అగ్గిపెట్టె, పిట్టగూడు? ఇల్లంటే ఇదా? ఆ ఇంట్లో జగనన్న ఉంటారా?
posted on Jun 29, 2021 @ 5:31PM
ఇల్లు అంటే.. నాలుగు గోడలు, పైకప్పు కానే కాదు. ఇల్లు అనేది ఓ అనుబంధం. ఇల్లు అనేది ఓ అనుభూతి. ఇల్లు మమతల కోవెలలా మారాలంటే.. అందుకు తగ్గట్టు ఆ ఇల్లు ఉండాలి. విశాలమైన హాల్, వంటకు సరిపడా కిచెన్, కనీసం డబుల్‌బెడ్ పట్టేంత బెడ్‌రూమ్ తప్పనిసరి. అలాంటి ఇంటిలోనే అనురాగాలు విరబూస్తాయి. కానీ, అగ్గిపెట్టె, పిట్టగూళ్లలాంటి ఇల్లు ఉంటే.. అందులో కష్టాలు, కన్నీళ్లే కానీ, సంతోషాలు, అనుభూతుల మాటే ఉండదు. ఏపీలో ప్రభుత్వం నిర్మిస్తున్న జగనన్న ఇళ్ల దుస్థితి అలానే ఉందని అంటున్నారు. పేరుకే అది ఇల్లు.. ఉండటానికి ఇరుకిరుకు. డాబు కోసం, ప్రచారం కోసమే కానీ, పేదలు ఉండటానికి ఆ ఇళ్లు పనికిరావనే విమర్శ వినిపిస్తోంది. ఇళ్ల సంఖ్యను పెంచడానికి.. ఇంటి సైజును బాగా తగ్గించేశారంటున్నారు. 30 లక్షల ఇళ్లంటూ ఆర్బాటమే కానీ, అందులో ఏ ఒక్క ఇల్లు కూడా ఉండటానికి పనికొచ్చేలా లేదంటున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర స్థలంలో, పట్టణాల్లో సెంటు స్థలం ఇళ్లు నిర్మిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇంట్లో హాల్, బెడ్‌రూమ్, కిచెన్, బాత్రూమ్. పేరుకైతే అన్నీ ఉన్నాయి కానీ, అవి ఉన్న తీరే నివాసానికి పనికిరాకుండా ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇళ్లు మరీ చిన్నవిగా అగ్గిపెట్టెల్లా ఉన్నాయంటున్నారు. 24 గజాల్లో బెడ్‌రూమ్. అసలేమైనా సరిపోతుందా? ఓ ఇద్దరు మనుషులు అందులో పడుకోగలరా? 6 బై 4.. సింగిల్‌కాట్ బెడ్ వేస్తేనే గదంతా నిండిపోతుంది. ఇక అటూ ఇటూ నడిచేదెలా? కాస్త పెద్ద సైజు మంచం వేసుకోవాలంటే ఎలా? 24 గజాల్లో ఎవరైనా బెడ్‌రూమ్ కడతారా? తాడేపల్లి ప్యాలెస్‌లో సీఎం జగన్ బాత్రూమ్ కూడా ఇంతకంటే పెద్దదిగా ఉంటుంది. అలాంటిది.. పేదలకు మరీ ఇంత చిన్న బెడ్‌రూమ్ కట్టిస్తే వారు అందులో కాపురం చేసేది ఎలా? అందుకే కాబోలు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి.. జగనన్న ఇళ్ల బెడ్‌రూమ్ కొత్త జంట శోభనానికి పనికి రావు అంటూ ఎద్దేవా చేసింది. మీ పార్టీ ఎమ్మెల్యేనేగా.. ఆయనకు ఆ బెడ్రూమ్ చూసి ఎంత ఇబ్బందిగా అనిపిస్తే ఆ మాట అనుంటారు.. కొంచెం ఆలోచించండి జగనన్నా.. మరీ ఇంత చిన్న బెడ్‌రూమ్ ఏంటన్నా..? ఓసారి మీరొచ్చి ఆ బెడ్‌రూమ్‌లో పడుకొని చూపించండి.. అప్పుడు జనం నమ్ముతారు.. ఆ సైజ్ బెడ్‌రూమ్ పడుకోవడానికి పనికొస్తుందని.. అని అంటున్నారు లబ్దిదారులు.
ఇక, కనీసం హాల్ అయినా విశాలంగా ఉంటుందా? అంటే అదీ లేదు. అసలు దాన్ని హాల్ అని ఎందుకు అనాలనే డౌట్. ఏ యాంగిల్‌లోనూ అది హాల్ సైజులో ఉండదు. చిన్న రూమ్ అంతే. రెండు కుర్చీలు వేస్తే.. ఇక ఖాళీనే ఉందడు. మరీ అంత చిన్న సైజ్ రూమ్ అది. ఇక హాలే అంత చిన్నగా ఉంటే.. ఇక కిచెన్ సైజు గురించి చెప్పేదేమున్నది. అందులోకి వన్‌వే ఎంట్రీనే. ఒకేసారి ఇద్దరు పట్టరు అందులో. ఇక బాత్‌రూమ్ అయితే.. లావుగా ఉన్నవాళ్లు అందులోకి వెళ్లనే లేరు. ఇలా.. నాలుగు అగ్గిపెట్టె గదులను కట్టేసి.. దానికి వైసీపీ రంగులు పూసేసి.. ఇదే జగనన్న ఇల్లు.. పండగ చేస్కోండి అంటే ఎలా? పేరు గొప్ప.. ఇల్లు దిబ్బలా ఉంది యవ్వారం అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పోనీ, ఆ పిట్ట గూడు ఇళ్లైనా గట్టిగా కడుతున్నారా? అంటే అదీ లేదు. నాణ్యత అంతంత మాత్రమే. గట్టిగా గాలి వీస్తే ఇల్లు ఊగిపోతుందా? కుప్ప కూలిపోతుందా? అనే అనుమానం. ఆఫ్రికా లాంటి పేద దేశాల్లో వాడే ఇళ్ల నిర్మాణ శైలితో జగనన్న ఇల్లు కడుతున్నారు. ఇటుకలు లేకుండా ప్లాస్టిక్ వేస్టేజ్‌తో గోడలు కడుతున్నారు. ఇవి ఇక్కడి వెదర్ కండిషన్‌కు సరిపోవని నిపుణులు హెచ్చరించినా.. పాలకులు పట్టించుకోవడం లేదు. చీప్‌గా వస్తున్నాయనే కక్కుర్తితో.. పేదలే కదా ఉండేది.. మేము కాదుగా అనే చిన్నచూపుతో మరీ నాణ్యత లేకుండా జగనన్న ఇళ్లను కడుతున్నారంటూ ఆరోపణలు ఉన్నాయి.
డబ్బులేమన్నా.. జగన్‌రెడ్డి జేబులో నుంచి పెట్టుకుంటున్నారా? కేంద్ర ప్రభుత్వమే కదా ఆ ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం చేసేది. కాస్త మంచిగా, నివాస యోగ్యంగా ఇళ్లు కడితే జగన్ సొమ్మేమైనా పోతుందా? అంటూ జనాలు మండిపడుతున్నారు. సెంటు స్థలంలో ఇల్లేంటంటూ పెదవి విరుస్తున్నారు. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కట్టిన అపార్ట్‌మెంట్స్‌తో ఇప్పటి జగనన్న ఇళ్లను పోల్చి చూపి.. అసహ్యించుకుంటున్నారు. ఒక్క ఛాన్స్ అని అందలమెక్కిస్తే.. మరీ ఇంతటి దౌర్భాగ్య పాలనా అంటూ తమను తామే నిందించుకుంటున్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదల కోసం హైటెక్ భవన సముదాయాలను నిర్మించారు. భూకంపం వచ్చినా చెక్కు చెదరని టెక్నాలజీతో అపార్ట్‌మెంట్స్ కట్టించారు. వాటిని బయటి నుంచి చూస్తేనే.. సూపర్‌గా ఉంటాయి. ఇక లోపలికెళితే అవాక్కవ్వాల్సిందే. అంత విశాలంగా, ఉన్నత ప్రమాణాలతో, మోడ్రన్ ఫ్లాట్స్ నిర్మించారు. అంతా రెడీ.. ఇక ప్రారంభోత్సవమే మిగిలింది అనుకున్న తరుణంలో ప్రభుత్వం మారింది.
పేదల నోట్లో మన్నుకొడుతూ.. ఆ అందమైన అపార్ట్‌మెంట్స్‌ను అలానే నిరూపయోగంగా వదిలేశారు. లబ్దిదారుల సంతోషాలతో సంక్రాంతి పండుగలా కళకళ్లాడాల్సిన ఆ గృహసముదాయాలు.. ఇప్పుడు నిర్మానుషమై.. బూజుపట్టి పోయి.. బూత్ బంగ్లాలుగా మార్చిన కక్ష సాధింపు ధోరణి సీఎం జగన్‌రెడ్డిదే అంటూ లబ్దిదారులు మండిపడుతున్నారు. చంద్రబాబు సీఎంగా ఉండుంటే అంత మంచి ఇళ్లల్లో ఉండాల్సిన వాళ్లం.. ఇప్పుడు జగన్ పాలనలో ఎలాంటి ఇళ్లు ఇస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాడు-నేడు అంటూ అప్పడు చంద్రబాబు హయాంలో కట్టిన ఇళ్లను.. ఇప్పుడు జగన్ కడుతున్న ఇళ్లను కంపేర్ చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులతో పాటు సెటైర్లూ పెడుతున్నారు. పక్కా ఇళ్లు పోయి తొక్కలో ఇళ్లు ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు అంటున్నారని కాదుగానీ.. ఓసారి మీరు వచ్చి ఆ ఇంట్లో ఓ రోజు కాపురం ఉండండి జగన్‌రెడ్డి గారు.. అప్పుడు తెలుస్తుంది మీరు కట్టిస్తున్న ఇల్లు.. ఉండటానికి పనికొస్తుందో లేదో... అంటూ కామెంట్లతో కాక పుట్టిస్తున్నారు.