తహశీల్దార్ పై డీజిల్ పోసిన రైతు.. మెదక్ జిల్లాలో కలకలం...
posted on Jun 29, 2021 @ 7:17PM
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో కార్యాలయంలో రెండేండ్ల క్రితం దారుణ ఘటన జరిగింది. భూ సమస్యను పరిష్కరించడం లేదనే ఆగ్రహంతో ఓ రైతు ఎమ్మార్వోపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటన ఎమ్మార్వో కార్యాలయంలోనే సజీవ దహనం కాగా.. నిప్పంటించిన రైతు కూడా తీవ్రంగా గాయపడి.. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కొన్ని రోజుల తర్వాత చనిపోయాడు. ఈ ఘటన అప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం స్పష్టించింది. అలాంటి ఘటనే తాజాగా మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. అయితే రైతు తహశీల్దార్ పై డీజీల్ పోయగానే అప్రమత్తమైన సిబ్బంది... రైతును అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.
మెదక్ జిల్లా శివ్వంపేట తహశీల్దార్ ఆఫీస్‌లో ఈ ఘటన జరిగింది. తహశీల్దార్ ఆఫీస్‌లో రైతు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఆగ్రహంతో తహశీల్దార్ పై డీజిల్ పోశాడు. విద్యుత్ షాక్‌తో తాళ్లపల్లితండా రైతు మృతి చెందాడు. మృతదేహంతో ఎమ్మార్వో ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు గ్రామస్తులు. తమ భూ సమస్యలు పరిష్కరించడం లేదని నిరసన వ్యక్తం చేశారు. సకాలంలో తహశీల్దార్ పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వకపోవడం వల్లనే బాలుకు బీమా డబ్బులు రాలేదని రైతులు ఆరోపించారు.
మంగళవారం రైతులంతా మాలోత్ బాలు మృతదేహంతో శివ్వంపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. అయినా తహసీల్దార్ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఓ రైతు ఒక్తసారిగా తహసీల్దార్ భానుప్రకాశ్‌పై డీజిల్ పోశాడు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. సకాలంలో సిబ్బందితో ఇతర రైతులు స్పందించి రైతును అక్కడి నుంచి తోసేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని రైతులతో చర్చించి ఆందోళన విరమింప చేశారు.