విశాఖ మొత్తం విజయసాయిదేనా!
posted on Jun 30, 2021 @ 12:23PM
విశాఖపట్నంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ఓవరాక్షన్ ఎక్కువైందనే ఆరోపణలు వస్తున్నాయి. జూలైలోనే విశాఖ కేంద్రంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని ప్రకటనల మీద ప్రకటనలు చేస్తున్న వైసీపీ నేతలు.. తమ చర్యలతో నగరవాసులకు చికాకు తెప్పిస్తున్నారని అంటున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర రాజుగా ఫీలవుతున్నారనే ఆరోపణలు ఉన్న ఎంపీ విజయసాయి రెడ్డి వ్యవహారం రోజురోజుకు జుగుప్సాకరంగా మారుతుందనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఆయన జన్మదినం సందర్భంగా నగరంలో చేస్తున్న హంగామా చూసి జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు.
విశాఖపట్నంలో ఎక్కడ చూసినా విజయసాయి రెడ్డి హోర్డింగ్స్, కటౌట్లు, ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. జులై 1న విజయసాయి జన్మదినం సందర్భంగా ఆయన అభిమానులు, నాయకులు, కార్యకర్తలు నగరంలో భారీగా హోర్డింగ్స్, కటౌట్లు ఏర్పాటు చేశారు. నగరమంతా ఆయన ఫోటోలతో నింపేశారు. వైసీపీ నాయకులు పోటా పోటీగా నగరంలో ఎక్కడపడితే అక్కడ వాటిని ఏర్పాటు చేశారు. ఇది విశాఖపట్నమా? విజయసాయి పట్నమా? అన్నట్లుగా ఆయన ఫోటోలతో ఏర్పాట్లు చేశారు. అసలు వాటికి అనుమతులు ఉన్నాయా? అని ప్రతిపక్ష నేతలు, స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
ప్రమాదకర స్థాయిలో భారీ హోర్డింగ్స్ ఏర్పాటు చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే విజయసాయిని ప్రసన్నం చేసుకునేందుకు వైసీపీ నేతలు పోటాపోటీగా చూపిన అత్యుత్సాహమే అధికార పార్టీకి తలవంపుగా మారింది. ప్రమాదకరస్థాయిలో ఇంత భారీగా ఉండే హోర్డింగ్స్, కటౌట్లు ఏర్పాటు చేస్తుంటే జీవీఎంసీ అధికారులు ఏం చేస్తున్నారని ప్రతిపక్ష నేతలు, నగర వాసులు ప్రశ్నిస్తున్నారు. అక్రమ కట్టడాలు, నిర్మాణాలంటూ వీకెండ్‌లో విరుచుకుపడే జీవీఎంసీ అధికారులకు ఇంత పెద్దగా ఉన్న హోర్డింగ్స్, కటౌట్లు కనిపించడంలేదా? అని నిలదీస్తున్నారు.