ష్ గప్‌చుప్.. అసమ్మతి ఖతం!.. ఇక బాహుబలి రేవంత్‌రెడ్డి..
posted on Jun 30, 2021 @ 11:51AM
ఎన్నెన్ని మాటలు అన్నారు.. ఎన్నెన్ని విమర్శలు చేశారు.. అధిష్టానానికి ఎన్నెన్ని చాడీలు చెప్పారు.. ఎన్నెన్ని కుటిల ప్రయత్నాలు చేశారు.. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా.. అన్నిటినీ పటాపంచలు చేసుకొని.. బాహుబలిలా యుద్దం చేసి పీసీసీ పీఠం ఎగరేసుకుపోయారు రేవంత్‌రెడ్డి. ఆయన టీడీపీ నుంచి వచ్చిన వాడు.. అతను చంద్రబాబు ఏజెంట్.. మేం కాంగ్రెస్‌లో మొదటి నుంచీ ఉన్నవాళ్లం.. నిన్నగాక మొన్న వచ్చిన వాడికి పీసీసీ పగ్గాలు అప్పగిస్తారా అంటూ సో కాల్డ్ సీనియర్స్ నానా రచ్చ చేశారు. మమ్మల్ని కాదని రేవంత్‌ను పట్టం కడితే.. తమ దారి తాము చూసుకుంటామంటూ బ్లాక్ మెయిల్ కూడా చేశారు. ఎన్ని బెదిరింపులు చేసినా.. ఎన్ని డ్రామాలు చేసినా.. రేవంత్‌రెడ్డి ప్రమోషన్‌ను అడ్డుకోలేకపోయారు. అధిష్టానం రేవంత్‌నే నమ్మింది. ఆయనే సమర్థులడని డిసైడ్ అయింది. పీసీసీ చీఫ్‌ను చేసింది. మరిప్పుడు సీనియర్ల పరిస్థితి ఏంటి? పార్టీని వీడతారా? రేవంత్‌కు సహాయ నిరాకరణ చేస్తారా?
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. తనకే పీసీసీ పీఠం కావాలంటూ.. మొదటి నుంచీ రేవంత్‌రెడ్డి పేరును గట్టిగా వ్యతిరేకించిన నేత. అందుకే, ఆ అక్కసుతోనే ఢిల్లీ నుంచి రాగానే.. ఓటుకు నోటు, అమ్ముకున్నారు, టీపీసీసీని టీటీడీపీ చేస్తారు, హుజురాబాద్‌లో డిపాజిట్ తెచ్చుకోండి.. ఇలా నోటికొచ్చినట్టు ఆడిపోసుకున్నారు. గాంధీభవన్ మెట్లు ఎక్కనంటూ.. పాదయాత్ర చేస్తానంటూ బింకానికి పోయారు. కట్ చేస్తే.. హైకమాండ్ గట్టి షంటింగ్ ఇచ్చింది. మనోడు ఆ మర్నాటికే సైలెంట్ అయిపోయాడు. తనను రాజకీయాల్లోకి లాగొద్దంటూ లేఖతో లెంపలేసుకున్నారు. సో, ముఖ్యమైన అసమ్మతి వికెట్ డౌన్.
ఇక, రేవంత్‌రెడ్డిపై మొదటి నుంచి నానా న్యూసెన్స్ చేస్తున్న సీనియర్ మోస్ట్ జూనియర్ లీడర్ హనుమంతన్న. గిదేందిరా బై అంటూ.. రేవంత్ ఫ్యాన్స్ తనకు వార్నింగ్ ఇస్తున్నారంటూ.. కాంగ్రెస్ పార్టీ ఆగమై పోతోందంటూ.. గాంధీభవన్‌లో కార్తీకదీపం సీరియల్ తరహాలో రక్తకన్నీరు పెట్టుకున్నారు. అతి గడుసుతనానికి ఏడుపు ఎక్కువనుకున్నారేమో.. పాపం వీహెచ్ ఆవేదనను ఎవరూ అర్థం చేసుకోలేదు. పీసీసీ అధ్యక్షపదవి దక్కిన వెంటనే.. తన వల్ల అంతగా బాధపడిన ఆ పెద్దాయను.. ఆసుపత్రి ఐసీయూలోకి వెళ్లి మరీ ఓదార్పు యాత్ర చేశారు రేవంత్. ఐస్‌లా కరిగిపోయిన హనుమంతు.. రేవంతుకు ఆల్‌ది బెస్ట్ చేప్పేశారు. సెకెండ్ వికెట్ ఆల్‌సో డౌన్.
పొన్నాల లక్ష్మయ్య, జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, మధు యాష్కీగౌడ్‌లాంటి వాళ్లు పీసీసీ నాయకుడిగా ఎవరున్నా అడ్జస్ట్ అయిపోతారు. పార్టీకి విధేయులుగా అలా పడుంటారు అంతే. వారు రేవంత్‌కు సహకరిస్తారంతే. ఇక అసమ్మతి బ్యాచ్‌లో మరోనేత జగ్గారెడ్డి. ఆయన రేవంత్‌రెడ్డిని మొదటినుంచి వ్యతిరేకిస్తున్నారు. కారు ఎక్కాలనే సాకుతోనే ఆయనలా చేస్తున్నారని అంటారు. జగ్గన్న కేసీఆర్‌తో టచ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. మరో కీలక నేత సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క. క్లాస్ లీడర్ అనే మేకప్‌లో ఎప్పుడు కాంగ్రెస్ కోసమే పని చేస్తారు. ఆయన గొనుగుతారు, నసుగుతారే కానీ.. గట్టిగా అసమ్మతి స్వరం వినిపించే నాయకుడు కాదంటారు. మొదటి నుంచీ కేసీఆర్‌తో సాఫ్ట్ వైఖరితోనే ఉన్నారని.. ఆయన కాంగ్రెస్‌లో ఉన్నా టీఆర్ఎస్‌లో ఉన్నట్టే భావిస్తారని అంటారు. ఇటీవల ప్రగతి భవన్ వెళ్లి పార్టీ లైన్‌ను క్రాస్ చేశారని.. ఆయన ప్రస్తుతానికి గోడ మీద పిల్లిలా ఎటు ఉండాలో తేల్చుకోలేక పోతున్నారనే టాక్ నడుస్తోంది.
ఇలా, ఇప్పటి వరకూ హంగామా చేసిన సీనియర్లంతా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. పీసీసీ చీఫ్‌గా రేవంత్ పేరు ప్రకటించేశాక.. ఇక చేసేది ఏముంటుందని.. చెప్పిన పని చేయడమే కదాని డిసైడ్ అయిపోయారు. బాహుబలిలాంటి రేవంత్‌రెడ్డికి ఎదురెళ్లితే తమకే డ్యామేజ్ జరుగుతుందని.. ఆయన నాయకత్వంలో పని చేస్తే.. పార్టీ అధికారంలోకి వస్తే.. కనీసం మంచి మంత్రి పదవులైనా ఆశించొచ్చనే ఆశతో అడ్జస్ట్ అయిపోతున్నారు. రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ అయితే.. కాంగ్రెస్‌లో సునామీ వస్తుందని ఆశపడిన ప్రత్యర్థులంతా.. ఇప్పుడిలా పార్టీ నిండు కుండలా తొనగకుండా.. ఠీవిగా నిలబడటంతో అంతా అవాక్కవుతున్నారు. రేవంత్‌రెడ్డా మజాకా అంటూ కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.