కొవిడ్ టీకాకు బదులు రేబిస్ టీకా! నల్గోండ జిల్లాలో నర్సు నిర్వాకం..
posted on Jun 30, 2021 @ 10:08AM
కొవిడ్ టీకా నియంత్రణకు ప్రధాన ఆయుధమని చెబుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశంలో వేగంగా సాగుతోంది. టీకాపై ఉన్న అనుమానాలతో మొదట వేసుకునేందుకు జనాలు ముందుకు రాకపోయినా.. ప్రస్తుతం మాత్రం సీన్ మారింది. కొవిడ్ టీకాల కోసం జనాలు ఎగబడుతున్నారు. దీంతో తమకు అందుబాటులో ఉన్నంత వరకు వ్యాక్సిన్లను రాష్ట్రాలు పంపిణి చేస్తున్నాయి. అయితే కొందరు వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ జనాల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఫోన్లలో మాట్లాడుతూ ఒకరికే ఒకేసారి రెండు డోసులు ఇచ్చిన ఘటనలు వెలుగు చూశాయి. కొందరి డోసు నింపకుండానే ఇంజక్షన్లు ఇస్తున్న వీడియోలు లీకై వైరల్ గా మారాయి. సెకండ్ డోసు విషయంలో ఒకదానికి బదులు మరో వ్యాక్సిన్ వేసిన ఘటనలు భారీగానే బయటకి వచ్చాయి. తాజాగా నల్గొండ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది.
నల్గొండ జిల్లాలో కరోనా టీకా వేయించుకునేందుకు వెళ్లిన ఓ పారిశుద్ధ్య కార్మికురాలికి నర్సు రేబిస్ టీకా ఇవ్వడం కలకలం రేగింది. కట్టంగూరు మండలం బొల్లెపల్లి ప్రభుత్వ పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న పుట్ట ప్రమీల పాఠశాల హెచ్ఎం ఇచ్చిన లేఖ తీసుకుని కరోనా టీకా వేయించుకునేందుకు మంగళవారం కట్టంగూరు పీహెచ్‌సీకి వెళ్లింది. ఇక్కడి పీహెచ్‌సీ భవనంలో సాధారణ టీకాలు ఇస్తుండగా, పక్కనే ఉన్న ఆయుష్ భవనంలో కొవిడ్ టీకాలు వేస్తున్నారు. విషయం తెలియని ప్రమీల పీహెచ్‌సీకి వెళ్లింది. అక్కడ ఉన్న నర్సు అప్పటికే ఓ మహిళకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయగా, అదే సమయంలో వెళ్లిన ప్రమీలకు కూడా అదే సిరంజితో రేబిస్ టీకా ఇచ్చింది.
కొవిడ్ టీకా ఇవ్వాలంటూ టీచర్ ఇచ్చిన లేఖ చూడకుండా తనకు అంతకుముందు ఉపయోగించిన సిరంజితోనే టీకా వేసిందని ప్రమీల ఆరోపించింది. ఒకే సిరంజితో ఇద్దరికి ఎలా వేస్తారని ప్రశ్నిస్తే నర్సు అక్కడి నుంచి వెళ్లిపోయిందని తెలిపింది. బాధితురాలు కొవిడ్ టీకా బ్లాక్‌లోకి వెళ్లకుండా యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఇస్తున్న గదిలోకి వెళ్లడం వల్లే ఈ పొరపాటు జరిగిందని మండల వైద్యాధికారి తెలిపారు. నిజానికి ఆమెకు వేసింది యాంటీ రేబిస్ వ్యాక్సిన్ కాదని, టీటీ ఇంజక్షన్ మాత్రమేనని, దీనివల్ల ఎలాంటి ప్రమాదమూ ఉండదని చెప్పింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దుమారం రేపుతోంది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొల్లు కబుర్లు చెప్పుకుంటూ.. ఫోన్లలో మాట్లాడుతూ జనాల జీవితాలతో ఆటలాడుతున్నారని మండిపడుతున్నారు.