షర్మిలకు తెలంగాణ సర్కార్ షాక్.. కేసీఆర్ కు కోపం ఎందుకు..?
posted on Jun 30, 2021 @ 10:08AM
తెలంగాణలో కొత్త పార్టీని పెట్టబోతున్న వైఎస్ షర్మిల.. దూకుడుగా వెళుతున్నారు. జూలై8న పార్టీని అధికారికంగా ప్రకటించబోతున్న షర్మిల.. అంతకుముందే వరుస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లాల్లో పర్యటిస్తూ కొవిడ్ మృతుల కుటుంబాలను, రైతులను కలుస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంతో పాటు సీఎం కేసీఆర్ టార్గెట్ గా హాట్ కామెంట్స్ చేస్తున్నారు షర్మిల. కేసీఆర్ కుటుంబ సభ్యులను కూడా వదలడం లేదు. మీడియా సమావేశాలతో పాటు ట్విట్టర్ వేదికగా టీఆర్ఎస్ పై విరుచుకుపడుతున్నారు.
కేసీఆర్ లక్ష్యంగా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న షర్మిలకు సడెన్ గా షాక్ తగిలింది. లోటస్ పాండ్‌లో టీమ్ వైఎస్ఎస్ఆర్ పేరిట ఓ వెబ్‌సైట్ ప్రారంభ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకోసం సోషల్ మీడియాకు చెందిన కార్యకర్తలు లోటస్‌పాండ్ ఆవరణలో ఫ్లెక్సిలు ఏర్పాటు చేశారు. అయితే మంగళవారం రాత్రి పన్నెండు గంటలకు జీహెచ్ఎంసీకి చెందిన డీఆర్ఎఫ్ టీం లోటస్ పాండ్‌కు చేరుకుని మొత్తం ఫ్లెక్సీలను తొలగించింది. ఫ్లెక్సీలపై స్థానిక మాజీ కార్పొరేటర్ ఫిర్యాదు చేయడంతో వీటిని తొలగిస్తున్నట్టు తెలిపింది.
ప్రభుత్వ చర్యలపై షర్మిల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఆర్ఎఫ్ బృందం చేయాల్సిన పనులు ఇవేనా అని ప్రశ్నించారు. అనేక మంది రాజకీయ నాయకుల ఇళ్ల ముందు ప్లేక్సీలు వెలిశాయని..వాటిని అన్నింటిని తీసే దమ్ము మున్సిపల్ అధికారులు ఉందా అని ప్రశ్నించారు. ఇటివల నల్గొండ జిల్లాలోని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిన నిరుద్యోగి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన షర్మిలకు చుక్కెదురైంది.. షర్మిల పరామర్శించేందుకు వెళ్లిన యువకుడితో పాటు కుటుంబ సభ్యులు లేకుండా పోయారు. పోలీసులే బెదిరించి వాళ్లను పంపించి వేశారని షర్మిల పార్టీ నేతలు ఆరోపించారు. నల్గొండ జిల్లాలోనే రైతులను పరామర్శించేందుకు వెళ్లిన షర్మిల కాన్వాయ్‌ను అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు.
వరుసగా జరుగుతున్న ఘటనలతో షర్మిల పార్టీపై కూడా టీఆర్ఎస్ ఫోకస్ పెడుతుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.. పార్టీ ఏదైనా ముందునుండే దెబ్బకొట్టాలనే వ్యుహాంలోకి టీఆర్ఎస్ ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది.