రేవంత్‌రెడ్డి కేక.. కోమటిరెడ్డి కాక.. కాంగ్రెస్‌లో అంతే...!
posted on Jun 27, 2021 @ 8:55PM
కాంగ్రెస్‌ను ఎవరూ ఓడించనవసరంలేదు. హస్తం పార్టీని సొంత పార్టీ నేతలే ఓడిస్తారు. ఏళ్లుగా వినిపిస్తున్న ఫేమస్ డైలాగ్ ఇది. రేవంత్‌రెడ్డిని పీసీసీ ప్రెసిడెంట్‌గా ప్రకటించాక.. ఆ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి చేసిన కామెంట్లు చూశాక మరోసారి ఈ సామెత గుర్తుకు వస్తోందంటున్నారు. ఇప్పుడే పీసీసీ చీఫ్‌ను ప్రకటించారు. ఇంకా రేవంత్‌రెడ్డి బాధ్యతలు కూడా స్వీకరించనే లేదు. అప్పుడే లుకలుకలు, రుసరుసలు,, అలకలు, రాజీనామాలు మొదలైపోయాయి. కాంగ్రెస్‌లో అంతే.. అని మరోసారి రుజువు చేస్తున్నారు.
కాంగ్రెస్‌కు సీనియర్ నేత కేఎల్ఆర్ రాజీనామా చేశారు. మర్రి శశిధర్‌రెడ్డి తన పార్టీ పదవిని వదిలేశారు. ఇక పీసీసీ చీఫ్ పదవికి రేవంత్‌రెడ్డితో సమానంగా పోటీపడిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. అప్పుడే ఎర్రజెండా ఎగరేశారు. నోటికి పని చెప్పారు. రేవంత్‌తో పాటు తెలంగాణ ఇంఛార్జ్‌పై డైరెక్ట్ అటాక్ చేశారు. పనిలో పనిగా ఇక తాను గాంధీభవన్ మెట్లు ఎక్కబోనంటూ శపథం కూడా చేసేశారు.
కోమటిరెడ్డి అభ్యంతరమంతా ఒక్కటే.. మొదటి నుంచీ కాంగ్రెస్‌లో ఉన్న తనను కాదని.. టీడీపీ నుంచి వచ్చిన రేవంత్‌రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించడమేంటనేది ఆయన కడుపుమంటలా ఉంది. ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా అనేది రేవంత్‌రెడ్డి వర్షన్. ఇద్దరులో ఎవరు కరెక్ట్? రేవంత్‌రెడ్డికి తెలంగాణ వ్యాప్తంగా మంచి ఇమేజ్ ఉంది. కోమటిరెడ్డి బలమంతా ఉమ్మడి నల్గొండ జిల్లాకే పరిమితం. కేసీఆర్‌పై విమర్శలకు రేవంత్‌రెడ్డి అందరికంటే ముందుంటారు. కోమటిరెడ్డి ఎండాకాలంలో వర్షంలా అప్పుడప్పుడు అలా హడావుడి చేసి మళ్లీ సైడ్ అయిపోతుంటారు. కోమటిరెడ్డికి నల్గొండ వ్యాప్తంగా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. రేవంత్‌రెడ్డికి జిల్లాల్లోనూ అభిమాన సంఘాలు ఉన్నాయి. కోమటిరెడ్డికి కేసీఆర్‌పై ఎలాంటి వ్యక్తిగత కక్ష్యల్లాంటివి లేవు. అదే, రేవంత్‌రెడ్డి జీవితలక్ష్యం కేసీఆర్‌ను దెబ్బకొట్టడం. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోదరుడు రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరేందుకు ట్రై చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ తీరుపై పలుమార్లు బహిరంగ విమర్శలు చేశారు.
కోమటిరెడ్డి చేసిన అత్యంత కీలకమైన ఆరోపణ.. ఓటుకు నోటు మాదిరే.. పీసీసీ చీఫ్ పదవి అమ్ముకున్నారనే సంచలన ఆరోపణలు చేయడం కలకలం రేపుతోంది. తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్.. డబ్బులు తీసుకొని ప్రెసిడెంట్ పదవిని అమ్ముకున్నారంటూ పరోక్షంగా హైకమాండ్‌పైనే ఆరోపణలు చేసి కాంట్రవర్సీకి కేరాఫ్‌గా మారారు. రేవంత్‌రెడ్డి పొలిటికల్ కెరీర్‌లో ఉన్న ఏకైక మచ్చ.. ఓటుకు నోటు కేసు. అందుకే, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆ ఇష్యూనే మెయిన్‌గా టార్గెట్ చేస్తూ రేవంత్‌పై విమర్శలు గుప్పించడం కాంగ్రెస్‌లో కలకలం రేపుతోంది. టీపీసీసీని టీటీడీపీగా మార్చేశారంటూ.. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పని ఖతం అనే అర్థం వచ్చేలా వెంకట్‌రెడ్డి కామెంట్లు చేశారు. చంద్రబాబే రేవంత్‌రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇప్పించారంటూ మరింత కాక రేపారు.
కోమటిరెడ్డి విమర్శలపై అప్పుడే అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లిపోయాయని చెబుతున్నారు. కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై హైకమాండ్ సైతం సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, తాను మాత్రం కాంగ్రెస్‌ను వీడేది లేదని.. తననెవరూ కలవద్దొంటూ తన ఇలాఖాలో పాదయాత్రకు సిద్ధమయ్యారు కోమటిరెడ్డి. అయితే, తాను అందరినీ కలుపుకొని వెళ్తానని.. తనకు ఎవరితోనూ విభేదాలు లేవంటూ రేవంత్‌రెడ్డి కూల్‌గా స్టేట్‌మెంట్ ఇవ్వడం కొసమెరుపు.