తెలంగాణలో రాజకీయ సెగలు.. పాదయాత్ర చేయనున్న ముఖ్య నేతలు
posted on Jun 27, 2021 @ 7:59PM
తెలంగాణ మీడియాకు ఫుల్లు పని...జనానికి రోజూ న్యూసే...పాదయాత్రల సీజన్ వచ్చేసింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు రెడీ అవుతున్నారు పాదయాత్ర చేయడానికి. ఇప్పటికే బండి సంజయ్ హూజూరాబాద్ టార్గెట్ గా రెండు నెలల పాటు పాదయాత్ర చేయబోతున్నారు. అలాగే కాంగ్రెస్ చీఫ్ అయిన రేవంత్ రెడ్డి సైతం.. రాష్ట్రమంతా పాదయాత్ర చేసే ప్లాన్ లో ఉన్నారు. మరోవైపు కొత్త పార్టీ వైఎస్సార్టీపీ నేత షర్మిల కూడా పాదయాత్ర ప్లానింగ్ లో ఉన్నారు. ఇలా భారీ ఎత్తున పాదయాత్ర ల ప్లానింగులు నడుస్తున్నాయి. ఇది గాక కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. ఇవన్నీ మొదలైతే.. రాష్ట్రంలో సందడే సందడి. మీడియాకు కవరేజ్ చేసే పని మస్తుగా పడుతుంది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను ఓ రాజకీయ ముందడుగుగా మార్చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర చేసి.. అధికారంలోకి రావటమే కాదు...ప్రజల అవసరాలకు తగ్గట్టు సంక్షేమ పథకాలు తెచ్చారు. ఆ పాదయాత్రతో ప్రజల్లో నాయకుడిగా ఎదిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ లో సైతం తనకు ఎదురు లేకుండా చేసుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబునాయుడు పాదయాత్ర చేశారు. అయితే పాదయాత్ర తర్వాత తెలంగాణ రావటం..విభజన జరగటంతో లెక్కలు మారిపోయాయి. అయినా ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చారు. తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారీ పాదయాత్ర చేసి 2019లో అధికారంలోకి వచ్చారు. దీంతో పాదయాత్ర చేస్తే పవర్ వచ్చి తీరుతుందనే సెంటిమెంట్ వచ్చేసింది.
అయితే ఎప్పుడూ కూడా ఇలా ఒకసారే ఇద్దరు ముగ్గురు నేతలు పాదయాత్రలు చేయలేదు. ఇప్పుడు తెలంగాణలో అదే జరగబోతుంది. ఇలా రేవంత్ రెడ్డి, బండి సంజయ్, షర్మిల ముగ్గురూ పాదయాత్రలు చేస్తే.. ఆ హంగామా మామూలుగా ఉండదు. కాకపోతే కేసీఆర్ సార్ కి ఫికర్ లేకుండా పోవచ్చు..ఇంతమంది గట్టిగా చేస్తే..వాళ్లల్లో వాళ్లు ఓట్లు చీల్చుకుంటరు..మనం బాజాప్తా మళ్లీ పవర్ లోకి వస్తామనే సోచాయిస్తున్నారనే టాక్ వినపడుతోంది.బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు అధిష్టానం అనుమతి ఇప్పటికే వచ్చేసింది. ఇప్పటికే దూకుడుతో..పంచ్ డైలాగులతో బండి సంజయ్ బిజెపి నేతల్లో హైలెట్ అయిపోయారు. ఇక పాదయాత్ర కూడా చేశారంటే..తిరుగు లేకుండా పోవచ్చు. బిజెపి సీఎం క్యాండేట్ గా మరొకరికి ఛాన్స్ లేకుండా చేయొచ్చనే ప్లాన్లో ఉన్నట్లు చెబుతున్నారు.
ఇక రేవంత్ రెడ్డికి అయితే అవసరం కూడా. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా స్ట్రాంగ్ గా రేవంత్ పై మాటల దాడి చేశారు. ఏకంగా పీసీసీ ఎంపిక ఓటుకు నోటులాగే జరిగిందంటూ అధిష్టానంపై కూడా గుస్సా చూపించారు. పైగా తన జిల్లాలో పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. ఇలా స్వపక్షంలోనే విపక్షం వినపడకుండా ఉండాలంటే పాదయాత్ర సక్సెస్ కావాలి... లీడర్ గా స్ట్రాంగ్ కావాలే..అప్పుడే రేవంత్ అధికారపక్షంపై గట్టిగా పోరాడగలరు..రేవంతన్న పాదయాత్రకు హైకమాండ్ అనుమతి కూడా వస్తుందని ఆయన మనుషులు చెబుతున్నారు.
షర్మిల పార్టీ అయితే మొదటి నుంచి మార్కెటింగ్ స్ట్రాటజీలో పోతుంది. కరోనా సెకండ్ వేవ్ వచ్చి పాపం వారి ప్లాను ఖరాబు చేసింది కాని.. లేదంటే ఇంకా బాగా రక్తి కట్టించేవారు. నాన్న లాగా, అన్నలాగా పాదయాత్ర చేసేసి.. స్ట్రాంగ్ అయిపోవాలనే ఆలోచనలో షర్మిల ఉన్నట్లు గతంలోనే చెప్పారు. ఇప్పుడు ఆ పాదయాత్రను ఎప్పుడు చేయాలనే షెడ్యూల్ ఫిక్సింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. పైగా రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కావడంతో... షర్మిల మరింత తొందరపడుతున్నట్లు సమాచారం.