వదల జగన్‌రెడ్డీ నిన్నొదలా.. 28 రాష్ట్రాల సీఎంలకు రఘురామ లేఖ..
posted on Jun 7, 2021 @ 5:07PM
వదల జగన్‌రెడ్డీ నిన్నొదలా.. అంటూ రఘురామ ఓ రేంజ్‌లో ఆటాడుకుంటున్నారు. ఇన్నాళ్లూ ఏపీకే పరిమితమైన ఆయన రివేంజ్.. ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో దడదడలాడిస్తున్నారు. రాజ్యాంగం ప్రసాదించిన ఏ ఒక్క మార్గాన్నీ ఆయన వదులుకోవడం లేదు. తనకు జరిగిన అన్యాయాన్ని.. సీఐడీ కస్టడీలో గాయాలను, జగన్‌రెడ్డి సర్కారు కక్ష సాధింపు చర్యలను.. తు.చ తప్పకుండా.. పొల్లుబోకుండా.. పూసగుచ్చినట్టు అందరికీ వివరిస్తున్నారు. సీఎం జగన్‌రెడ్డికి వ్యతిరేకంగా యావత్ దేశాన్ని ఏకం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో రఘురామకృష్ణరాజుకు దాదాపు అన్ని రాష్ట్రాలు, అన్ని పార్టీల నుంచి సానుభూతి, మద్దతు వెల్లువెత్తుతుండటంతో జగన్‌రెడ్డి ఇరకాటంలో పడుతున్నారు. ఢిల్లీ స్థాయిలో తన పరువు బజారు కీడుస్తుండటంపై సీఎం జగన్‌రెడ్డిలో కలవరపాటు మొదలైందని అంటున్నారు. అందుకే, కేంద్రహోంమంత్రి అమిత్‌షాను కలిసేందుకూ ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు.
తాజాగా, ఎంపీ రఘురామ.. తన అరెస్ట్, తదనంతర పరిణామాలను వివరిస్తూ అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖ రాశారు. జగన్ మినహా.. మిగతా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రఘురామ లేఖలు పంపించారు. ఏపీ సీఐడీ పోలీసులు తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. జగన్ బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో పిటిషన్ వేసినందుకే.. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తనను అరెస్ట్ చేయించారని రఘురామకృష్ణరాజు తెలిపారు. ఈ విషయంపై పార్లమెంట్‌లో తనకు మద్దతిచ్చేలా వారి ఎంపీలకు సూచించాలని సీఎంలను కోరారు. రాజద్రోహం సెక్షన్‌ను తొలగించేలా అసెంబ్లీల్లో తీర్మానం చేసి.. కేంద్రానికి పంపాలని సీఎంలకు రాసిన లేఖలో రఘురామ కోరడం విశేషం.
ఇప్పటికే పలు పార్టీలకు చెందిన సహచర ఎంపీలకు రఘురామ లేఖలు రాసిన విషయం తెలిసిందే. ఆయన రాసిన లేఖలతో రఘురామకు దేశవ్యాప్తంగా ఎంపీల నుంచి మద్దతు పెరుగుతోంది. కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్, మండ్యా ఎంపీ సుమలత, కేరళ ఎంపీ ప్రేమ్ చంద్రన్, ఒడిశాలోని పూరి ఎంపీ, బిజూ జనతాదళ్ పార్లమెంటరీ పార్టీ నేత పినాకి మిశ్రాతో పాటు మరో ఒడిశా ఎంపీ చంద్రశేఖర్ సాహూ వంటి వారు రఘురామ పట్ల ఏపీ సీఐడీ వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించారు. రఘురామ రాసిన లేఖకు స్పందించిన నీటిపారుదల వ్యవహారాల స్థాయీ సంఘం ఛైర్మన్ సంజయ్ జైస్వాల్.. ఈ ఘటన బాధించిదని ఈ విషయంపై పార్లమెంట్‌లో తప్పక మాట్లాడతానని రఘురామకు మెయిల్ చేశారు. అనేక మంది ఎంపీలు పోలీసుల క్రూరత్వం, రఘురామకు జరిగిన దారుణాన్ని తీవ్రంగా తప్పుబడుతూ, ఖండిస్తూ ట్వీట్లు చేస్తున్నారు.
ఇలా.. ఎంపీ రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అదే సమయంలో సీఎం జగన్‌రెడ్డి ఇమేజ్ దేశవ్యాప్తంగా డ్యామేజ్ అవుతోంది. సుప్రీంకోర్టు షరతులకు లోబడి.. జగన్‌రెడ్డి ప్రభుత్వంపై తనదైన శైలిలో పోరాడుతున్నారు ఎంపీ రఘురామ. వీల్‌ఛెయిర్‌లో వెళ్లి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలవడం.. లోక్‌సభ స్పీకర్‌ను కలిసి కాలి గాయాలు చూపించడం.. తనపై జరిగిన దాడిపై జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయడం.. కేసుతో సంబంధం ఉన్న పలువురు ఏపీ అధికారులకు లీగల్ నోటీసులు పంపించడం.. తన సెల్‌ఫోన్ తీసుకున్నారంటూ సీఐడీ ఉన్నతాధికారిపై ఢిల్లీ పోలిస్‌స్టేషన్‌లో కంప్లైంట్ చేయడం... ఇలా ఢిల్లీలో ఉంటూనే తన అరెస్ట్, కస్టడీలో కొట్టడంపై గతంలో ఏ నాయకుడూ పోరాడని విధంగా పోరాడుతున్నారు ఎంపీ రఘురామకృష్ణరాజు.
రఘురామ ఎత్తుగడలతో.. దేశవ్యాప్తంగా పరవు పోగొట్టుకొని.. జాతీయ వ్యవస్థల ముందు దోషిగా నిలబడే దుస్థితి వస్తుండటంతో.. జగన్‌రెడ్డి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారట. అందుకే, రఘురామ బిగుస్తున్న చక్రబంధనం నుంచి తప్పించుకోడానికి కేంద్ర హోంశాఖ శరణు కోరేందుకు అమిత్‌షా అపాయింట్‌మెంట్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు విమర్శకులు. ఏదిఏమైనా.. అన్ని రాష్ట్రాల సీఎంలకు, ఎంపీలకు లేఖలు రాసి.. జాతీయ స్థాయిలో జగన్‌రెడ్డిపై రఘురామ తీర్చుకుంటున్న రివేంజ్ ఓ రేంజ్‌లో ఉంటోందంటున్నారు. అందుకే, జగన్‌రెడ్డికి ఢిల్లీ వైపు చూడాలంటేనే ముచ్చెమటలు పట్టేలా చేస్తున్నారట రఘురామ...