కర్ణాటక కాంగ్రెస్ లో లొల్లీ.. డీకే, సిద్దూ మధ్య ఫైట్..
posted on Jun 28, 2021 @ 1:40PM
కర్ణాటక శాసన సభ ఎన్నికలకు కొంచెం అటూ ఇటుగా రెండు సంవత్సరాల సమయం ఉంది. అయితే, ఇంతలోనే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో కుర్చీలాట మొదలైంది ... పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయి, రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రి ఎవరు, కౌన్ బనేగా సీఎం అంటూ చొక్కాలు చించుకుంటున్నారు. అవును, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కొంచెం చాలా ఎక్కువ. అలాగే, అంతర్గత కుమ్ములాటలు కూడా కొంచెం ఎక్కువ. అందుకే ఎవరి అభిప్రాయాన్ని వారు స్వేచ్చగా చెపుతున్నారు, అందులో తప్పేముంది అనుకుంటే అనుకోవచ్చును. కానీ, ఇద్దరు ముఖ్యనేతలు, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సిద్దరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ వర్గాల మధ్య ఇప్పటినుంచే ముఖ్యమంత్రి పదవి కోసం మాటల యుద్ధం మొదలైంది. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే, పార్టీ విజయావకాశాలను దెబ్బ తీస్తుందని, పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్త పరుస్తున్నాయి.
గత వారం పది రోజులుగా, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత సిద్దరామయ్య అనుచరులు, కాబోయే ముఖ్యమంత్రి సిద్దరామయ్య అంటూ ప్రకటనలు చేస్తున్నారు. సిద్దరామయ్య వర్గం ఎమ్మెల్యేలు చేస్తున్న ప్రకటనలు సహజంగానే, పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న మరో ముఖ్య నేత శివకుమార్’ను ఇబ్బందికి గురిచేస్తున్నాయి.ఇదలా ఉంటే తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ అధికార వెబ్సైటులో శివకుమార్ పేరు ముఖ్యమంత్రి అభ్యర్ధిగా రావడంతో, కొత్త దుమారం మొదలైంది. సిద్దరామయ్యా వర్గం పార్టీలో ఆయన స్థానం ఏంటో తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎల్పీ నేత సిద్దరామయ్య, పీసీసీ చీఫ్ శివకుమార్ వర్గాల మధ్య ముఖ్యమంత్రి పదవి కోసం సాగుతున్న అంతర్గత కుమ్ములాటలు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఏ మాత్రం రుచించడం లేదు. ముందు ఎన్నికలలో గెలిస్తే కదా, ముఖ్యమంత్రి ఎవరన్న ప్రశ్న వచ్చేది, అనతవరాకు అయినా ఆగలేరా అంటూ నాయకులు కార్యకర్తలు నేతలను ప్రశ్నిస్తున్నారు. ఆందోళన వ్యక్తపరుస్తున్నారు.
బీజేపీలోని అంతర్గత కుమ్ములాటలను అనుకూలంగా మలచుకోవలసిన సమయంలో కాంగ్రెస్ అగ్రనేతల అనుచరుల మధ్య వివాదం అసలుకే మోసం తెచ్చేల ఉందని పార్టీ సీనియర్ నాయకులు వాపోతున్నారు. అంతర్గత కుమ్ములాటల కారణంగానే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఫలితాలను సాధించలేక పోయింది. అంతర్గత కుమ్ములాటల కారణంగానే,2019 లో కాంగ్రెస్- జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది, అని సీనియర్ నేతలు గుర్తు చేస్తున్నారు. మరో వంక పార్టీలో పుట్టి పెరిగిన వారికంటే, ఇతర పార్టీల నుంచి వచ్చిన సిద్దరామయ్య వంటి వారికి వారికి ప్రాధాన్యత ఇవ్వడం వలన, పార్టీ నిర్మాణంలో రాళ్లెత్తిన కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయి అన్న భావన పార్టీలోని ఒక వర్గం బలంగా వినిపిస్తోంది.
ఇక సిద్దరామయ్యను కాబోయే సీఎంగ ప్రొజెక్ట్ చేస్తున్న అయన అనుచరులు, ప్రభుత్వ వ్యతిరేకను పెద్దగా చేసి చూస్తున్నారని, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నిజమే, ప్రభుత్వ వ్యతిరేకత మెల్ల మెల్లగా పెరుగుతోంది, అయితే, ఎన్నికల సమయానికి అది ఎటు మొగ్గుచూపుతుందో ఇప్పుడే చెప్పలేమని, ఇలాంటి పరిస్థితిలో అధికారంలోకి వచ్చేసినట్లే లెక్కలు కట్టడం ఆత్మహత్యా సాదృశ్యం కాగలదని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరో వంక కాంగేస్ ఎమ్మెల్యే ఒకరు, “కాంగ్రెస్ పార్టీ మనుగడకు, మెరుగైన ఫలితాలు సాధించేందుకు సిద్దరామయ్యకు ఉన్న జనాకర్షణ శక్తి అవసరం, అదే సమయంలో శివకుమార్ ఎన్నికల వ్యూహ రచనా కూడా అంతే అవసరం. ఆ ఇద్దరు ఒకటిగా కలిసి పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలు మరింత దగ్గరవుతాయి” అన్నారు.
కాగా ఇద్దరి మధ్య విబేధాల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని, ఇద్దరికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలని లేదంటే, ఆ ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం పార్టీ విజయావకాశాలను దెబ్బతీస్తుందని పార్టీ ఎమ్మెల్యే ఒకరు పేర్కొన్నారు. పార్టీ సంప్రదాయం ప్రకారం కేపీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేసులో ఉంటారు. ఆవిధంగా చూస్తే, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే, శివ కుమార్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అయితే అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేందుకు, శివకుమార్, సిద్ద్దరామయ్య ఒకటిగా పనిచేయవలసి ఉంటుందని, పార్టీ కార్యకర్తలు నాయకులను ఏకతాటిపై నడిపించవలసి ఉంటుందని, విశ్లేషకులు భావిస్తునారు. ముఖ్యంగా అధిష్టాన వర్గం జోక్యంచేసుకుని, ఇద్దరి మధ్య గల విబేధాలను ఎంత త్వరగా పరిష్కరిస్తే అంత మంచిదని పార్టీ నాయకులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ అధిష్టానం జోక్యం చేసుకుంటుందా? ఆ ఇద్దరి మధ్య సయోధ్య సాధ్యమవుతుందా? ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందా? అన్నీ అనుకున్నట్లు జరిగితే.. కౌన్ బనేగా సీఎం ? అదే పెద్ద ప్రశ్న .. ది బిగ్ క్వశ్చన్ ..