హుజురాబాద్ బరిలో పొన్నం? ఉత్తమ్ కు రేవంత్ షాక్?
posted on Jun 28, 2021 @ 11:06AM
తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారిన హుజురాబాద్ నియోజకవర్గంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ ఉంటుందని భావిస్తుండగా.. తాజాగా జరిగిన పరిణామాలతో సీన్ మారిపోయింది. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకంతో హుజురాబాద్ కాంగ్రెస్ లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. అంతేకాదు హుజురాబాద్ ఉప ఎన్నిక విషయంలోనూ రేవంత్ రెడ్డి పక్కా ప్రణాళికతో ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన అభ్యర్థిని కూడా డిసైడ్ చేసి పెట్టుకున్నట్లు చెబుతున్నారు. హుజురాబాద్ లో జరిగే త్రిముఖ పోరులో విజయం సాధించేలా రేవంత్ రెడ్డి స్కెచ్ వేశారని సమాచారం.
పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డికి తొలి సవాల్ హుజురాబాద్ ఉప ఎన్నికే కానుంది. అది తొలి పోటీని తీవ్రంగా తీసుకుంటున్న రేవంత్ రెడ్డి.. ఎలాగైనా కాంగ్రెస్ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో ఉన్నారు. అందుకే ఉప ఎన్నికలో తన సన్నిహితుడైన పొన్నం ప్రభాకర్ వైపే రేవంత్ మొగ్గు చూపుతున్నారని సమాచారం. ఇప్పటివరకు హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బంధువు కౌశిక్ రెడ్డి పేరు బలంగా వినిపించింది. అయితే దేవరయాంజల్ భూముల విషయంలో కాంగ్రెస్ లైన్‌కు వ్యతిరేకంగా కౌశిక్ రెడ్డి పనిచేయడం, ఒక కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ తో కౌశిక్ రెడ్డి మంతనాలు జరపడంతో.. టీఆర్ఎస్‌కు తొత్తుగా ఆయన వ్యవహరిస్తున్నానే టాక్ నడించింది. దీంతో కౌశిక్ రెడ్డికి హుజురాబాద్ టికెట్ ఇచ్చే అవకాశాలు లేవనే చర్చ నియోజకవర్గంలో జోరుగా జరుగుతోంది.
గతంలో కరీంనగర్ ఎంపీగా పనిచేశారు పొన్నం ప్రభాకర్. తెలంగాణ ఉద్యమంలో అత్యంత చురుకుగా వ్యవహరించారు. తెలంగాణ బిల్లు లోక్ సభలో పెట్టిన రోజున జరిగిన గొడవలో గాయపడ్డారు పొన్నం ప్రభాకర్. అందుకే పొన్నం ప్రభాకర్ ను తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించింది హైకమాండ్. ఇటీవల కాలంలో ఎంపీ రేవంత్ రెడ్డికి మద్దతుగా ఉంటున్నారు పొన్నం. రాజీవ్ రైతు భరోసా యాత్ర ముగింపు సభకు సీనియర్లు వద్దన్నా.. పొన్నం ప్రభాకర్ మాత్రం హాజరై రేవంత్‌కు సపోర్ట్ చేశారు. దీంతో పొన్నం ప్రభాకర్‌కు హుజురాబాద్ టికెట్‌ను కేటాయించే యోచనలో రేవంత్ ఉన్నట్లు సమాచారం.టికెట్ ఇవ్వడంతో కాదు గెలిపించి తీరుతానని తమ అనుచరులతో రేవంత్ రెడ్డి చెబుతున్నారట.
మరోవైపు బలమైన నేతగాఉన్న ఈటలను ఓడిచేందుకు అధికార టీఆర్ఎస్ కూడా తీవ్ర ప్రయత్నాలే చేస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థిగా శనివారం మంత్రి హరీష్ రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్న కోరం సంజీవరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కాంగ్రెస్ టికెట్ పొన్నం ప్రభాకర్ కు ఇస్తే.. ప్రస్తుత ఇంచార్జ్ గా ఉన్న కౌశిక్ రెడ్డి భవిష్యత్ ఏంటన్న చర్చ జరుగుతోంది. మూడు రోజుల క్రితమే హుజురాబాద్ లో భారీ ర్యాలీ తీశారు కౌశిక్ రెడ్డి. గ్రామాల్లో జోరుగా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో టికెట్ రాకపోతే ఆయన కాంగ్రెస్ లో ఉండకపోవచ్చని, గులాబీ కండువా కప్పుకునే అవకాశం ఉందనే ప్రచారం ఉంది. కౌశిక్ రెడ్డికి కాకుండా పొన్నం ప్రభాకర్ కు హుజురాబాద్ టికెట్ ఇస్తే... ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా రేవంత్ రెడ్డి చెక్ పెట్టినట్లేననే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది.