పథకాల్లో కోతలు.. జగన్ మళ్లీ మడమ తిప్పారు!
posted on Jun 28, 2021 @ 1:31PM
ముందు ఎంతైనా సరే తేవాల్సిందే..ఇవ్వాల్సిందే అన్నారు. తర్వాత ఏ నిధులైనా మళ్లించాల్సిందే..ఇవ్వాల్సిందే అన్నారు. ఆ తర్వాత అప్పు చేసైనా సరే..ఇవ్వాల్సిందే అన్నారు. ఆ ముచ్చట కూడా తీరాక.. అప్పుల కోసం సర్కారీ భూములు తాకట్టు పెట్టండి..ఏమైనా సరే ఇవ్వాల్సిందే అన్నారు. అది సరిగా కుదరక..ఇప్పుడిక చివరి అంకంలోకి దిగారు. ఆదాయం ఎటూ రాదని తేలిపోయింది కాబట్టి.. ఇక ఖర్చు తగ్గించడమే మార్గం అని డిసైడైపోయారు. కావాలంటే ఎన్నికల ముందు మళ్లీ పెంచుదాం...ఇప్పటికైతే కోసేయండనే ఆదేశాలొచ్చాయి.
నవరత్నాలు..సంక్షేమ పథకాలు..జగన్ కి ప్రాణం. ఎందుకంటే తాను జైలుకెళ్లినా..అధికారం అట్టిపెట్టేలా చేసేవి అవే మరి. తాము ఏం చేసుకున్నా..జనం మాట్లాడకుండా ఉండటానికి అవే ఆయుధాలు మరి. ఈ విషయంలో అధికారంలోకి రాక ముందే స్కెచ్ రెడీ అయింది. అందుకే అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే పందేరం మొదలైంది. రెండు నెలలకోసారి ఏదో ఒక పేరుతో ఒక ఫ్యామిలీకి 10 వేలు వేస్తున్నారు. దీంతో జనం కూడా మిగతా విషయాలు పట్టించుకోవడం లేదనే భావనలో వైసీపీ నేతలు ఉన్నారు. రాజధాని తరలించినా.. అక్రమ కేసులు పెట్టినా..మాట విననివారిని వేధించినా...పోలీసులు, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు అంతా వైసీపీ కార్యకర్తల్లా పని చేసినా కూడా పథకాలు అందుకుంటున్న లబ్ధిదారులు పట్టించుకోరనదే వారి కాన్సెప్ట్.
మరి ఈ పథకాలన్నీఅమలు కావాలంటే డబ్బులెలా? అందుకే ఉన్న డబ్బులన్నీ అటే డైవర్ట్ చేశారు. అప్పులు చేశారు. చివరకు తాకట్టులు పెడుతున్నారు.అయినా ఆదాయమే లేకపోతే..ఎన్నాళ్లనీ సర్దుతారు. ఆదాయం వచ్చే పనులేమీ చేయటం లేదు సరి కదా.. ఉన్న కంపెనీలు పోయేలా చేస్తున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కరెంట్ బిల్లు పెంచేది లేదంటూనే..దొంగదారిలో అన్నీపెంచేశారు. ఆస్తిపన్ను విధించారు. ఇవన్నీకూడా సరిపోవటం లేదు. అందుకే ఇప్పుడు కోతలు మొదలెట్టారు. లబ్ధిదారుల సంఖ్య తగ్గించే పనిలో పడ్డారు.
పెన్షన్లలో అవకతవకలు అంటూ లక్షల మందిని గుర్తించి..వారికి నోటీసులిచ్చారు. ఇవన్నీ ఉన్నాయని ఇప్పటివరకు తెలియక కాదు..ఇప్పుడు తీసేయాలి కాబట్టి.. ఇప్పుడే తెలిసింది. మరోవైపు వైఎస్సార్ భీమా పథకంలో కూడా నెంబర్ తగ్గించేస్తున్నారు. ఇకపై అన్నిపథకాల్లోనూ వెరిఫికేషన్ పేరుతో భారీగా సంఖ్య తగ్గించబోతున్నట్లు చెప్పుకుంటున్నారు. అమ్మ ఒడి, ఇతర పథకాలన్నిటికి ఇదే రూల్ పెట్టబోతున్నారు. దీంతో ఇప్పుడు లబ్దిదారుల్లో కలవరం మొదలైంది. ఎ
వరికి తీసేస్తారో.. ఎవరిని ఉంచుతారో అనే ఆందోళన మొదలైంది. అందరూ వాలంటీర్లను సంప్రదిస్తున్నారు. పనిలో పనిగా...లోకల్ వైసీపీ నేతలకు చెప్పుకుంటున్నారు...మీరే ఏదైనా చేయాలని. ఇప్పుడే మొదలైన ఈ సెగ.. జిల్లా స్థాయి నేతలకు కొన్నిరోజుల్లో తగలనున్నది. ఆ తర్వాత మంత్రులకు..సీఎంకు చేరుతుంది. అయినా అలా తగులుతుందని ముందే తెలుసు కాబట్టి.. దానిని ఎలా కవర్ చేయాలో ముందే ప్లాన్ చేసుకుంటారు.కాకపోతే పథకాలు కోల్పోతున్న లబ్ధిదారుల ఆగ్రహం ఎలా ఉంటుందో..వారి రియాక్షన్ ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి. ఇప్పటికే జాబ్ క్యాలెండర్ పై నిరుద్యోగుల రియాక్షన్ గట్టిగానే ఉంది