జగన్‌రెడ్డి పాలనపై ప్రజాగ్రహం.. సీఎం బయటికొస్తే చెడుగుడే..
posted on Jun 28, 2021 @ 2:14PM
కరోనా కారణంగా చాలా కాలంగా ఎక్కడి జనాలు అక్కడే. ఏపీలో కొవిడ్ విజృంభణ భారీగా ఉండటంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. కరోనా బారిన పడితే ఏపీలో ఆసుపత్రి బెడ్లు కూడా దొరకవని, ఆక్సిజన్, మందులు లేక ప్రాణాలు పోవడం ఖాయమని.. ప్రజలే ఎవరి జాగ్రత్తలో వాళ్లు ఉన్నారు. కర్ఫ్యూతో రాష్ట్రమంతా నిర్మానుషంగా మారడంతో ఏపీ అంతా ప్రశాంతంగా ఉందనే భ్రమలో ఉన్నారు పాలకులు. తాజాగా, కేసులు తగ్గడం, కర్ఫ్యూ ఎత్తివేయడంతో సీఎం జగన్‌రెడ్డిపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. జనాలు రోడ్లపైకి వచ్చి నిరసనలు, ధర్నాలతో తమ కడుపుమంట వ్యక్తం చేస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా ఏ జిల్లాలో చూసినా.. ఆందోళనలు అట్టుడుకుతున్నాయి. సీఎం జగన్ విధానాలపై ప్రజల్లో ఆగ్రహ జ్వాల కాక రేపుతోంది. ఆ సెగ మంత్రులకూ తగులుతోంది.
2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీ ఉంటే.. పట్టుమని 10వేలతో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి గొప్పలకు పోయిన ఏపీ సర్కారుకు గూబ గూయ్‌మనేలా ఆందోళనలతో విరుచుకుపడుతున్నారు నిరుద్యోగులు. కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా నిరుద్యోగుల ధర్నాలే.. రోడ్లపై ఆందోళనలే. జగన్‌రెడ్డి డౌన్ డౌన్ అనే నినాదాలే. తాజాగా, ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌పై రాష్ట్రంలోని పలు విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో విద్యార్థి, యువజన సంఘాల నేతలు నిరసన చేపట్టారు. మంత్రులు, ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడికి యత్నించారు.
జగన్ సర్కారు మీద మీద వ్యతిరేక సెగ.. మంత్రులకు గట్టిగానే తాకింది. తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి, విజయనగరంలో మంత్రి బొత్స, విశాఖలో మంత్రి అవంతి శ్రీనివాస్, కడపలో ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా ఇళ్లను ముట్టడించారు విద్యార్థి సంఘాల నేతలు. ఏపీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి ఏబీవీపీ విద్యార్థులు ప్రయత్నించారు. విద్యార్థి సంఘాల ఆందోళనలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పలువురు విద్యార్థి నాయకులకు గృహనిర్బంధం చేశారు. నిరుద్యోగుల అరెస్టులపై అంతా భగ్గుమంటున్నారు.
ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌లో నామమాత్రంగా ఖాళీ పోస్టులను చూపించారంటూ నిరుద్యోగులు మండిపడుతున్నారు. జాబ్‌లు అడిగితే జైలుకు పంపుతారా అని ప్రశ్నిస్తున్నారు. జగనన్న వస్తే ఉద్యోగాల జాతర అన్నారని... లక్షల ఉద్యోగాలు ఉంటే పది వేలతో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారా అని మండిపడుతున్నారు. పాదయాత్రలో నిరుద్యోగులకు జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని.. ఖాళీలను భర్తీ చేసేలా జాబ్ క్యాలెండర్ మళ్లీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల ఆందోళనలతో ఆంధ్రప్రదేశ్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది.
కర్ఫ్యూ తొలగించడంతో జగన్‌రెడ్డి పాలనలో అన్యాయానికి గురవుతున్న అన్ని వర్గాలు నుంచి నిరసన వ్యక్తమవుతోంది. అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్‌ల సమస్యల పరిష్కారం కోరుతూ చిత్తూరు కలెక్టరేట్ దగ్గర ఆందోళన చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా భారీ సంఖ్యలో తరలివచ్చిన అంగన్‌వాడీ కార్యకర్తలు ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని లేదంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ఆందోళనకారులు హెచ్చరించారు.
మరోవైపు, తెనాలిలో పెట్రో ధరల పెంపును నిరసిస్తూ స్థానికులు నిరసనకు దిగారు. గాంధీ చౌక్ నుంచి మార్కెట్ సెంటర్ వరకు బైక్‌ని తాడుకు కట్టి లాగుతూ ర్యాలీ చేపట్టారు. మోటార్ సైకిల్‌ను కాల్వలో పడేసి నిరసన తెలిపారు. పెంచిన ఆయిల్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇలా, అనేక సమస్యలపై ఏపీ వ్యాప్తంగా జగన్‌రెడ్డి సర్కారుకు వ్యతిరేకంగా నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి.