తెరపైకి ఓటుకు నోటు కేసు? రేవంత్‌రెడ్డి మెడకు వేలాడే కత్తి!
posted on Jun 28, 2021 @ 1:09PM
రేవంత్‌రెడ్డి. టీపీసీసీ ప్రెసిడెంట్. ఆయన పేరు అధిష్టానం ప్రకటించిందో లేదో వెంటనే ఓటుకు నోటు అంశం ప్రస్తావించారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రస్థానంలో మాయని మచ్చగా మారింది ఓటుకు నోటు ఎపిసోడ్. అది ఎల్లప్పుడూ సీఎం కేసీఆర్ చేతిలో బ్రహ్మాస్త్రమే. రేవంత్‌రెడ్డితో తనకు ఎసరు వస్తుందనుకునే సందర్భంలో ఓటుకు నోటు కేసు మళ్లీ బయటకు తీసే అవకాశం ఉందంటున్నారు. సరైన సమయం వచ్చినప్పుడు ప్రయోగించడానికే.. ఆ కేసును బ్రహ్మాస్త్రంలా తన అమ్ముల పొదిలో కేసీఆర్ దాచారని చెబుతున్నారు. కేసీఆర్ కావాలనుకున్నప్పుడు ఆ కేసులో మళ్లీ కదలిక వస్తుందంటున్నారు. తాజాగా, రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ కావడంతో ఓటుకు నోటు కేసు మళ్లీ తెరమీదకు వస్తుందా? అనే అనుమానం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
కొన్ని వారాలుగా రేవంత్‌రెడ్డి పేరు పీసీసీ అధ్యక్ష పదవికి బలంగా వినిపించింది. రేవంత్ పేరు దాదాపు ఖరారంటూ వార్తలు వచ్చాయి. సీనియర్లు ఢిల్లీలో మకాం వేసి.. రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా లాబీయింగ్ చేస్తున్న సమయమది. సరిగ్గా అదే టైమ్‌లో అనూహ్యంగా ఓటుకు నోటు కేసులో మళ్లీ కదలిక వచ్చింది. ఏసీబీ నివేదిక మేరకు ఆ కేసులో ఈడీ ఛార్జిషీట్ ఫైల్ చేసింది. అయితే, అందులో చంద్రబాబు పేరు తొలగించడం ఆసక్తికర పరిణామం. మరోవైపు, ముందుగా తనపై విచారణ వద్దంటూ రేవంత్‌రెడ్డి సుప్రీంకోర్టునూ ఆశ్రయించారు. ఇలా.. పీసీసీ రేసులో రేవంత్‌రెడ్డి పేరు వినిపిస్తున్న సమయంలోనే ఓటుకు నోటు కేసులో కాస్త హడావుడి రావడం కాకతాళీయమా? లేక, కావాలనా? అనే అనుమానం వినిపిస్తోంది. రేవంత్‌రెడ్డి పీసీసీ ప్రయత్నాలకు గండికొట్టేందుకే.. ఆ సమయంలో ఆ కేసును కదిలించారని అంటున్నారు. ఆ కేసును బూచీగా చూపించి.. రేవంత్‌రెడ్డికి పీసీసీ పీఠం దక్కకుండా చేయాలనే ఎత్తుగడ కావొచ్చని అనుమానిస్తున్నారు. ఇవేవీ, రేవంత్‌రెడ్డి ప్రమోషన్‌ను అడ్డుకోలేకపోయాయి. పీసీసీ వరమాల ఆయన మెడలోనే పడింది. అయితే, తనకు దక్కని పీఠం రేవంత్‌కు దక్కిందనే అక్కస్సుతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మళ్లీ ఓటుకు నోటు ప్రస్తావన తీసుకొచ్చారని అంటున్నారు. అదొక్కటి మినహా రేవంత్‌రెడ్డిపై బురద జల్లడానికి ఆయన దగ్గర మరే విషయమూ లేదని మండిపడుతున్నారు.
అయితే, ఇక్కడ మరో విశ్లేషణ కూడా చర్చకొస్తోంది. ఓటుకు నోటు కేసు ఇంకా ఓపెన్‌గా అలానే ఉంది. ఆ కేసులో పక్కా వీడియో సాక్షం కూడా ఉంది. అదే కేసులో రేవంత్ ఓమారు జైలుకు కూడా వెళ్లొచ్చారు. ఇటు ఏసీబీ, అటు ఈడీ ఆ కేసును డీల్ చేస్తున్నాయి. అసెంబ్లీ స్పీకర్ టేబుల్ మీద కూడా ఆ కేసు అలానే పెండింగ్‌లో ఉంది. ఏసీబీ రాష్ట్ర పరిధిలోని విచారణ సంస్థ. ఈడీ కేంద్ర ఆధీనంలో ఉంటుంది. ఎంత కాదన్నా.. ప్రభుత్వ కనుసన్నల్లోనే ఆ కేసు ఫలితం ఉంటుందనేది ఓ ఆరోపణ. ఆ లెక్కన,, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కాంగ్రెస్ పార్టీనే ప్రధాన శత్రువు. కాంగ్రెస్ ముక్త్ భారత్ బీజేపీ ఏకైక లక్ష్యం కాబట్టి.. భవిష్యత్‌లో రేవంత్‌రెడ్డి కీలక పొజిషన్‌కు చేరుకుంటే.. ఓటుకు నోటు కేసులో ఈడీ దర్యాప్తుతో ఉచ్చు బిగుసుకునే అవకాశం లేకపోలేదు. ఇటు, కేసీఆర్ సర్కారు సైతం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏసీబీ విచారణలో దూకుడు పెంచొచ్చు. ఇలా రేవంత్‌రెడ్డిని కట్టడి చేసేందుకు ఆయన మెడలో ఎప్పుడూ ఓటుకు నోటు కత్తి వేలాడుతూనే ఉంటుందని అంటున్నారు. అయితే, ఆ కత్తి వేటు ఎప్పుడు పడుతుందనేది.. రేవంత్‌రెడ్డి ఎదుగుదలను బట్టి ఉంటుంది. పీసీసీ చీఫ్ కాగానే ఆయనపై కేసు విచారణ స్పీడప్ కాకపోవచ్చు. కొన్నాళ్లు టైమ్ ఇచ్చి.. రేవంత్ దూకుడు పరిశీలించి.. కేసీఆర్ సీటుకు ఎసరు వస్తుందని అనిపిస్తే.. అప్పుడు మాత్రమే ఆ కేసు చిక్కుముడులు విప్పబడతాయి. అప్పటి దాకా.. అవసరమైనప్పుడు రేవంత్‌రెడ్డిని తోలుబొమ్మలాటలా కట్టడి చేసే ఆ-ధారాలు కేసీఆర్ చేతిలో భద్రంగా ఉంటాయంటున్నారు. మరి, రేవంత్‌రెడ్డి ఆ కేసు ఉచ్చు నుంచి బయటపడేందుకు ఒక్కటే ఛాన్స్. అది.. కేంద్ర, రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారడం. సో, రేవంత్‌రెడ్డి సీఎం అవడం.. ఓటుకు నోటు కేసు క్లియర్ అవడం.. రెండింటికీ లింకు ఉంటుందన్నమాట. అప్పటిదాకా ఉంటుంది రాజకీయ తమాషా....