వీళ్లు ఇన్.. వాళ్లు అవుట్! మంత్రివర్గ విస్తరణ జగన్ కు గండమే..
posted on Jun 29, 2021 @ 7:17PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం దగ్గర పడిందా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రి వర్గ విస్తరణ కసరత్తు ప్రారంభించారా? అంటే అవుననే అంటున్నారు ఏపీ రాజకీయాలను దగ్గర నుంచి చూస్తున్న రాజకీయ విశ్లేషకులు. అయితే ఈ సారి మంత్రివర్గ విస్తరణ విషయంలో ముఖ్యమంత్రి ఆచి తూచి అడుగులు వేయాలని, లేదంటే, కష్టాలు తప్పవని పార్టీ సీనియర్లే హెచ్చరిస్తున్నారు. రాజకీయ విశ్లేషకులు కూడా మంత్రి వర్గ విస్తరణ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి కట్టి మీద సామే అంటున్నారు.
రెండేళ్ళ క్రితం అనుహ్యంగా భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, దేశంలో మరెక్కడా లేని విధంగ ఏకంగా ఐదుగురు ఉప ముఖ్యమంత్రులతో ‘వినూత్న’ మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేశారు. మంత్రి పదవులు ఆశించిన సీనియర్ల కంటే జూనియర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అదే సమయంలో ఆయన మంత్రులు ఎవరూ కూడా ఐదేళ్ళు అధికారంలో ఉంటామని అనుకోవద్దని, రెండున్నరేళ్ళ తర్వాత పాత వారికి ఉద్వాసన పలికి కొత్త వారికి అవకాశం ఇస్తానని చెప్పారు. ఇక ఇప్పుడు ఆ గడువు సమీపిస్తున్న నేపధ్యంలో, ముఖ్యమంత్రి మంత్రివర్గ విస్తరణ కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీంతో అధికార పార్టీలో, లెక్కలు మొదలయ్యాయి.
పెద్దల సభ సభ్యప్రస్తుత మంత్రులలో ఎవరు పదవులు పదిలం, ఎవరికి ముప్పు అనే చర్చతో పాటుగా ఆశావహులలో అదృష్టవంతులు ఎవరన్న చర్చ జోరుగా సాగుతోంది. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తమ తొలి మంత్రివర్గంలో మొత్తం 25 మందికి అవకాశం కల్పించారు. శాసన మండలి రద్దు ప్రతిపాదన నేపధ్యంలో, మంత్రివర్గంలోని పెలు పిల్లి సుభాష్ చంద్ర బోసు, మోపిదేవి వెంకట రమణ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆ ఇద్దరూ రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇప్పుడు, శాసనమండలి రద్దు ప్రతిపాదన వెనక్కి తీసుకున్న నేపధ్యంలో, పెద్దల సభ సభ్యులకు మళ్ళీ మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తారని, పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. తిరుపతి మాజీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కుమారుడు కళ్యాణ్ చక్రవర్తితో పాటుగా మరో ఇద్దరు ఎమ్మెల్సీలకు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. దుర్గాప్రసాద్ ఆకస్మిక మృతితో ఖాళీ అయిన తిరుపతి లోక్ సభ స్థానం నుంచి పోటీకి పార్టీ టికెట్ ఆశించిన ఆయన కుమారుడు కళ్యాణ్ చక్రవర్తికి, తిరుపతికి ఎంపీ టికెట్ కు బదులుగా ఎమ్మెల్సీ పదవితో పాటుగా మంతివర్గంలో స్థానం కలిపిస్తామని అప్పట్లోనే జగన్ రెడ్డి హామీ ఇచ్చారు.
ప్రస్తుత మంత్రులలో కొందరు సీనియర్లతో సహా సగం మందికి ఉద్వాసన తప్పదని అంటున్నారు. దీంతో అప్పుడే చాలామందిలో కనిపిస్తోందన్నది పొలిటికల్ సర్కిల్‌లో జరుగుతున్న ప్రచారం. నిజానికి జగన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయినా, ఆయనతో పాటే కరోనా కూడా రావడంతో మంత్రులకు తమ శాఖల పై పూర్తి స్థాయిలో పట్టు ఏర్పడలేదు. అదీ గాక గతంలో చంద్రబాబు మంత్రివర్గంలో ఉన్న మంత్రులు సీనియర్లు అయినా జూనియర్లు అయినా వారికి నిర్ణయాలు తీసుకునే స్వేఛ్చఉండేది, జగన్ రెడ్డి ప్రభుత్వంలో అంతా వన్ మ్యాన్ షో. అందుకే చాలా వరకు మంత్రులు పేరుకు మాత్రమే మంత్రులుగా ఉన్నారు కానీ, ఆ అధికార హోదాను ఏ విధంగానూ అనుభవించలేక పోయారు. ఇంతలోనే దిగిపోయే సమయం రావడంతో ఆవేదన చెందుతున్నారు.
కొంతమంది సీనియర్లను కీలక శాఖల్లో ఉన్న వారిని తొలిసారి మంత్రి అయిన వారిని కొందరిని కొనసాగిస్తారని తెలుస్తోంది.పిల్లి సుభాష్ చంద్రబోసు, మోపిదేవి స్థానంలో మంత్రులుగా వచ్చిన చెల్లబోయిన వేణుగోపాల కృష్ణ, సిదిరి అప్పలరాజుతో పాటుగా బొత్స, పుష్పలీల, మేకపాటి, అనిల్ యాదవ్, కన్నబాబు, అవంతి శ్రీనివాస్, సుచరిత సీట్లు పదిలం అంటున్నారు. కొత్తగాఛాన్స్ చిక్కేవరిలో వారిలో స్పీకర్ తమ్మినేని పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే మంత్రి పదవిని కోరుతున్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ మంత్రి వర్గంలో పనిచేసిన అనుభవం ఉన్న ఆనం రామా నారాయణ రెడ్డి, పార్థ సారధి వంటి మరికొందరి పేర్లు కూడా ప్రముఖంగా వినవస్తున్నాయి. అంబటి రాంబాబు, తోట త్రిమూర్తులు, రోజా, జోగి రమేష్, కళావతి వంటి ఇంకొన్ని పేర్లు వినిపిస్తున్నాయి.
ఇక ప్రస్తుత మంత్రులలో కొందరు కొంత ధీమాగా ఉన్నా, పాడు కబురు ఎప్పుడు వినవలసి వస్తుందో అని మరి కొందరు మంత్రులు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు ఆశావహులు కూడా తమకు ఈ సారైనా అవకాశం దక్కుతుందా లేదా అని ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యమంత్రి మనస్సులో ఏముందో చివరి వరకు తెలియదు. అయితే తొలి మంత్రివర్గం కూర్పులో చేసిన ప్రయోగాలు మళ్ళీ చేస్తే మాత్రం ముఖ్యమంత్రికి తిప్పలు తప్పవని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.