ప్రగతి భవన్ గేట్లు తెరవడానికి కారణం ఇదా?
posted on Jun 29, 2021 @ 9:33PM
ప్రగతి భవన్.. తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం. కాని కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాలన్ని ప్రగతి భవన్ కేంద్రంగా సాగుతున్నాయి. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి బయటికి రారని, ప్రగతి భవన్ లోకి ఎవరికి ఎంట్రీ ఉండదనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో విపక్షాల నేతలు సీఎంను కలిసేందుకు ప్రగతి భవన్ కు వెళ్లాలని చూసినా అపాయింట్ మెంట్ రాకపోవడంతో వెళ్లలేకపోయారు. విపక్ష నేతలే కాదు సొంత పార్టీ నేతలకు ప్రగతి భవన్ ఎంట్రీ లేదనే విమర్శలు ఉన్నాయి. ఇటీవలే గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి.. కమలం పార్టీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ కూడా ఇవే ఆరోపణలు చేశారు. సీనియర్ మంత్రి అయినా తనకే ప్రగతి భవన్ లోకి చాలా సార్లు ఎంట్రీ దక్కలేదని చెప్పారు. ప్రగతి భవన్ దగ్గరకు వెళ్లి ఎంట్రీ లేక తిరుగొచ్చి ఎన్నో సార్లు అవమానపడ్డానని తెలిపారు.
అయితే కొన్ని రోజులుగా సీన్ మారింది. ప్రగతి భవన్ గేట్లు తెరుచుకున్నాయి. సీఎం కేసీఆర్ జోరుగా జిల్లాల్లో పర్యటిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అంతేకాదు గతంలో ఎంతగా ప్రయత్నించినా ఎంట్రీ లభించని విపక్ష నేతలకు ప్రగతి భవన్ నుంచి పిలుపులు వస్తున్నాయి. ఇటీవలే కాంగ్రెస్ నేతలు ప్రగతి భవన్ వెళ్లి కేసీఆర్ ను కలిశారు. దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ విషయంలో ఈ భేటీ జరిగింది. తర్వాత దళిత ఎంపవర్ మెంట్ స్కీమ్ అమలుపై ప్రగతి భవన్ లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు కేసీఆర్. ఈ సమావేశానికి బీజేపీ మినగా మిగిలిన పార్టీల నేతలు, ప్రజా సంఘాల , దళిత సంఘాల నేతలు, దళిత సామాజిక వర్గ ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.
కేసీఆర్ వ్యవహార తీరులో మార్పులు, ప్రగతి భవన్ గేట్లు తెరుచుకోవడంపై రాజకీయ వర్గాల్లో పలు చర్చలు సాగుతున్నాయి. ఈటల రాజేందర్ ఎపిసోడ్ తర్వాత కేసీఆర్ రూట్ మార్చారని ఇప్పటివరకు అంతా భావిస్తూ వస్తున్నారు. అయితే తాజాగా పీసీసీ చీఫ్ గా నియమితులైన రేవంత్ రెడ్డి.. ప్రగతి భవన్ గేట్లు తెరుచుకోవడానికి కారణం ఇదేనంటూ కొత్త విషయం చెప్పారు. తనకు పీసీసీ అధ్యక్ష పదవి వస్తుందని నిఘా వర్గాలు నివేదిక ఇవ్వగానే, హడావుడిగా ప్రగతిభవన్ తలుపులు తెరిచారని వ్యాఖ్యానించారు. ఖబడ్దార్ కేసీఆర్.... నీ సంగతేంటో చూస్తా అని హెచ్చరించారు. ఇకపై సాధారణ కరెంటు తీగల్లా కాదు, హైటెన్షన్ వైరులా కొట్లాడతాం అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
హైదరాబాద్ అభివృద్ధికి తండ్రీకొడుకులు చేసింది ఏమీలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. నగరంలో సమస్యలు ఎలాంటివో కేటీఆర్ కు తెలియాలంటే ఆయనను మూసీ నదిలో ముంచి ఓ నాలుగు గంటలు ఉంచాలని సెటైర్ వేశారు. కేటీఆర్ పర్యటనలు అంతా ఫ్యాషన్ పరేడ్ ను తలపిస్తుంటాయని, క్యాట్ వాక్ తరహాలో ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంటారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇక తాను సోదరిగా భావించే సీతక్క గురించి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు. సీతక్క తనతో సరిసమానం అని వివరించారు. ఒకే కుర్చీ ఉంటే ఆ కుర్చీలో తాను సీతక్కనే కూర్చోబెడతానని ఆమె పట్ల తన గౌరవాన్ని చాటారు.