చంద్రబాబు నుంచి రాహుల్ వరకు.. రేవంత్‌రెడ్డి డైనమిక్ పాలిటిక్స్..
posted on Jun 27, 2021 @ 2:57PM
తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్. ఆ తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇప్పుడు ఏకంగా టి-కాంగ్ ప్రెసిడెంట్. రేవంత్‌రెడ్డికి అంత ఈజీగా రాలేదు ఈ పదవులు. నందమూరి కుటుంబమూ కాదు.. గాంధీ వారసత్వమూ లేదు. సొంత టాలెంట్‌తో ఈ స్థాయికి ఎదిగారు రేవంత్‌రెడ్డి. ఇప్పటికి జస్ట్ రెండుసార్లు మాత్రమే ఆయన ఎమ్మెల్యే. అయినా, ఓ ముఖ్యమంత్రికి ఉన్నంత పాపులారిటీ ఆయనది. ప్రస్తుతం ఎంపీగా ఉన్నా.. స్టూడెంట్ లీడర్‌గా ఉన్నప్పుడే ఆయనలో నాయకత్వ లక్షణాలు కనిపించాయి.
జెడ్‌పీటీసీ ఎన్నికలతో రాజకీయాల్లో తొలి అడుగు వేశారు. టీడీపీలో ఆయన ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. చంద్రబాబు నాయకత్వంలో రాజకీయంగా రాటుదేలారు. ఆ రోజుల్లో చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుడిగా మెదిలారు రేవంత్‌రెడ్డి. టీడీపీ అధినేత సైతం రేవంత్‌రెడ్డికి అంతే ప్రాధాన్యం ఇచ్చారు. యువకుడిగా ఉన్నప్పటి నుంచే ప్రోత్సాహం అందించారు. ఎమ్మెల్యేగా పెద్దగా అనుభవం లేకపోయినా.. పార్టీలో కీలక నేతగా రేవంత్‌రెడ్డికి గుర్తింపు ఇచ్చి.. ఆయన్ను నాయకుడిగా ప్రమోట్ చేసిన ఘనత చంద్రబాబుదే.
అప్పటికే టీడీపీలో కీలక నేతగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్‌రావుకు రేవంత్‌రెడ్డి అంటే కళ్లుమంట అంటారు. నిత్యం చంద్రబాబు పక్కనే ఉండే ఎర్రబెల్లి.. ప్రతీ సభలోనూ చంద్రబాబు పక్క సీటే కావాలని డిమాండ్ చేసే దయాకర్‌రావు.. రేవంత్‌రెడ్డికి అధినేత ఇస్తున్న ప్రాధాన్యతను చూసి ఓర్వలేదని చెబుతారు. 2014లో తెలంగాణ అసెంబ్లీలో ఎర్రబెల్లి దయాకర్‌రావును టీడీపీ ఫ్లోర్ లీడర్ చేసి.. టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రేవంత్‌రెడ్డిని నియమించారు చంద్రబాబు. రేవంత్‌రెడ్డిని ఎలాగైనా దెబ్బ తీయాలనే దురుద్దేశ్యంతో.. ఓటుకు నోటు ఆపరేషన్‌పై ప్రభుత్వానికి ఉప్పందించింది అప్పటి టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావేననే ఆరోపణ ఉంది. అదే నిజమైతే, ఎర్రబెల్లి కొట్టిన దొంగదెబ్బకు.. రేవంత్‌రెడ్డి జైలు పాలవడం.. తెలంగాణలో టీడీపీకి బాగా డ్యామేజ్ జరగడం.. దయాకర్‌రావు కారెక్కడం.. ఇప్పుడాయన మంత్రి కావడం.. ఇలా తెలంగాణలో పలు కీలక పరిణామాలు రేవంత్‌రెడ్డి కేంద్రంగానే జరిగాయని గుర్తు చేస్తున్నారు.
ఓటుకు నోటు ఎపిసోడ్ రేవంత్‌రెడ్డి పొలిటికల్ కెరీర్‌ను మరో మలుపు తిప్పింది. తాను జైలు పాలవడానికి కారణమైన కేసీఆర్‌ను ఢీ కొట్టడం టీడీపీతో సాధ్యం కాదని భావించి.. వీడలేక చంద్రబాబును వీడి.. కాంగ్రెస్‌లో చేరారు రేవంత్‌రెడ్డి. ఇక, కాంగ్రెస్ గురించి తెలిసిందేగా. అక్కడ ప్రోత్సహించే వారికంటే.. కాలుపట్టి లాగే వాళ్లే ఎక్కువంటారు. కాంగ్రెస్‌లో ఎవరి ఆట వాళ్లే ఆడుకుంటారు. అలా ఆ ఆటలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచారు రేవంత్‌రెడ్డి. కాంగ్రెస్‌లో చేరిన అనతికాలంలోనే రాహుల్‌గాంధీ దృష్టిలో పడ్డారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎదిగారు. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అందరికంటే రేవంత్‌రెడ్డినే ముందుంచారు రాహుల్. ప్రచార బాధ్యతలతో పాటు పార్టీని గెలిపించే బరువు బాధ్యతలు సైతం రేవంత్‌రెడ్డి భుజాలపైనే మోపారు. చిచ్చరపిడుగులాంటి రేవంత్‌రెడ్డిని.. సుడిగాలిలా తెలంగాణ మొత్తం తిప్పేందుకు ప్రత్యేకంగా ఆయన కోసమే ఓ హెలికాప్టర్‌ను సైతం కేటాయించింది కాంగ్రెస్ అధిష్టానం. కానీ, కేసీఆర్ రేవంత్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టి.. కేసులు, కుట్రలు, అరెస్టులతో ఆయన్ను కొడంగల్‌కే కట్టడి చేసి.. రేవంత్‌ను అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చేయడంలో సక్సెస్ అయ్యారు. అయితే, నేలకు కొట్టిన బంతిలా.. మల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా గెలిచి.. ఏకంగా పార్లమెంట్ స్థాయికి ఎదగడం రేవంత్‌రెడ్డి సత్తాకు నిదర్శనమనే చెప్పాలి.
ఓటమితో, కేసీఆర్ దూకుడుతో జవసత్వాలు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి.. మళ్లీ పునర్ వైభవం తీసుకొచ్చేందుకు కొత్త పీసీసీ నియామకానికి పూనుకుంది హస్తం పార్టీ అధిష్టానం. ఆ జాబితాలో రేవంత్‌రెడ్డి పేరే అందరికన్నా ముందున్నా.. సీనియర్లు ఓ పట్టాన ఒప్పుకోలేదు. కాంగ్రెస్‌లో అంతే. పార్టీ బాగుకంటే కూడా తమ బాగుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు నేతలు, రేవంత్ విషయంలోనూ అనేక కొర్రీలు పెట్టారు. కేసులున్నాయని.. వేరే పార్టీ నుంచి వచ్చాడని.. ఇలా సిల్లీ రీజన్స్ చెప్పారు. సీనియర్లు ఎన్నిచెప్పినా.. ప్రజా క్షేత్రంలో ఎవరి బలం ఎంతో హైకమాండ్‌కు తెలియంది కాదు. రాహుల్‌గాంధీకి సైతం రేవంత్‌రెడ్డి మీదే నమ్మకముంది. సోనియా సరేనంది. 150 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ పీసీసీ పగ్గాలు రేవంత్‌రెడ్డి చేతిలో పెట్టింది. ఆయన నెత్తిన మోయలేనంత భారం మోపింది. రేవంత్‌రెడ్డి అయితేనే కాంగ్రెస్ రథ చక్రాలను తెలంగాణ వ్యాప్తంగా దూసుకెళ్లేలా చేస్తారని.. కేసీఆర్‌ను ఢీకొట్టి గద్దెదింపే సామర్థ్యం రేవంత్‌రెడ్డికే ఉందని కాంగ్రెస్ హైకమాండ్ డిసైడ్ అయింది. అందుకే, డైనమిక్ లీడర్ రేవంత్‌రెడ్డికి పీసీసీ కిరీటం తొడిగింది.. ఇక, కేసీఆర్‌పై దండయాత్రే మిగిలింది.. కమాన్ రేవంత్.. లెట్స్ ప్రూవ్.. అంటూ సమరోత్సాహంలో ఉంది కాంగ్రెస్.