కోమటిరెడ్డిపై కాంగ్రెస్ సస్పెన్షన్ వేటు ? ఏ పార్టీలో చేరబోతున్నారో..
posted on Jun 27, 2021 @ 7:59PM
పీసీసీ చీఫ్ ఎంపిక తెలంగాణ కాంగ్రెస్ లో సెగలు రేపుతోంది. రేవంత్ రెడ్డికి మద్దతుగా ఓ వైపు కేడర్ సంబరాలు చేసుకుంటుంగా.. మరోవైపు కొందరు సీనియర్లు మాత్రం కామెంట్లతో కాక రేపుతున్నారు. రేవంత్ రెడ్డి ఎంపికపై సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పీసీసీ పోస్టును పార్టీ ఇంచార్జ్ ఠాగూర్ అమ్ముకున్నారన్న ఆరోపణలపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ గా ఉందని తెలుస్తోంది. మాణిక్కం ఠాగూర్ కూడా కోమటిరెడ్డి మాటలపై ఆరా తీశారని సమాచారం. కొందరు ముఖ్య నేతలకు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్నారట ఠాగూర్. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
కోమటిరెడ్డి వ్యాఖ్యలకు కొందరు కాంగ్రెస్ నేతలు కౌంటరిచ్చారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన మహేష్ గౌడ్ .. కోమటిరెడ్డిపై తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి ఎన్నో పదవులు అనుభవించారని చెప్పారు. ఆ పదవులన్ని డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నారా అని ప్రశ్నించారు. పీసీసీ పదవిని అమ్ముకున్నారన్న వ్యాఖ్యలు తీవ్రమైనవని చెప్పారు. వెంటనే కోమటిరెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మహేష్ గౌడ్ డిమాండ్ చేశారు. లేదంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఏఐసీసీ ప్రోగామ్స్ పర్యవేక్షణ కమిటి చైర్మన్ గా నియమించబడిన మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కూడా స్పందించారు. ఏదో ఆవేశంలో కోమటిరెడ్డి మాట్లాడినట్లు ఉన్నారన్నారు. పార్టీ నేతలమంతా సమిష్టిగా పని చేసి పార్టీని అధికారంలోకి తీసుకువస్తామని తెలిపారు మహేశ్వర్ రెడ్డి.
ఢిల్లీ నుంచి సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. పీసీసీ ఎంపికపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పీసీసీ పదవి కార్యకర్తకు ఇస్తారు అనుకున్నానని కాని అలా జరగలేదన్నారు కోమటిరెడ్డి. ఓటుకు నోటు లాగా పీసీసీ పదవిని అమ్ముకున్నారని ఆరోపించారు. పార్టీలు మారిన వారికి పీసీసీ పదవి ఇచ్చారని మండిపడ్డారు. పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ డబ్బులు తీసుకొని పీసీసీ పదవిని రేవంత్ కు కట్టబెట్టారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. టి కాంగ్రెస్ ను టి టీడీపీ లాగా మార్చవద్దన్నారు. రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి రావడంలో చంద్రబాబు పాత్ర ఉందని సంచలన ఆరోపణలు చేశారు వెంకట్ రెడ్డి. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఆధారాలతో సహా బయట పెడుతానన్నారు.