టీఆర్ఎస్ లో అలకలు ..లుకలుకలు! బ్యాడ్ డేస్ మొదలైనట్టేనా..
posted on Jun 28, 2021 @ 10:28AM
ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఇటీవల వరంగల్’లో పర్యటించారు.ముఖ్యమంత్రి పర్యటన ప్రధాన లక్ష్యం ఏమిటో,అది ఎంతవరకు నెరవేరిందో, ఏమో కానీ,ఆయన పర్యటన తర్వాత అధికార పార్టీలో అలకలు, లుకలుకలు బయట పడ్డాయి. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా నర్సంపేట ఎమ్మెల్యే పెద్దిసుదర్శన్ రెడ్డి వాహనాన్ని సభా ప్రాంగణం వద్దకు అనుమతించక పోవడంతో మొదలైన రచ్చ, ఇంకా అలా కాగుతూనే ఉంది. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ఎదురైన చేదు అనుభవంపై జిల్లా రాజకీయవర్గాల్లో సీరియస్‌గా చర్చ జరుగుతోంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర రావుతో విబేధాల కారణంగానే, సుదర్శన్ రెడ్డిని కొందరు నేతలు టార్గెట్ చేసారన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
నిజానికి ఉమ్మడి వరగంల్ జిల్లాలో ఉద్యమ కాలం నుంచి సుదర్శన్ రెడ్డి పార్టీలో కీలకంగా ఉంటూ వస్తున్నారు. జిల్లాలో పార్టీ నిర్మాణంలో ఆయనదే ప్రధాన భూమిక. 2009-10 ఉద్యమం సమయంలో వరంగల్‌లో టీఆర్ఎస్ నిర్వహించిన సింహగర్జన బహిరంగ సభ ఉద్యమాన్ని కొత్త మలుపు తిప్పింది. ఆ సభ సక్సెస్’కు సుదర్శన్ రెడ్డి ఎంతో కష్టపడ్డారు. అదే విషయాన్ని ఆ నాటి సభలో స్వయంగా కేసీఆర్ చెప్పారు. సుదర్శన్ రెడ్డిని అభినందించారు. అలాంటి తమ నాయకుడికి అవమానం జరిగినా అధిష్టానం స్పందించకపోవడం పట్ల అయన అనుచరలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదలా ఉంటే, పుండు మీద కారం అద్దినట్లు, తమ బాధను చెప్పుకునేందుకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఅర్ అప్పాయింట్ కోరితే, ఇవ్వలేదు..ట. మరో వంక మరో ముఖ్య నాయకుడు, సుదర్శన్ రెడ్డినే తప్పు పట్టారని ఆయన తమ అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తపరిచిట్లు తెలుస్తోంది. వాస్తవానికి మొదటి ఎర్రబెల్లి టీడీపీలో ఉన్నప్పటి నుంచే ఇద్దరి మధ్య వైరం కొనసాగుతోంది, ఇప్పుడు అది మరింతగా ముదిరి పాకాన పడిందని అంటున్నారు.
వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ ఉప ముఖ్యమంత్రులు, కడియం శ్రీహరి,రాజయ్య మధ్య మరోసారి మాటల యుద్ధం చోటు చేసుకుంది. ప్రజా సేవ చేయడానికి పదవులు, ప్రోటోకాల్ అవసరం లేదని ఎమ్మెల్యే రాజయ్యను ఉద్దేశిస్తూ కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను కడియం పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఎమ్మెల్యే రాజయ్య వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేశారు. నియోజకవర్గానికి రావడానికి ఎవరి అనుమతి తీసుకోవాల్సిన పనిలేదని తేల్చి చెప్పారు.
స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ ప్రజలు తనకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చారని, పదవి ఉన్నా, లేకున్నా అందుబాటులో ఉండి సేవ చేయడమే తన లక్ష్యమని అన్నారు. ప్రజలకు మేలుచేసే పనులు ఎవరు చేసినా స్వాగతించి, అభినందించాలని పిలుపునిచ్చారు. కడియం శ్రీహరి నిజాయతీగా పని చేస్తాడని ప్రజల్లో తనకు గుర్తింపు ఉందన్నారు. దేవాదుల సాగునీరు గురించి మాట్లాడని వారు, దేవాదుల పట్ల అవగాహన లేని వారు హడావుడి చేయడం విడ్డురంగా ఉందని కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు. కడియం శ్రీహరి ఎమ్మెల్సీ పదవి ఈ నెల 2తో ముగిసింది. దీంతో ఆయనకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని ఇటీవల ఎమ్మెల్యే రాజయ్య ఎద్దేవా చేశారు. దీంతో రాజయ్య మాటలకు కడియం శ్రీహరి కౌంటర్ ఇచ్చారు. ప్రజాసేవ చేయాలంటే ప్రోటోకాల్ అవసరం లేదని అన్నారు. తనకు ప్రజలిచ్చిన ప్రొటోకాల్‌తో సేవ చేస్తానని తెలిపారు.
స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఒకప్పుడు కడియం శ్రీహరి, రాజయ్య రాజకీయ ప్రత్యర్థులు. రాష్ట్ర విభజనతో రాజయ్య, కడియం శ్రీహరి ఇద్దరూ టీఆర్ఎస్‌లో చేరారు. ఇద్దరూ డిప్యూటీ సీఎంలుగా పని చేశారు. అయితే వారిద్దరి మధ్య ఇంకా కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది. టీఆర్ఎస్ పెద్దలు సయోధ్య కుదర్చినప్పటికీ అంతగా ఫలించలేదు. తాజాగా వీరిద్ధరి మధ్య యుద్ధం మళ్లీ బయటపడింది.అయితే, ఈ మొత్తం వ్యవహారంలో తెరమీద సుదర్శన్ రెడ్డి,ఎర్రబెల్లి, కడియం, రాజయ్య పాత్రలు కనిపించినా, అసలు సూత్రం దారులు వేరే ఉన్నారని గులాబీ పార్టీలో వినిపిస్తున్న మాట. అంతే కాదు త్వరలోనే జిల్లాపార్టీలో అగ్నిగోళం బద్దలైనా ఆశ్చర్య పోనవసర లేదని కూడా అంటున్నారు