'మా'లో మజారే మజా.. సిని'మా' రాజకీయం!
posted on Jun 28, 2021 @ 12:00PM
'మా' ఎన్నిక. ఇంతకు ముందెప్పుడూ లేనంత ఉత్కంఠ. ప్రశాశ్‌రాజ్ బరిలో నిలవడమే ఇందుకు కారణం. ఆయన లోకల్ కాదంటూ ఓ వివాదం. ఆయనకు టీఆర్ఎస్ మద్దతు ఉందంటూ మరో ఆరోపణ. మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఆయనకే అనే టాక్. ప్రకాశ్‌రాజ్‌కు కౌంటర్‌గా పాలిటిక్స్ ఓ రేంజ్‌లో మొదలైపోవడంతో 'మా' ఎన్నికలు కాక రేపుతున్నాయి. తొలిసారి రాజకీయ రంగు పులుముకుంటున్నాయి.
మెగా ఫ్యామిలీకి పోటీనా అనేట్టు మంచు కుటుంబం కూడా సీన్‌లో ఎంట్రీ ఇవ్వడంతో మరింత మజా. సీనియర్ల ఆశీస్సులు తనకేనంటూ.. జూనియర్లతో కలిసి సేవ చేస్తానంటూ మంచు విష్ణు లేఖతో రిక్వెస్ట్ చేసి అందరినీ ఐస్ చేసేశారు. మోహన్‌బాబు తనయుడు కాబట్టి ఈయనకు వైసీపీ మద్దతు ఉందా అనే అనుమానం ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోంది.
సీవీఎల్. లేటైనా, లేటెస్ట్‌గా నేను సైతమంటూ పోటీకి సై అన్నారు. ఎప్పుడూ మీరు మీరేనా.. 'మా'లో మాలాంటోళ్లు ఉండొద్దా అంటూ నామినేషన్‌కు సిద్ధమైపోయారు. సీవీఎల్.. మరింత కాంట్రవర్సీ స్టేట్‌మెంట్స్ కూడా చేశారు. తెలంగాణ, ఏపీలకు వేరువేరు 'మా'లు ఉండాలని డిమాండ్ లేవనెత్తారు. టాలీవుడ్‌లో ఎన్నడూ లేనిది.. కొత్తగా ఆంధ్ర-తెలంగాణ అనే ప్రాంతీయ భావాలు సీవీఎల్ తీసుకొస్తుండటం కాక రేపుతోంది. అనూహ్యంగా ఆయనకు రాములమ్మ నుంచి సపోర్ట్ రావడం విశేషం. 'మా'లో మెంబర్ కూడా కాని లేడీ అమితాబ్ విజయశాంతి సీవీఎల్ నర్సింహారావుకు మద్దతు ఇచ్చారంటే.. ఆయనను బీజేపీ ప్రమోట్ చేస్తోందా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నడూ లేనిది.. బీజేపీ నేత విజయశాంతి సడెన్‌గా మా ఎన్నికలపై స్పందించడం, సీవీఎల్‌కు సపోర్ట్ చేయడం చూస్తుంటే తెర వెనుక ఏదో జరుగుతోందనే అనుమానం.
ఇక, ఎప్పుడూ మా అధ్యక్షులుగా మగవారేనా? మహిళలకు ఇంకెప్పుడు పట్టం కడతారంటూ.. గిరి గీచి బరిలో దిగబోతున్నారు జీవిత అండ్ హేమ. మెగా కుటుంబానికి ఝలక్ ఇచ్చేందుకే జీవిత రాజశేఖర్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనేది కొందరి మాట. గతంలోనూ ఓసారి మా వేదికపై చిరంజీవి, రాజశేఖర్ మధ్య డైలాగ్ వార్ నడిచిందని గుర్తు చేస్తున్నారు. రాజశేఖర్‌పై క్రమశిక్షణాచర్యలు తీసుకోవాలంటూ అప్పట్లో చిరంజీవి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. అందుకు రివేంజ్‌గానే ఇప్పుడు మా ఎలక్షన్‌లో జీవితారాజశేఖర్ పోటీ చేస్తున్నారనేది ఓ టాక్.
అటు, బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఇలా వెళ్లి అలా వచ్చేసిన హేమ.. ఇప్పుడు 'మా' ఇంట్లో తన అదృష్టం పరీక్షించుకోబోతున్నారు. మహిళను అధ్యక్షురాలిగా ప్రకటిస్తే మాకు ఓకే అంటూ కొన్ని స్వరాలు వినిపిస్తున్నాయి. మా ప్రస్తుత అధ్యక్షులు నరేశ్, సభ్యురాలు కరాటే కల్యాణిలాంటి వాళ్లు హేమను ఏకగ్రీవం చేయాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నారు. హేమ వెనుక పొలిటికల్ యాంగిల్ లేకపోయినా.. ఉమెన్ యాంగిల్ వర్కవుట్ చేయాలనేది ఆమె ప్లాన్.
ఇలా, గతానికి భిన్నంగా 'మా' ఎలక్షన్లలో పరోక్షంగా రాజకీయ పార్టీలు తలా ఓ చేయి, కాలు వేస్తున్నారనో అనుమానాలు వినిపిస్తున్నాయి. అయితే, ప్రకాశ్‌రాజ్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. లోకల్-నాన్‌లోకల్ వివాదం ఆయనకే అనుకూలంగా మారిందని.. ఆ ఆరోపణలో ప్రకాశ్‌రాజ్ చేసిన సేవ మరోసారి చర్చకు రావడంతో ఆయన ఇమేజ్ మరింత పెరిగిందని అంటున్నారు. అయినా, మా ఎన్నికలను డిసైడ్ చేసేది.. మెగా ఫ్యామిలీనే కానీ.. అభ్యర్థులు, ప్యానెల్ చూసి కాదనే ఓ టాక్ ఎప్పడినుంచో ఉంది. ఇండస్ట్రీకి పెద్దలుగా ఉండే చిరంజీవి-అల్లు అరవింద్-సురేశ్‌బాబు-నాగార్జున-దిల్‌రాజు లాంటి వాళ్లంతా ఒకే మాట మీద ఉంటారని.. వాళ్లు ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్లకే గెలుపు అవకాశాలనేది అక్కడ ఓపెన్ సీక్రెట్. నాగబాబు, శ్రీకాంత్‌ల ఎంట్రీతో ప్రకాశ్‌రాజ్‌కు మెగా సపోర్ట్ ఉందని తేలిపోయింది. ఇప్పుడిక ప్రకాశ్‌రాజ్ కేటీఆర్‌కు బాగా క్లోజ్ అంటూ ప్రచారం జరుగుతోంది. సో, టాలీవుడ్‌లోని తెలంగాణ బ్యాచ్ మద్దతు కూడా ఆయనకే అని అంటున్నారు. ప్రకాశ్‌రాజ్ రేసులో ముందున్నా.. మంచు విష్ణు, జీవిత, హేమ, సీవీఎల్‌లు ఎంత పోటీ ఇవ్వగలరో చూడాలి. ఏదిఏమైనా ఈసారి మా ఎన్నికలు గతానికి భిన్నంగా పొలిటికల్ కలరింగ్‌తో మస్త్ మజాగా సాగబోతున్నాయి.