కుటుంబంలో జగనన్న చిచ్చు! అత్తపై వేడి నూనే పోసిన కోడలు..
posted on Jun 27, 2021 @ 4:44PM
ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాలు ఎక్కువగానే అమలవుతున్నాయి. అర్హులను గుర్తించి నేరుగా వారి ఖాతాల్లోనే నగదు జన చేస్తోంది జగన్ రెడ్డి సర్కార్. అయితే ప్రభుత్వ పథకాలు కొన్ని కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నాయి. సర్కార్ అందించిన నగదు విషయంలో గొడవలు పడుతున్నారు. కృష్ణా జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. నగదు కోసం అత్తా, కోడలు గొడవ పడ్డారు. ఈ ఘటనలో అత్తపై కోపంతో కోడలు వేడి నూనే పోసిందని తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ప్రభుత్వం ఇటీవలే వైఎస్ఆర్ చేయూత పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల ఖాతాల్లో రూ.18,750 చొప్పున జమ చేసింది. కృష్ణాజిల్లా గుడివాడ శివారులోని మందపాడుకు చెందిన చుక్కా లక్ష్మి బ్యాంక్ అకౌంట్ లో కూడా వైఎస్ఆర్ చేయుత నగదు డబ్బులు పడ్డాయి. దీంతో ఆ డబ్బులు ఇవ్వాల్సిందిగా కోడలు స్వరూప గొడవకు దిగింది. ఈ క్రమంలో అత్త లక్ష్మి నిద్రిస్తుండగా.. కోడలు స్వరూప వేడివేడి నూనెపోసి హత్యాయత్నం చేసింది. స్థానికులు ఆమెను గుడివాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు కొడుకు చుక్కా శివ నారాయణ, కోడలు లక్ష్మీలను అరెస్ట్ చేసి వారిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు