పోలీసులు రావాలంటే దిశ యాప్.. మరి నిందితులు దొరకాలంటే ఏ యాప్?
posted on Jun 29, 2021 @ 5:58PM
జబర్దస్త్ ప్రోగ్రామ్ లో అప్పుడప్పుడు జడ్జిలు కొన్నిడైలాగులు వేస్తారు..అలాగే యాంకర్లు కూడా మధ్యలో ఇన్వాల్వ్ అవుతుంటారు. అప్పుడు వాళ్ల మీద కూడా కంటెస్టెంట్లు వెంటనే పంచ్ లు వేస్తారు. అరే భలే స్పాంటేనిటి అనుకుంటే పొరపాటే. ఢీ డ్యాన్స్ షోలోనూ.. అలాగే క్యాష్ లోనూ కూడా అలాంటివే నడుస్తుంటాయి. అన్నీ ముందే రాసుకున్నవే.. అక్కడ డైలాగులు వదులుతారు. ఏదో అప్పటికప్పుడు వాళ్లు అనేసుకుంటున్నట్లు పాపం ప్రేక్షకులు ఫీలవుతుంటారు. సరిగ్గా అలాంటి తంతే ఈవాళ విజయవాడ భవానీపురంలో జరిగింది.
దిశ యాప్ గురించి ముఖ్యమంత్రిగారు ఏం చెప్పాలి.. కలెక్టర్ గారు ఏం మాట్లాడాలి.. అలాగే పోలీసోళ్లు ఏం చెప్పాలి.. కొందరు మహిళామణులు కన్నీరు కారుస్తూ మరీ జగనన్న అంటే ప్రాణమని ఎలా చెప్పాలి.. దిశ యాప్ ఇన్ స్టాల్ చేసి.. నొక్కగానే పోలీస్ స్టేషన్ కు ఫోన్.. ఆ ఫోన్ మాట్లాడేసి.. 4 నిముషాల్లో స్పాట్ కు పోలీసులు వచ్చేశారు.. ఇవన్నీ కూడా ముందే ఫిక్స్ చేసిన ప్రోగ్రాములే. అంతా స్క్రిప్టెడ్. పాపం దాని కోసం సీఎంగారు.. వారి గణం పడ్డ పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఇంత హైడ్రామాలో డీజీపీ లేకపోవడం మరో హైలెట్. సరే ఇంతకీ ఇంత కష్టం జగన్ గారు ఎందుకు పడ్డారంటే.. అందరికీ గుర్తొచ్చేది కొన్ని రోజుల క్రితమే విజయవాడ సీతానగరంలో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటన.
పాపం ఆ బాధితురాలి మొబైల్ లో దిశ యాప్ లేదు.. దానిని వాడటం తెలియదు.. లేదంటే ఆ అమ్మాయి పోలీసులకు సమాచారం ఇచ్చేది..వారు ఇలాగే ధైర్యం చెప్పి.. నాలుగు నిముషాల్లో వెళ్లేవారు.. కాపాడేవారు. ఆ అమ్మాయి యాప్ వేసుకోకపోవడమే ఇంతటి ఘోరానికి కారణం తప్ప.. తమ వైఫల్యం కాదని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిగారు సవినయంగా ఈ తంతు ద్వారా తెలియచేసినట్లుంది.
సరే .. ఆడపిల్లలకు ధైర్యం చెప్పాలి.. వారిలో మనోధైర్యం పెంచాలి. అందుకోసం దిశ యాప్ ఉంది..మీరు వాడండి.. మేం కాపాడతాం అని చెప్పడంలో తప్పు లేదు. ఇదంతా టెక్నికల్ వర్క్. మరి పోలీస్ వర్క్ ఏమైంది సార్? ఘటన జరిగి 10 రోజులైనా ఇప్పటివరకు నిందితులను పట్టుకోలేదంటే పోలీసులు ఏం వర్క్ చేస్తున్నట్లు? అంటే వాళ్లు కూడా ఏమైనా యాప్ ఇన్ స్టాల్ చేసుకుని నొక్కితే..అప్పుడు స్పాట్ కి వెళ్లి పట్టుకుంటారా? చూస్తుంటే అలాగే ఉంది వ్యవహారం.
ఘటన జరిగిన రోజు మొత్తం ఆరుగురు ఉన్నారు. పడవలో ఉండి మందు కొడుతున్నారు. రెగ్యులర్ గా అక్కడ క్యాంప్ వేసి గంజాయి తాగడం వారికి అలవాటు. ఈ మాట ముందే పోలీసులకు తెలుసు. మరి వాళ్లు రెగ్యులర్ గా అలా చేస్తుంటే వారినెందుకు అరెస్ట్ చేయలేదు? వారిని అక్కడకు రాకుండా ఎందుకు చేయలేకపోయారు? అంటే వాళ్లు అలాగే ఉంటారు.. పొరపాటున వారి కంటన పడి ఎవరైనా ఆడపిల్ల బలవుతుంటే దిశ యాప్ మొబైల్ లో ఓపెన్ నొక్కితే.. అప్పుడు పోలీసులు వస్తారన్నమాట.
ఈ కేసులో ఇంకో చిత్రం కూడా జరిగిందని స్థానికులు చెబుతున్నారు. నిందితులు ఇద్దరూ ఎక్కడికి పారిపోలేదంట. పక్కనే ఉన్న గూడ్స్ షెడ్ దగ్గరే మూడు రోజులు ఉన్నారంట. పోలీసులు మాత్రం 9 టీములను వేసేసి.. తాడేపల్లి అంతా తెగ గాలించేస్తున్నారు.. కాని ఘటన జరిగిన ప్రాంతానికి గజాల దూరంలో ఉన్నచోట మాత్రం చెక్ చేయలేదు. తీరా స్థానికులు చూసి గుర్తుపట్టి పోలీసులకు చెబితే వారు వచ్చి చూస్తుండగానే..కదులుతున్న గూడ్స్ ఎక్కి పారిపోయారు. అదీ మన ఏపీ పోలీస్ పెర్ ఫార్మెన్స్. ఈ పెర్ ఫార్మెన్స్ ను కవర్ చేయడానికి దిశ యాప్ పేరుతో సీఎం గారి పెర్ ఫార్మెన్స్.
ఈ ఎపిసోడ్ లో పాపం హోంమంత్రి మేకతోటి సుచరిత గారిది మరో తొందరపాటు. మరి ఏ అధికారి చెప్పాడో గాని.. రెండోరోజే నిందితులు దొరికేసినట్లు ప్రకటించేశారు. కాని దొరికింది పడవలో పారిపోయినవాళ్లు.. అసలు నేరం చేసిన నిందితులు కాదు. పాపం తెలియక చెప్పి..తర్వాత దానిని కవర్ చేసుకోలేక నానా తంటాలు పడుతున్నారు. ఇప్పటికీ నిందితులను వెతికి పట్టుకోలేని పోలీసులు యాప్స్ఇన్ స్టాల్ చేసుకోమని వెంటపడుతుంటే కామెడీ అనుకోవాలా.. ఇంకేమనుకోవాలా అని జనం ప్రశ్నిస్తున్నారు. ఆడపిల్లలందరినీ దిశ యాప్ వేసుకోమని చెబుదాం..సీఎంగారిని, హోంమంత్రిగారిని.. పోలీసులను మాత్రం నిందితులను వెతికి పట్టుకునే యాప్స్ వాళ్ల మొబైల్స్ లో వేసుకోమని చెబితే పోలా?