ఒక్క మగాడు.. హైటెన్షన్ వైరు..! కేసీఆర్ కు ఇక తీన్మారేనా..?
posted on Jun 29, 2021 @ 9:12PM
రేవంత్‌రెడ్డి వచ్చాడు.. ఇంకా పీసీసీ పగ్గాలైనా చేతబట్టలేదు.. అప్పుడే కేసీఆర్‌ను చెడుగుడు ఆడుకుంటున్నారు.. కరెంట్ తీగలా కాదు, హైటెన్షన్ వైరులా కొట్లాడుతానంటున్నాడు.. కేసీఆర్ కబంధ హస్తాల్లో బంధీ అయిన తెలంగాణకు విముక్తి కల్పించడమే తన లక్ష్యమన్నారు.. క్యాట్ వాక్ మంత్రి అంటూ కేటీఆర్‌ను.. బండి.. గుండు అంటూ బీజేపీ నేతలను విమర్శలతో తూట్లు పొడుస్తున్నారు.. అదీ లెక్క. ఇప్పటి దాకా ఓ లెక్క.. ఇకపై రేవంత్‌రెడ్డి ఎంట్రీతో మరోలెక్క. తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని అమాంతం మార్చేసే సత్తా.. రేవంత్‌రెడ్డికే ఉందంటున్నారు. అందుకే, కాంగ్రెస్ అధిష్టానం సైతం ఆయన్నే నమ్మింది. కేసీఆర్‌ను ఢీకొట్టే దమ్ము, ధైర్యం రేవంత్‌కే ఉందని భావించింది. రేవంత్‌రెడ్డి తలకు పీసీసీ కిరీటం తొడిగి.. ఢిల్లీలో సోనియమ్మ వీరతిలకం దిద్ది.. కాంగ్రెస్ శ్రేణులను సమరానికి సన్నద్దం చేసేలా దళపతిని కేసీఆర్‌పై దండెత్తడానికి పంపించింది. పీసీసీ చీఫ్‌గా రేవంత్ రాకతో.. ఇక కేసీఆర్‌కు కాక మొదలైనట్టే.. అంటున్నారు.
ఏడేళ్లుగా కేసీఆర్‌కు కరెక్ట్ మొగుడు తగల్లేదంటున్నారు. రేవంత్‌రెడ్డి రాకతో ఇక గులాబీ బాస్‌కు గుండెదడ పెరిగిందంటున్నారు. పీసీసీ చీఫ్‌గా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేసీఆర్‌ను సరిగ్గా ఎదుర్కోలేకపోయారనే టాక్ ఉంది. రేవంత్ కాంగ్రెస్‌లో కొత్తగా చేరడం.. కుదురుకోవడానికి కాస్త టైమ్ పట్టడం.. సొంతపార్టీలోనే సీనియర్ల నుంచి వస్తున్న దాడిని కాచుకోవడంతోనే ఆయనకు సరిపోయింది. ఎక్కడ తగ్గాలో తెలిసిన రేవంత్.. తగ్గాల్సిన చోట తగ్గి.. ఇప్పుడు పీసీసీ చీఫ్‌గా నెగ్గారని అంటున్నారు.
హైకమాండ్ సైతం అంత ఈజీగా రేవంత్‌కు పట్టం కట్టలేదు. అంతా ఆచితూచి.. అన్ని అంచనాలు వేసుకున్నాకే.. ఆయనను ఓకే చేసింది. మాయల మరాఠీ కేసీఆర్‌ను ఎదుర్కోగల మాటల మాంత్రికుడు తెలంగాణలో రేవంత్ ఒక్కడేననే విషయం ఢిల్లీకి స్పష్టమైంది. కేటీఆర్, హరీశ్‌రావు లాంటి కల్వకుంట్ల కోటను ఢీకొట్టి.. ప్రగతిభవన్‌లో దాక్కున్న దొరను బయటకు గుంజడం.. చిచ్చరపిడుగు రేవంత్ వల్లే సాధ్యమనేది అధిష్టానం అంచనా. అందుకు, తగ్గట్టే రేవంత్.. కేసీఆర్ అండ్ కో పై రెచ్చిపోతున్నారు. కాంగ్రెస్‌కు సేవకుడిలా.. కేసీఆర్‌పై దండెత్తే సైనికుడిలా.. ఐదడుగుల బుల్లెట్‌లా.. కేసీఆర్ వైపు దూసుకొస్తున్నారు రేవంత్‌రెడ్డి. ఆయన పిలుపిస్తే.. కేసీఆర్‌పై కలబడటానికి.. గులాబీ బాస్‌ను కుమ్మేయడానికి.. గ్రామగ్రామాన రేవంతన్న ఫ్యాన్స్, కాంగ్రెస్ కేడర్ రెట్టించిన ఉత్సాహంతో రెడీగా ఉన్నారు.
కాంగ్రెస్‌లో మరింత మంది సమర్థులు ఉన్నా.. కేసీఆర్‌ను గద్దె దించాలనే కసి, తపన ఒక్క రేవంత్‌రెడ్డిలోనే ఉందనేది కాదనలేని వాస్తవం. కాంగ్రెస్‌లోని మిగతా నాయకుల్లో చాలామంది కేసీఆర్ విసిరే వలకు చిక్కే చేపల్లాంటి వారే. కాంగ్రెస్‌కు కేసీఆర్‌ను అమాంతం మింగేసే తిమింగళం లాంటోడు కావాలి. ఆ సామర్థ్యం ఒక్క రేవంత్‌రెడ్డిలోనే కనిపిస్తోంది. పైగా రేవంత్‌కు కేసీఆర్‌పై పాత పగ ఒకటి అలానే బాకీ ఉంది. ఓటుకు నోటు కేసులో తనను జైలుకు పంపించిన కేసీఆర్‌ను.. ఎప్పటికైనా జైల్లో పెట్టడమే ఆయన జీవిత లక్ష్యం. అదే కసితో రగిలిపోతూ.. కసిగా పని చేస్తున్నారు రేవంత్. అందుకే కేసీఆర్‌పై రివేంజ్ తీర్చుకునే క్రమంలో.. కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకొస్తారనే అంచనా కాంగ్రెస్‌ది. ఇలా, ఇటు పర్సనల్ రివేంజ్.. అటు పార్టీ ఛాలెంజ్.. ఇలా డబుల్ బ్యారెట్ గన్‌తో గులాబీ బాస్‌పై వార్‌కు సిద్ధమవుతున్నారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. ఢిల్లీ నుంచి ప్రకటన రాగానే.. ఇప్పటికే తెలంగాణ పాలకులను తన గాండ్రింపుతో దడదడలాడిస్తున్నారు.. ఆయన జోష్ ఇలానే కంటిన్యూ అయితే.. ఇక కేసీఆర్‌కు దబిడి దిబిడే. 2023 గెలుపు కేసీఆర్‌కు కత్తి మీద సామే. ఇక కాస్కో కేసీఆర్... అంటున్నారు రేవంత్‌రెడ్డి ఫ్యాన్స్.