కోమటిరెడ్డి కామెంట్లతో రేవంత్ కే లాభమా?
posted on Jun 28, 2021 8:44AM
ఆయన దుమ్ము దులుపుతున్నానని అనుకుంటున్నాడు. చెలరేగిపోతే చింపేయొచ్చని ఫీలవుతున్నాడు. తానేసిన బాంబులతో ప్రత్యర్ధి మటాష్ అనుకుంటున్నాడు. కాని తాననుకునేది ఒకటి... జరగుతున్నది.. జరగబోయేది మరోటి. కీడు చేయాలనుకుని మాటల యుద్ధం మొదలెట్టాడు..కాని మేలు చేస్తున్నాననే ఆలోచన ఆయన బుర్రకు తట్టడం లేదు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఆవేశంతో రగిలిపోతున్నారు. ఎన్నాళ్ల నుంచో కాంగ్రెస్ పార్టీకి విశ్వాసపాత్రుడిగా ఉంటే... తనను కాదని..బయటి నుంచి జస్ట్ మూడున్నరేళ్ల క్రితం వచ్చిన రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇస్తారా అంటూ మండిపడుతున్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయాక.. ఆయన వర్గంగా ఉన్న కోమటిరెడ్డి..తర్వాత కాలంలో కాస్త సైలెంట్ అయ్యారు. విభజన తర్వాత తెలంగాణకు నాయకుడు కావాలని ఆశపడ్డారు. కాని రాహుల్ గాంధీ ఫ్రెండ్ షిప్ తో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ పదవిని ఎగరేసుకుపోయారు. అసంతృప్తితో టీఆర్ఎస్ లో వెళ్లాలని కూడా ఆలోచించారు. కేసీఆర్ అప్పటికి ఇప్పటికి టచ్ లోనే ఉన్నారు. ఎందుకనో ఏదో కుదరక.. గులాబీ జెండా జోలికి పోలేదు. ఎప్పటికైనా పీసీసీ చీఫ్ కాకపోతానా అనుకున్నారు. ఏ మాట కా మాట.. నియోజకవర్గంలో.. పని చేయడంలో మాత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్ ఫెక్ట్. ఆ విషయంలో ఎలాంటి లోపం లేదు. కాని నల్గొండ జిల్లాలో తన బలంతో... రాష్ట్రానికి నాయకుడు కావాలనుకోవడమే అత్యాశ అనే కామెంట్లు వచ్చాయి. కాని హైకమాండ్ ఎవరిని పెడితే వారే రాజు.. అందుకే ఎందుకు కాకూడదు అనుకున్నారు.
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతోనే..అదే సామాజికవర్గానికి చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి శకునం మంచిగా అనిపించలేదు. సహజంగానే దూకుడుగా ఉండే రేవంత్ రెడ్డి అదే స్టయిల్ లో వెళుతూ హైలెట్ అయిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఇమేజ్ ఉండటంతో... పీసీసీ చీఫ్ పదవికి గట్టి పోటీదారు అయ్యారు. కేసీఆర్ ను ఢీకొట్టి మళ్లీ అధికారంలోకి రావాలంటే రేవంతే కరెక్టని.. హైకమాండ్ భావించినట్లుంది..అందుకే ఇచ్చేసింది.
కాని కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఈ పరిణామం ఏ మాత్రం రుచించలేదు. ఏ శ్రీధర్ బాబుకో, జీవన్ రెడ్డికో ఇచ్చినా అంత బాధపడేవారు కాదు..కాని రేవంత్ రెడ్డికి ఇవ్వటంతోనే ఆగ్రహించారు. అందుకే విరుచుకుపడిపోయారు. అయితే కాంగ్రెస్ లో హైకమాండ్ దే తుది నిర్ణయం. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక చాలామంది ఫాలో అయిపోతారు..టైం వచ్చినప్పుడు చూసుకుందాం అనుకునేవారు కొందరు.. పైకి సైలెంట్ గా ఉండి వెనక నుంచి పావులు కదిపేవారు మరికొందరు. కాని వెంకటరెడ్డి వ్యాఖ్యలతో... రేవంత్ అంటే ఇష్టమున్నా లేకపోయినా.. ఖండనలతో బయటికి రావాల్సి వచ్చింది. అంటే ఒక విధంగా రేవంత్ రెడ్డిపై ఘాటు కామెంట్లు చేసి...మిగతా నేతలందరిని రేవంత్ కు మద్దతుగా ఉన్నారనేలా రియాక్షన్స్ వచ్చేలా చేశారు. అంటే రేవంత్ రెడ్డికి మేలే చేశారు.. చేస్తున్నారు.