాలని తన లేఖలో కోరారు. ఆప్ సభ్యులు పార్లమెంటులో దీనిపై గళం వినిపించేలా చూడాలని రఘురామ విజ్ఞప్తి చేశారు.
స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారి ఓ ఎంపీని 124ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేసి, చిత్రహింసలు పెట్టారని ఎంపీ రఘురాం తెలిపారు. మే 14న తనను అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు క్రూరంగా హింసించారని వివరించారు. సెక్షన్ 124ఏను రద్దు చేసేందుకు పూర్తి మద్దతు ఇవ్వాలని రఘురామకృష్ణరాజు తన లేఖలో కోరారు.