కేసీఆర్ టార్గెట్ గా ఉద్యమకారుల ఉమ్మడి వేదిక.. హుజురాబాద్ లో త్వరలో భారీ సభ..
posted on Jun 27, 2021 @ 5:53PM
తెలంగాణ రాజకీయాలన్ని ప్రస్తుతం హుజురాబాద్ కేంద్రంగానే జరుగుతున్నాయి. ఉప ఎన్నికకు ఇంకా చాలా సమయం ఉన్నా పార్టీలన్ని అప్పుడే దూకుడు పెంచాయి. కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన తర్వాత బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. ఉప ఎన్నిక ద్వారా కేసీఆర్ పై కసి తీర్చుకోవాలని భావిస్తున్నారు. అంతేకాదు తెలంగాణ ఆత్మగౌరవానికి , కేసీఆర్ అహంకారానికి మధ్య పోటీ జరుగుతుందని చెబుతున్నారు. హుజురాబాద్ లో టీఆర్ఎస్ ను ఓడించడం ద్వారా తెలంగాణ ప్రజలను గెలిపిస్తానంటున్నారు ఈటల. అటు టీఆర్ఎస్ కూడా హుజురాబాద్ లో తన బలగాన్ని మోహరించింది. ఎట్టి పరిస్థితులోనూ ఈటలను ఓడించేందుకు పావులు కదుపుతోంది. మండలాల వారీగా మంత్రులను ఇంచార్జులుగా నియమించారు గులాబీ బాస్. తమకు సవాల్ గా మారిన హుజురాబాద్ ఉప ఎన్నికల గెలుపు కోసం అధికార పార్టీ వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు సిద్ధమవుతుందనే ఆరోపణలు వస్తున్నాయి.
తెలంగాణ ఉద్యమకారులు కూడా హుజురాబాద్ ఎన్నిక రాష్ట్రానికి అత్యంత కీలకమని భావిస్తున్నారు. తెలంగాణలో ఏడేండ్లుగా నియంతృత్వ పాలన సాగుతుందని ఆరోపిస్తున్న ఉద్యమకారులు... హుజురాబాద్ లో కేసీఆర్ కు తగిన బుద్ది చెప్పేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. హుజురాబాద్ లో టీఆర్ఎస్ గెలిస్తే.. కేసీఆర్ నియంతృత్వం మరింత పెరుగుతుందని, ఆయన నుంచి రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరని చెబుతున్నారు. ఉద్యమంలో జరిగిన ఘటనలు, కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలు, గత ఏడేండ్లుగా సాగుతున్న టీఆర్ఎస్ పాలనపై పూర్తి అవగాహనతో ఉన్న ఉద్యమకారులు.. తామే నేరుగా రంగంలోది దిగాలని డిసైడయ్యారు. హుజూరాబాద్ కేంద్రంగా ప్రజాస్వామ్య వేదిక ఏర్పాటు చేయబోతున్నారు. నియోజకవర్గంలో ఇంటింటికి తిరిగి కేసీఆర్ కు, టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు.
తెలంగాణ ఉద్యమకారుడు, మాజీమంత్రి ఏ.చంద్రశేఖర్ నివాసంలో ఆదివారం ఉద్యమకారులు సమావేశమయ్యారు. స్వామిగౌడ్, ఎమ్మెల్యే యన్నం శ్రీనివాసరెడ్డి, గాదె ఇన్నయ్య, బెల్లయ్య నాయక్, కపిలవాయి దిలీప్ కుమార్, బండి సాదానంద్, రాములు నాయక్, రాణి రుద్రమ్మ తదితరులు హాజరయ్యారు. అద్దంకి దయాకర్ తో పాటు మరికొందరు ఉద్యమ నేతలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ అభిప్రాయాలు పంచుకున్నారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో కలిసి వస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదని వారంతా అభిప్రాయపడ్డారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాల సాధన కోసం ఉద్యమకారులంతా ఒకే వేదిక మీదకు రావాలని పిలుపిచ్చారు. హుజూరాబాద్‌లో ఉద్యమకారులతో భారీ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికను ఉద్యమకారులు అవకాశంగా తీసుకోవాలని స్వామిగౌడ్ అన్నారు. ఈటల గెలుపు కోసం ఉద్యమకారుల్ని ఏకం చేస్తున్నామని చెప్పారు, కేసీఆర్ పాలనలో ప్రజ్వాస్వామ్యం మంట కలిసిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని బతికించటానికే ఉద్యమకారులు సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సీఎం పదవి ఇస్తేనే దళితులు కేసీఆర్‌ను నమ్ముతారని చంద్రశేఖర్ అన్నారు. దళితులతో రాజకీయాలు చేయటం మానుకోవాలని సూచించారు. హుజూరాబాద్ ఎన్నికల కోసమే దళితులపై కేసీఆర్ ప్రేమ చూపిస్తున్నారని చెప్పారు.